పత్తి రైతు పరేషాన్‌

ABN , First Publish Date - 2021-10-08T05:18:58+05:30 IST

కూలీల సమస్యతో పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 5,44,433 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. పత్తి 3 లక్షలా 52 వేలా 746 ఎకరాల్లో నాటారు. పత్తి ఇప్పుడు చేతికొచ్చింది.

పత్తి రైతు పరేషాన్‌
అచ్చంపేటలో పత్తి తీస్తున్న కూలీలు

కూలీలు దొరకక అవస్థలు

విద్యార్థులు, ముసలి వారు పత్తి చేలకు పరుగులు

వర్షాలు కురుస్తుండటంతో తెల్లబంగారం నల్లబారుతుందని ఆందోళన

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 3,52,746 ఎకరాల్లో సాగు


అచ్చంపేట, అక్టోబరు 7: కూలీల సమస్యతో పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 5,44,433 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. పత్తి 3 లక్షలా 52 వేలా 746 ఎకరాల్లో నాటారు. పత్తి ఇప్పుడు చేతికొచ్చింది. ఒకవైపు వర్షాలు కురుస్తుండటం, మరోవైపు కూలీల కొరత ఉండటంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి సకాలంలో తీయకపోతే వర్షాల వల్ల నల్లబారే ప్రమాదం నెలకొంది. దాంతో రైతులు పది రోజులుగా పత్తి పొలాలకు పరుగులు పెడుతున్నారు. కూలీలు దొరకక పోవడంతో కుటుంబ సభ్యులంతా వెళ్లి పత్తి తీస్తున్నారు. ముసలివాళ్లు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను సైతం తీసుకెళ్తున్నారు. ఇదే అదునుగా కూలీలు అధిక డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. కూలి రూ.300 ఉండగా రూ.500 డిమాండ్‌ చేస్తున్నారు. గత్యంతరం లేక రైతులు చెల్లిస్తున్నారు. మరికొందరు కూలీలు కేజీ పత్తికి రూ.7 నుంచి రూ.10 చొప్పున డబ్బులు తీసుకుంటున్నారు. ఎకరా పత్తి తీసేందుకు రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకు ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు.


సాగు ఇలా..

జిల్లా వ్యాప్తంగా 3 లక్షలా 52 వేలా 746 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరా పొలంలో పత్తి తీసేందుకు రోజుకు దాదాపు 20 మంది కూలీలు అవసరం ఉంటుంది. గతంలో ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం ఎకరా పత్తి సాగు చేయాలంటే రూ.10 వేలకుపైగా పెట్టుబడి అవుతుండగా, దిగుబడి మాత్రం 4 నుంచి 6 క్వింటాళ్లకు పడిపోయింది. మరోవైపు అధిక వర్షాలు కురిస్తే రైతులు మొత్తానికే నష్టపోతున్నారు.





Updated Date - 2021-10-08T05:18:58+05:30 IST