2023లో కాంగ్రెస్‌దే అధికారం

ABN , First Publish Date - 2021-11-01T03:20:29+05:30 IST

2023 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోందని, 78 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నామని టీపీసీసీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ జోస్యం చెప్పారు.

2023లో కాంగ్రెస్‌దే అధికారం
సమావేశంలో మాట్లాడుతున్న మాణిక్కం ఠాగూర్‌

నవంబరు 14 నుంచి 21 వరకు జనజాగరణ పాదయాత్రలు

నారాయణపేట జిల్లాలో పాదయాత్రకు టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌

పీసీసీ ఇన్‌ చార్జి మాణిక్కం ఠాగూర్‌


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోందని, 78 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నామని టీపీసీసీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ జోస్యం చెప్పారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం జరిగిన పార్టీ పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీ కార్యకర్తలు క్రియాశీలకమవ్వాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కేంద్ర సర్కార్‌ వల్ల అదానీ, అంబానీల ఆస్తులు పెరిగితే, తెలంగాణ సర్కార్‌ వల్ల కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. ఈ 24 నెలలు కార్యకర్తలు, నాయకులు కష్టపడితే, రాబోయే 20 ఏళ్లు ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించవచ్చని అన్నారు. బూత్‌ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేద్దామని, ఈ ప్రక్రియలో మండల కమిటీలు చాలా కీలకమని చెప్పారు. వీరు ప్రజల్లో నిత్యం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 


మోదీ, కేసీఆర్‌ దొందూ దొందే..

మోదీ, కేసీఆర్‌ పాలనల్లో ధన రాజకీయాలు పెరిగిపోయాయని అన్నారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంపు, రాష్ట్రంలో రైతుల ఇక్కట్లపై నిరసనగా నవంబరు 14 నుంచి 21 వరకు అన్ని మండలాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జనజాగరణ పాదయాత్రలు నిర్వహించాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క సహ ఏఐసీసీ బాఽధ్యులు, బూత్‌ కమిటీ సభ్యుల వరకు అన్ని స్థాయిల నాయకులు ఈ పాదయ్రాత్రలో పాల్గొంటారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నారాయణపేట జిల్లాలో పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. వారం రోజుల పాటు నిరంతరాయంగా ఈ పాదయాత్రలు కొనసాగాలని సూచించారు. ఈ సందర్భంగా మాణిక్కం ఠాగూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపి, మండల పార్టీల అధ్యక్షులతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి తీసుకుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమీక్షల్లో ఏఐసీసీ కార్యదర్శులు డాక్టర్‌ జి. చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, బోసురాజు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, శివకుమార్‌రెడ్డి, డాక్టర్‌ వంశీకృష్ణ, పీసీసీ కార్యదర్శులు జీ.మధుసూదన్‌రెడ్డి, ఎన్‌పీవెంకటేశ్‌, జే.అనిరుధ్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, నాయకులు అనిత, సంజీవ్‌ ముదిరాజ్‌, దుష్యంత్‌రెడ్డి, సీజే బెనహర్‌, జే.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T03:20:29+05:30 IST