దర్జాగా నకిలీ దందా

ABN , First Publish Date - 2021-05-31T04:08:07+05:30 IST

గద్వాల జిల్లాలో దశాబ్దాల కాలంగా నకిలీ పత్తి విత్తనాల దందా సాగుతోంది.

దర్జాగా నకిలీ దందా
విత్తనాల ను ప్రాసెసింగ్ చేస్తున్న కూలీలు (ఫైల్)

గద్వాల జిల్లాలో రిజెక్ట్‌ చేసిన పత్తి విత్తనాలు విక్రయం 

పట్టించుకోని వ్యవసాయ శాఖ


గద్వాల జిల్లాలో దశాబ్దాల కాలంగా నకిలీ పత్తి విత్తనాల దందా సాగుతోంది. రైతులు పండిస్తున్న పత్తి విత్తనాల్లో విత్తన కంపెనీలు రిజెక్ట్‌ చేసిన వాటిని సీడ్‌ ఆర్గనైజర్లు కొంత మంది దళారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను ఇతర ప్రాంతాలకు తరలించి, రంగులు వేసి, పలు కంపెనీ లేబుళ్లతో అమ్మకాలు సాగిస్తున్నారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ యంత్రాంగం కంటి తుడుపుగా దాడులు చేసి, ఒకటో రెండు కేసులు నమోదు చేస్తున్నారు. మల్ధకల్‌ మండలంలో ఆదివారం 30 క్వింటాళ్ల పత్తి విత్తనాలను పట్టుకున్నారు. పత్తితోపాటు మిరప, మొక్కజొన్న, కంది, కూరగాయల విత్తనాలూ నకిలీవి వస్తున్నాయని రైతులు అంటున్నారు.

- గద్వాల,(ఆంధ్రజ్యోతి)


గద్వాల జిల్లాలో మూడు దశాబ్దాలుగా కాటన్‌ సీడ్‌ సాగవుతోంది. ఐదు ఎకరాల నుంచి మొదలైన ఈ సాగు 45 వేల ఎకరాలకు పెరిగింది. యేటా రైతులు పత్తి విత్తన కంపెనీలకు కోటిన్నర కిలోల విత్తనాలను అందిస్తున్నారు. ఏడాదికి రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల లావాదేవీలు నడుస్తాయి. వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఇక్కడి వరకు బాగా ఉంది. అయితే రైతులు పండించిన విత్తనాలను తీసుకెళ్లి జర్మీనేషన్‌ టెస్టు చేస్తారు. ఈ టెస్టులో ఫెయిలైన విత్తనాలను తిరిగి పంపిస్తారు. ఫెయిలయిన విత్తనాలను తీసుకున్న సీడ్‌ ఆర్గనైజర్లు నకిలీ విత్తనాల దందా సాగిస్తున్నారు. రంగులు పులిమి, పలు కంపెనీల లెబుళ్లలో నింపి అమ్ముతున్నారు. ఫెయిలైన విత్తనాలు బయటికి రాకుండా చూస్తే తప్ప నకిలీ విత్తనాల చెలామణి ఆగదు. ప్రభుత్వం విత్తన కంపెనీలతో మాట్లాడి రిజెక్ట్‌ అయిన విత్తనాలకు ఎంతో కొంత ఇప్పించి, వాటిని క్రాష్‌(నుజ్జునుజ్జు) చేయాలి. ఇలా చేస్తే తప్ప నకిలీ విత్తనాలు ఆగవు. రిజెక్ట్‌ చేసిన విత్తనాలను క్రాష్‌ చేయాలని ప్రభుత్వ జీవోలు ఉన్నా, వాటిని అధికారులు, విత్తన కంపెనీలు అమలు చేయడం లేదు.


