పర్మిషన్‌ పేరుతో కాసుల గలగల

ABN , First Publish Date - 2021-02-22T03:55:45+05:30 IST

ఇసుక పర్మిషన్లు తహసీల్దార్‌ కార్యాలయం అధికారులకు కాసులు కురిపిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. రెండు మూడు నెలల నుంచి మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనుల పేర సర్పంచ్‌ల ద్వారా ఇసుక వ్యాపారులు ధ్రువపత్రాలను తెస్తున్నారు.

పర్మిషన్‌ పేరుతో కాసుల గలగల
మహ్మదాబాద్‌ వాగులో ఇసుకను ట్రాక్టర్‌కు నింపుతున్న కూలీలు

డబ్బులు తీసుకుని ఇసుకకు అనుమతులు

తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ అధికారి చక్రం

ఒక్కో  ట్రాక్టర్‌కు రూ.1,000 నుంచి రూ.2,000 వసూలు

 ఇచ్చిన పనులకే మళ్లీ పర్మిషన్లు


గండీడ్‌, ఫిబ్రవరి 21: ఇసుక పర్మిషన్లు తహసీల్దార్‌ కార్యాలయం అధికారులకు కాసులు కురిపిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. రెండు మూడు నెలల నుంచి మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనుల పేర సర్పంచ్‌ల ద్వారా ఇసుక వ్యాపారులు ధ్రువపత్రాలను తెస్తున్నారు. అవి తెచ్చిందే తడవుగా కార్యాలయంలోని ఓ అధికారి ట్రాక్టర్‌కు రూ.1,000 నుంచి రూ.2,000 వసూలు చేస్తూ పర్మిషన్లు ఇస్తున్నారని సమాచారం. దీంతో మండలంలోని వాగుల్లో ఎక్కడ చూసినా ఇసుక ట్రాక్టర్లే దర్శనమిస్తున్నాయి. మహ్మదాబాద్‌, అన్నారెడ్డిపల్లి, ధర్మాపూర్‌, రంగా రెడ్డిపల్లి, సాలానగర్‌, పీర్లబండ, గొవిందుపల్లి, కంచన్‌పల్లి వాగుల నుంచి ట్రాక్టర్లు నిత్యం ఇసుకను తరలిస్తున్నాయి. ఇసుకకు సంబంధించి ప్రభుత్వ పనులను రోజూ పరిశీలించి, ఎంత ఇసుక అవసరం ఉందో గుర్తించి ఏఈల ద్వారా ఎస్టిమేషన్‌ కాపీలను జత చేయాల్సి ఉంది. కానీ అధికారులు కుమ్మక్కయ్యి అవేవీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. రోజూ వివిధ గ్రామాలకు పనుల పేరున కార్యాలయం నుంచి 30 నుంచి 40 ట్రాక్టర్లకు పర్మిషన్లు ఇస్తున్నా రు. మరోవైపు ఇచ్చిన పనులకే మళ్లీ పర్మిషన్లు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.


ట్రాక్టర్‌కు ఇసుకకు రూ.1,000


వాగులోకి ట్రాక్టర్‌ వెళ్లిందంటే చాలు వాగు సమీపంలోని రైతులు వాగు తమదని, తమ పొలానికి అనుకొని ఉందని రూ.1,000 నుంచి రూ.1,500 ఇస్తేనే ఇసుక నింపుకోవాలని చెబుతున్నారు. విధిలేని పరిస్థితిలో వ్యాపారులు వారికి డబ్బులు ఇచ్చి, ఇసుకను తరలిస్తున్నారు.

రెండింటికి పర్మిషన్‌.. నాలుగింటితో రవాణా

కొందరు రెండు ట్రాక్టర్లకు మర్మిషన్‌ పర్మషన్‌ తెచ్చుకుని నాలుగు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. మరోవైపు రెండు ట్రిప్పులకు పర్మిషన్‌ ఉండగా, వ్యాపారులు పది  ట్రిప్పుల వరకు ఇసుకను తరలిస్తు న్నారు. మరికొందరు అధికారుల అండదండలతో పర్మి షన్‌ సమయం ముగిసినా ఇసుకను తరలిస్తున్నారు.


పట్టుబడ్డ ట్రాక్టర్లలకు తిరిగి పర్మిషన్‌


ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడి, సీజ్‌ అయ్యి జరిమానాలు విధించిన ట్రాక్టర్లకు ఇసుక తరలింపునకు తిరిగి పర్మిషన్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజుల కిందట పర్మిషన్‌ పేరుతో ప్రైవేట్‌ నిర్మాణాలకు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకొని, సీజ్‌ చేసి జరిమానా విధించారు. అలాంటి ట్రాక్టర్ల యజమానులకు తిరిగి పర్మిషన్‌ ఇస్తున్నారని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.


డబ్బులు తీసుకుంటే చర్యలు

ఇసుక తరలింపునకు అనుమతులు ఇచ్చేందుకు పర్మిషన్ల కోసం కార్యాలయంలో ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నట్లు మా దృష్టికి వస్తే విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటాం. కొనసాగుతున్న ప్రభుత్వ పనులకు మాత్రమే పర్మిషన్లు ఇస్తున్నాం. పనుల దగ్గర మా సిబ్బందితో పర్యవేక్షణ చేయించి, సంబంఽ దిత ఏఈ ధ్రువపత్రాలతో వచ్చిన వాటికి మాత్రమే పర్మిషన్లు ఇస్తున్నా. ఉదయం 11 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు తరలింపునకు అనుమ తి ఇస్తున్నాం. పర్మిషన్‌ లేని ట్రాక్టర్లు నడుస్తున్నట్లు మా దృష్టికి వస్తే వాటిపైన పీడీ యాక్టు కేసులు నమోదు చేయిస్తాం.

- జ్యోతి, తహసీల్దార్‌, గండీడ్‌ 



Updated Date - 2021-02-22T03:55:45+05:30 IST