పల్లెల్లో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2021-05-19T03:57:50+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా జనం పట్టణాల నుంచి పల్లెలకు రావడంతో గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.

పల్లెల్లో కరోనా విజృంభణ
కొల్లాపూర్‌లోని కరోనా పరీక్షల కేంద్రం వద్ద గుమిగూడిన జనం

లాక్‌డౌన్‌తో సొంత గ్రామాలకు చేరుతున్న జనం

గ్రామాల్లో టెస్టులు.. కిట్లు లేవు

ఇంటి వద్దే సొంత చిట్కాలు పాటిస్తున్న ప్రజలు

తగ్గకుంటే ఆర్‌ఎంపీల వద్దకు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెండో దశలో 15,658 కేసులు 

79 మంది మృతి


కొల్లాపూర్‌, మే 18: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా జనం పట్టణాల నుంచి పల్లెలకు రావడంతో గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. రెండో దశ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 15,658 కేసులు అధికారికంగా నమోదయ్యాయి. అందులో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 8,607 ఉండగా, 7,027 మంది కోలుకున్నారు. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 79 మంది మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా, అనధికారికంగా ఆ సంఖ్య వందల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహించకపోవడం, కిట్లు ఇవ్వకపోవడంతో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మండల కేంద్రాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు వంద మందికిపైగానే పరీక్షలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రవాణా సదుపాయాలు లేకపోవడంతో గ్రామీణులు మండల కేంద్రాలకు రాలేకపోతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు లక్షణాలు ఉంటే చాలా మంది ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటున్నారు. తగ్గకపోతే మెడికల్‌ షాపునకు వెళ్లి కరోనా కిట్లు తీసుకుని వాడుతున్నారు. లేదంటే ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.  ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే చివరి దశలో నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పతులకు వెళ్తున్నారు. పరిస్థితి విషమించి చనిపోతున్నారు.

గ్రామాల్లోనే ఎక్కువ కేసులు: జిల్లాలో అధిక కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండాలో రెండు రోజుల్లోనే 109 కేసులు నమోదయ్యాయి. దాంతో జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. అచ్చంపేట మండలం ఐతోల్‌, పదర మండలం కొత్తకుంటపల్లి, వంగూరు మండలంలో రంగాపూర్‌ తండాలో ఎక్కువ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. నల్లమల అటవీ గ్రామాల్లో, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న గిరిజన తండాలు, చెంచుగూడెంలలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి కిట్లు అందజేసే పరిస్థితి లేకుండాపోయిందని గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు మండల కేంద్రాలకు చేరుకొని పరీక్షలు చేయించుకునే పరిస్థితి లేదని, చెంచుగూడెంలు, తండాలు, నల్లమల గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

పాజిటివ్‌ వచ్చినా ఊళ్లో సంచారం: పాజిటివ్‌ వస్తే ఒక గది, ఇరుకు గదులు ఉన్న వారు ఇళ్లలో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొందరు పాజిటివ్‌ వచ్చిందని తెలిస్తే దూరంగా పెడతారని విషయం చెప్పకుండా గ్రామాల్లో దర్జాగా తిరుగుతున్నారని తెలుస్తోంది. పక్కవారే ఇంటి ముఖం చూడరని, కనీసం కూరగాయలు కూడా తెచ్చుకునే పరిస్థితి ఉండదని భావిస్తున్నారని తెలుస్తోంది. 17 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే సొంత పనులు, వ్యవసాయ పనులు చేసుకోలేకపోతామని భయపడుతున్నారని సమాచారం. మరికొందరు ఐసోలేషన్‌ కేంద్రాల నుంచి మధ్యలోనే వచ్చి ఊళ్లలో తిరుగుతున్నారని తెలుస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లోనూ పరీక్షలు నిర్వహించాలి: ప్రస్తుతం మండల కేంద్రాల్లో రోజుకు 70 నుంచి 100 మంది వరకు మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారు. దాంతో మండల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాల వద్ద జనం గుమిగూడుతున్నారు. దాంతో ఇతరులకూ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి గ్రామాల్లోనూ పరీక్షలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-05-19T03:57:50+05:30 IST