గంజాయి.. ఎంజాయ్..
ABN , First Publish Date - 2021-11-07T04:47:54+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లాలో గంజాయి సాగు యథేచ్ఛగా సాగుతోంది. దుండగులు రైతుల పొలాలను కౌలుకు తీసుకుని మొక్కలను పెంచుతున్నారు.
గద్వాల జిల్లాలో సాగు
రైతుల పొలాలను కౌలుకు తీసుకొని మొక్కలను పెంచుతున్న వైనం
ఇతర ప్రాంతాల నుంచి గంజాయి చాక్లెట్లు,
హుక్కా డ్రగ్స్ తెచ్చి విక్రయం
11 మంది అరెస్టు.. 9 కేసులు నమోదు..
475 మొక్కలు కాల్చివేత
జోగుళాంబ గద్వాల జిల్లాలో గంజాయి సాగు యథేచ్ఛగా సాగుతోంది. దుండగులు రైతుల పొలాలను కౌలుకు తీసుకుని మొక్కలను పెంచుతున్నారు. పోలీసులు విషయం తెలిసినప్పుడు మొక్కలను నాశనం చేస్తున్నారే తప్ప, అందుకు సంబంధించిన మూలాల గురించి పట్టించుకోకపోవడంతో రోజుకో చోట కేసులు వెలుగు చూస్తున్నాయి. గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను తీసుకొచ్చి, గద్వాలలో విక్రయించడం కలకలం రేపుతోంది.
- గద్వాల క్రైం
గద్వాల జిల్లాలో గంజాయి సాగు కలకలం రేపుతోంది. దళారులు ఒకవైపు మొక్కలను పెంచుతుండగా, మరికొందరు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి చాక్లెట్స్, హుక్కా, డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నారు. లక్షల రూపాయలు గడిస్తున్నా రు. గద్వాల, వనపర్తి జిల్లాల్లో గంజాయి సాగు ఎక్కువగా ఉందని రాష్ట్ర ఉన్నతాధికారులు ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో, ఎక్సైజ్, పోలీస్ అఽధికారులు గత కొన్ని రోజుల నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. దాడుల్లో రైతుల పొలాలను కౌలుకు తీసుకుని, గంజాయి సాగు చేస్తున్నట్లు బయటపడింది. కొంతమంది దళారులు వెనుక ఉండి గంజాయి సాగు చేయిస్తున్నారు. పోలీసులకు పట్టుపడితే వారిపేరు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
నమోదైన కేసులు..
- గత అక్టోబరు 26న అయిజ మండలం కుర్వపల్లి శివారులోని వ్యయసాయ పొలంలో పోలీసులు దాడులు నిర్వహించి, 174 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. అదే రోజు ఇటిక్యాల మండలం వావిలాల గ్రామ శివారులో గంజాయి సాగు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి, 270 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.
- అక్టోబరు 27న అయిజ మండలం దేవబండ శివారులో పొలం కౌలుకు తీసుకొని, గంజాయి సాగు చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. 43 మొక్కలు స్వాధీనం చేసుకొని, ఎక్సైజ్ అధికారులు కాల్చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు అయిజ, ఇటిక్యాల, గట్టు, గద్వాల ఎక్సైజ్ స్టేషన్‌ల పరిధిలో గంజాయి సాగుకు సంబంధించి కేసులు నమోదు చేశారు. అదే విధంగా 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వారి నుంచి 475 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని, కాల్చేసినట్లు పేర్కొ న్నారు.
సూత్రదారులపై లోపిస్తున్న నిఘా..
అధికారులు గంజాయి మొక్కల గురించి తెలిసినప్పుడు అధికారులు ప ట్టుకొని కాల్చేస్తూ, నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. కానీ, అసలైన సూత్రదారులు ఎవరు, ఎక్కడి నుంచి ఈ విత్తనాలు రవాణా అవుతున్నాయి?, ఎవరు వీటిని మధ్య దళారులకు పంపుతున్నారు? అనే విషయాలపై నిఘా పెట్టడం లేదు. దాంతో జిల్లాలో గంజా యి సాగు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు.
గంజాయి సాగును సమూలంగా నాశనం చేస్తాం
జోగుళాంబ గద్వాల జిల్లాలో గంజాయి సాగుపై దాడులు నిర్వహిస్తున్నాం. దానిని సాగుచేసే వారిపై కేసులు నమోదు చేశాం. అయితే, ఇతర ప్రాంతాల నుంచి గంజాయి చాక్లెట్లు, ఇతర మత్తు పదార్థాలు రవాణా అయ్యే విషయంపై నిఘా ఉంచాం. యువత పెడదారిన పడకుండా, గంజాయికి దూరంగా ఉం డేలా తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. యువత గంజాయికి బానిసలు కావొద్దు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విషయం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
- గోపాల్, ఎక్సైజ్ సీఐ, గద్వాల