800 క్వింటాళ్ల రిజెక్ట్‌ విత్తనాలు

రిజెక్ట్‌ అయిన పత్తి విత్తనాలను కంపెనీలు ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పంపిస్తాయి. అవి బయటకు రావద్దని జీవోలు ఉన్నా, రైతుల పేరుతో బయటకు వస్తున్నాయి. గత సంవత్సరం జిల్లాకు 800 క్వింటాళ్ల రిజెక్ట్‌ విత్తనాలు వచ్చాయి. పోలీసులు ఇప్పటి వరకు పట్టుకున్నవి కేవలం వంద క్వింటాళ్ల మేర మాత్రమే ఉంటాయి. మిగిలిన 700 క్వింటాళ్ల విత్తనాలు ఎక్కడ ఉన్నాయనే విషయంపై పోలీసులు కానీ, వ్యవసాయశాఖ కానీ ఏనాడూ పట్టించుకోలేదు. విత్తనాలు పట్టుకున్న రోజు కేసులు నమోదు చేసి, చేతులు దులుపుకుంటున్నారు.


మిరప, కూరగాయల్లోనూ నకిలీ సీడ్స్‌

జిల్లాలో పత్తి విత్తనాలతోపాటు మిరప, కంది, మొక్కజొన్న కల్తీ విత్తనాలు వస్తున్నాయని, దాంతో దిగుబులు ఆశించిన స్థాయిలో రావడం లేదని రైతులు అంటున్నారు. రైతులకు ఏవి నకిలీ? ఏవి మేలు రకం విత్తనాలు అనే అంశంపై అవగహన కల్పించడంలో వ్యవసాయ శాఖ దశాబ్దాలుగా విఫలమవుతోంది. గద్వాల జిల్లాలో 25 వేల ఎకరాల్లో మిరప సాగు చేస్తారు. నాసిరకం విత్తనాలతో భారీగా నష్టపోయామని రైతులు మూడేళ్లుగా చెబుతున్నారు. నష్టపోయినందుకు రైతులకు ఇస్తామన్న పరిహారం కంపెనీలు పైసా ఇవ్వలేదు. కూరగాయలు జిల్లాలో 15 వేల ఎకరాల్లో సాగు చేస్తారు. హైబ్రిడ్‌ విత్తనాలతో భారీగా దిగుబడులు వస్తాయని చెబుతుండగా, మొక్కలు ఏపుగా పెరిగినా దిగుబడలు మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయని రైతులు అంటున్నారు. జిల్లాలో ఏటా 1,500 మెట్రిక్‌ టన్నుల కూరగాయలు పండిస్తారు. ఇలా అన్ని పంటల్లో నకిలీ విత్తనాలు రావడంతో రైతులు లోదిబోమంటున్నారు.


అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలి

జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు మోసపోవద్దు. నకిలీ విత్తనాలుగా అనుమానం వస్తే మాకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. విత్తనాలను రైతులు ఒకటి రెండు సార్లు ఆరా తీసి కొనుగోలు చేయాలి. తక్కువ ధరతో కొనుగోలు చేసి, దిగుబడుల సమయంలో ఇబ్బంది పడొద్దు. మల్దకలలో 30 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నాం.

- ఎస్పీ, రంజన్‌ రతన్‌కుమార్‌


30 క్వింటాళ్ల పత్తి విత్తనాలు పట్టివేత

మల్దకల్‌: మండలంలోని నేతువానిపల్లె గ్రామంలో రైతులకు విక్రయించడానికి నిల్వ చేసిన రిజెక్ట్‌ చేసిన 30 క్వింటాళ్ల పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు ఆదివారం దాడులు చేసి పట్టుకున్నారు. విత్తనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు. విత్తనాలు నిల్వ చేసిన రైతు నేతన్న పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్‌, ఏడీ సక్రియానాయక్‌, మల్దకల్‌ వ్యవసాయ అధికారి రాజశేఖర్‌, ఎస్‌ఐ శేఖర్‌, కానిస్టేబుల్‌ నిరంజన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-31T04:08:07+05:30 IST