కల్లాల్లో మొలకెత్తిన ధాన్యం

ABN , First Publish Date - 2021-11-24T04:24:08+05:30 IST

వారం రోజులుగా కురిసిన ముసురు వర్షం అన్నదాతలను నిండా ముంచేసింది.

కల్లాల్లో మొలకెత్తిన ధాన్యం
తడిసిన ధాన్యం వద్ద దీనంగా ఉన్న మహిళలు

ప్రారంభం కాని కొనుగోళ్లు 

ఇబ్బందుల్లో అన్నదాతలు

మక్తల్‌, నవంబరు 23 : వారం రోజులుగా కురిసిన ముసురు వర్షం అన్నదాతలను నిండా ముంచేసింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం, ప్రభుత్వ నిర్లక్షం కారణంగా ధాన్యం వర్షాలకు తడిసి మొలకెత్తింది. దీంతో అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో నెల రోజులుగా కల్లాల వద్దనే ధాన్యం నిల్వ చేసుకున్నారు. మరికొందరు పొలాల్లో, రహదారుల పక్కన ధాన్యం ఆరబె డుతుండగా ఎప్పుడుపడితే అప్పుడు చిరు జల్లులు కురుస్తుండటంతో ధాన్యం తడిసి పోతోంది. మక్తల్‌, మాగనూరు, కృష్ణ, ఊట్కూర్‌, నర్వ మండలాల పరిధిలోని గ్రామాల్లో బోరుబావులు, బీమా కాల్వ, చెరువుల కింద వేలాది ఎకరాల్లో వరి సాగు చేశారు. కోత కోసి విక్రయించే సమయంలో ముసురు వర్షాలు కురియడం, కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఓ వైపు రైతుల కోసమే పనిచేస్తున్నామని, ఇది రైతు ప్రభుత్వమని చెప్పే పాలకులు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తేమ శాతంతో నిమిత్తం లేకుండా తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.  





Updated Date - 2021-11-24T04:24:08+05:30 IST