ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2021-12-30T05:33:30+05:30 IST
జిల్లాకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలు పరిశీలించి, కేటాయింపులు చేస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

- జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల క్రైం, డిసెంబరు 29 : జిల్లాకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలు పరిశీలించి, కేటాయింపులు చేస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆధ్యక్షతన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియలో భాగంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన 286 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కౌన్సెలింగ్ ద్వారా పోస్టులను కేటాయించి నట్లు తెలిపారు. నాన్ టీచింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెం ట్లు ముగ్గురు, ఆఫీస్ సబార్డినేట్లు ఇద్దరు మొత్తం ఐదుగురు, 277 మంది ఉపాధ్యాయులు రిపోర్టు చేశారని తెలిపారు. మరో నలుగురు రిపోర్టు చేయలేదని చెప్పారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన ఫైల్స్‌ను పరిశీలించారు. జిల్లాకు కొత్తగా వచ్చిన వారు సీనియారిటీ చెక్ చేసుకోవాలని సూచించారు. పోస్టింగ్ అయిన వెంటనే జిల్లా అధికారికి రిపోర్టు చేయాలన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు అంతకు ముందు ఏ జిల్లాలో పనిచేశారు, అపాయింట్‌మెంట్ అథారిటీ, సీనియారిటీ జాబితా తదితర వివరాలను క్రాస్‌చెక్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారికి సూచించారు. అన్ని వివరాలను తప్పనిసరిగా పరిశీలించి వారి పూర్తి వివరాలు నమోదు చేయించిన తర్వాతే ప్రొసీడింగ్ ఇవ్వాలని చెప్పారు. ఉమ్మడి జిల్లాల సీనియారిటీ జాబితా, సవరించిన జాబితాలను చెక్ చేసుకోవాలని చెప్పారు. కేటాయింపు ప్రక్రియలో సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జిల్లావిద్యాశాఖాధికారి సిరాజుద్దీన్ పాల్గొన్నారు.