ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
ABN , First Publish Date - 2021-10-26T05:00:29+05:30 IST
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.

- ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలి
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల క్రైం, అక్టోబరు 25 : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయం, ఉద్యానవన శాఖల అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం మదనాపురం నుంచి వచ్చిన శాస్త్రవేత్తలతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు మండల వ్యవసాయ అధికారులు గ్రామాలలో పంటల సాగుపై పక్కా ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. వరికి బదులుగా శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర తదితర పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అందుబాటులో ఉన్న విత్తనాల గురించి వారికి తెలియజేయాలన్నారు. ఎంత మంది రైతులు ఉన్నారు, ఎన్ని రకాల భూమి సాగు చేస్తున్నారు, ముందు ఏ పంటను పండించారు, ఇప్పుడు ఏమి పండిస్తున్నారని తదితర వివరాలతో జాబితాను తయారు చేయాలన్నారు. మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు అన్ని గ్రామాలలో రైతు వేదిక సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని, విత్తనాల నాణ్యతపై అవగాహన కల్పించాలన్నారు.
వ్యాక్సిన్ వేయించుకోని వారికి పెన్షన్, రేషన్ కట్
కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఆసరా పెన్షన్, రేషన్‌ను ఆపేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రత్యేక అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసే విధంగా అఽధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల వారీగా ఎంత శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేయించుకోని వారి జాబితాను తయారు చేయాలని, వారికి ఆసరా పెన్షన్లు, రేషన్‌ను ఆపేయాలని ఆదేశించారు. సెప్టెంబరులో మొదటి డోసు వేయించుకున్న వారికి వారు 84 రోజుల తర్వాత (డిసెంబరు) రెండవ డోసు వేయడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గట్టు మండలంలో వాక్సినేషన్ శాతం తక్కువగా ఉన్నందున, వంద శాతం పూర్తయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, వైద్యాధికారి చందూనాయక్, డీఆర్డీఏ ఉమాదేవి, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 75 ఫిర్యాదులు
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 75 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ శ్రుతి ఓఝా ఫిర్యాదులను స్వీకరించి, బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.