పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-12-16T05:11:49+05:30 IST

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి వైద్యశాఖ అధికారులకు సూచించారు.

పనులు వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- వైద్యశాఖ అధికారులతో సమీక్ష 

గద్వాల క్రైం, డిసెంబరు 15 : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి వైద్యశాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండేలా జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలన్నారు. ప్రహరీ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, జనరేటర్‌, మెడికల్‌ వార్డులో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఐసీయూకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉంటే పూర్తి చేయాలని సూచించారు. అయిజ, అలంపూర్‌ ఆసుపత్రులకు సంబంధించిన స్లాబ్‌, ఇతర నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్‌, ఇతర ల్యాబ్‌ల నిర్వహణ సక్రమంగా ఉండాలని, రేడియాలజీ ల్యాబ్‌ ఏర్పాటుకు స్ధలాన్ని గుర్తించి, దానికి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలంపూర్‌ ఆసుపత్రికి ఒక ఆంబులెన్స్‌, గైనకాలజిస్ట్‌ తప్పనిసరిగా అవసరం ఉన్నందున, అందుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఆసుపత్రిలో సమస్యలను గుర్తించి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలను పంపించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో శానిటేషన్‌ విభాగంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారో తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. రోగులపై విసుక్కోకుండా వారితో సహృద్భావంతో వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంటే, నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. రిక్రూట్‌మెంట్‌కు ఏమైనా సమస్యలున్నాయా అని ఆరా తీశారు. జిల్లా ఆసు పత్రిని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు త్వర లోనే విజిట్‌ చేస్తారని తెలిపారు. అప్పటివరకు ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, సూపరింటెండెంట్‌ కిశోర్‌కుమార్‌, డాక్టర్లు శశికళ, శోభారాణి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T05:11:49+05:30 IST