శిథిల గృహాలతో అవస్థలు

ABN , First Publish Date - 2021-12-16T05:10:29+05:30 IST

పట్టణంలోని కాలనీలు, పాత వీధుల్లో శిథిలావస్థలో ఉన్న గృహాలు, కూలిన ఇళ్లు ఇరుగుపొరుగు వారికి సమ స్యగా మారాయి.

శిథిల గృహాలతో అవస్థలు
కుంటవీధిలో శిథిలమైన ఇల్లు

- ఇళ్ల చుట్టూ పెరిగిన ముళ్ల కంపలు

- ఆందోళనకు గురవుతున్న స్థానికులు

- తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి

గద్వాల అర్బన్‌, డిసెంబరు 15 : పట్టణంలోని కాలనీలు, పాత వీధుల్లో శిథిలావస్థలో ఉన్న గృహాలు, కూలిన ఇళ్లు ఇరుగుపొరుగు వారికి సమ స్యగా మారాయి. ముఖ్యంగా కుంటవీధి, తెలుగు పేట, వడ్లవీధి, మోమిన్‌మెహలా, కృష్ణారెడ్డి బంగ్లా తదితర కాలనీల్లో చాలా ఇళ్లు పాతబడి కూలి పోయి మొండి గోడలు మిగిలాయి. వాటిలో ముళ్ల పొదలు పెరిగి, మురుగునీరు నిలిచి పందులకు ఆవాసాలుగా మారాయి. దీనికి తోడు పాడుబడి గోడల్లో పాములు చేరుతున్నాయని, రాత్రి వేళ తమ ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని తొలగించాలని పలు మార్లు మునిసిపల్‌ అధికారుల దృష్టికి కూడా తీసు కెళ్లామని, అయినా ఎలాంటి స్పందనా లేదని కాల నీ వాసులు చెప్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


ఇళ్ల యజమానులకు నోటీసులు ఇవ్వాలి 

అఖిల్‌, కుంటవీధి : గద్వాల జిల్లా కేంద్రంగా ఏర్పడిన కొత్తలో కంప చెట్ల తొలగింపునకు అప్పటి ఎస్పీ విజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ చూపారు. అదే విధంగా ఇప్పటి అధికారులు కూడా సంబంధిత యజమానులకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలి. మునిసిపల్‌ అధికారులు, పోలీసులు చొరవ తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. 


చీకటి పడితే భయం 

మనోజ్‌, కుంటవీధి : రాత్రి ఏడు తరువాత ఇళ్లకు వెళ్లాలంటే భయమవుతోంది. పాములు సంచరిస్తున్నందున మరీ ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా పాడుబడిన ఇళ్లను తొలగించేందుకు మునిసిపల్‌ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. దీనిపై కౌన్సిలర్లు కూడా స్పందించి సమస్య ను పరిష్కరించాలి. 


ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తా 

బండల పాండు, కౌన్సిలర్‌ : పట్టణంలోని పురాతన వీధుల్లో ఒకటైన కుంటవీధిలో ఐదు పాడుబడిన ఇళ్లు ఉన్నాయి. వాటిలో రెండు ఇళ్లను సొంత ఖర్చుతో తొలగించాం. మిగతా ఇళ్ల యజమానులకు నోటీసులు పంపించి, మూ డు వారాల గడువు ఇచ్చి చూస్తాం. అప్పటికీ వారు స్పందించకపోతే మునిసి పాలిటీ ద్వారా ఇళ్లను తొలగిస్తాం. ఆ ఇళ్ల యజమానులతో అదనంగా రుసుము వసూలు చేస్తాం. 

Updated Date - 2021-12-16T05:10:29+05:30 IST