కొను‘గొల్లు’
ABN , First Publish Date - 2021-11-27T04:03:17+05:30 IST
ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వడ్లు కొనమంటే తేమ ఎక్కువ ఉన్నదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతుండగా, ఆరబెడదామంటే వర్షాలు అడ్డుగా మారుతున్నాయి.

ధాన్యం విక్రయాల్లో అన్నదాత ఇక్కట్లు
వివిధ కారణాలు చూపుతూ కొనుగోలు చేయని వైనం
వర్షాలకు తడిసి మొలకెత్తిన వడ్లుకొని ఆదుకోవాలంటున్న అన్నదాత
ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వడ్లు కొనమంటే తేమ ఎక్కువ ఉన్నదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతుండగా, ఆరబెడదామంటే వర్షాలు అడ్డుగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం ఆరబెట్టి, రాశులు పోసే క్రమంలో తడిసింది. కొన్ని చోట్ల మొలకలు కూడా వచ్చాయి. రంగూ మారాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిందని, తడిసి, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
- మహబూబ్‌నగర్,(ఆంధ్రజ్యోతి)
అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోలులో ప్రభుత్వ జాప్యం రైతులకు శాపంగా మారింది. తేమ శాతం పేరుతో వ్యాపారులు ధర తగ్గిస్తుండటంతో కల్లాల్లోనే ఎండబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తరుముకొస్తున్న మబ్బులు, కురుస్తున్న జల్లులతో ధాన్యం తడిసి, మెలకెత్తుతుండటంతో నిలువునా మునిగిపోతున్నారు. ధాన్యం ఆరకమునుపే మళ్లీ మళ్లీ రాశులు పోస్తుండడంతో రంగుమారుతోంది. ఈ క్రమంలో తేమశాతం ఎక్కువగా ఉందని, రంగు మారిందని ఇటు వ్యాపారులు, అటు ప్రభుత్వ రంగ సంస్థలు ధాన్యం కొనకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. క్వింటాలుకు మద్దతు ధర రూ.1888 దక్కడం లేదు. మార్కెట్లలో రూ.1,400లకు లోపే అమ్ముకుంటున్నారు. కొందరు రైతులు కల్లాల వద్దే వచ్చిన ధరకే వ్యాపారులకు ఇస్తున్నారు.
కారణాలు చూపుతూ కొర్రీలు
పేరుకు జిల్లాలో 172 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా, రకరకాల కారణాలు చూపుతూ ధాన్యం కొనడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈసీజన్‌లో దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటే, ఇప్పటివరకు కేవలం 40 వేల మెట్రిక్ టన్నులకు లోపే కొన్నారు. మార్కెట్లలోనూ కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కోతలు ముగిసి నెలన్నర, కల్లాలు వేసి ఇంకో నెల రోజులు గడుస్తున్నా ఽధాన్యం అమ్ముకోలేక నష్టపోతున్నామని అంటున్నారు. ప్రభుత్వం కనీసం తమవైపు చూడకపోవడం అన్యాయమని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి రంగు, తేమ పేరుతో వేధించకుండా ధాన్యం కొనాలని డిమాండ్ రైతులు చేస్తున్నారు.
మొలకలెత్తిన ధాన్యం
కల్లాల్లో ఆరబోసిన ధాన్యం ఇటీవల కురిసిన వర్షాలతో తడిసి మొలకెత్తుతోంది. ధాన్యం తడవకుండా ఉండేందుకు కాంక్రీట్ కల్లాలు, టార్పాలిన్ పట్టాలను రైతులకు అందుబాటులోకి తేలేదు. దాంతో సొంతంగా ఆ వ్యయం భరించలేని అన్నదాతలు గోనె సంచులతో సాధ్యమైనంత మేర ధాన్యం రాశులు తడవకుండా శ్రమపడుతున్నారు. కానీ ఆ ప్రయత్నం ధాన్యం తడవకుండా ఆపలేకపోతోంది. సబ్సిడీలపై టార్పాలిన్లు, ఉపాధి పథకంలో కల్లాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగలడంతో ఈ దుస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తేమ ఉన్నదని కొనడం లేదు
నేను రెండు ఎకరాల్లో వరి నాటా. దాదాపు 50 సంచులకుపైగా వడ్లు వచ్చాయి. మన్యంకొండ వద్ద ఆరబెట్టాం. అయితే, వచ్చిపోయే వానలతో వడ్లు తడిశాయి. రోజూ వాతావరణం తేమగా ఉంటుండడంతో కుప్పపోయగా ధాన్యం రంగుమారింది. తేమ కూడా ఉంది. తేమ శాతం ఎక్కువ ఉందని కొనడం లేదు. ఆరబెట్టాకే కొంటామంటున్నారు. దాదాపు ఆరేడుబస్తాల వడ్లు పనికిరాకుండా పోయాయి. చేసేదేమీలేక ఎండ కోసం ఎదురుచూస్తున్నాం.
- బాలయ్య, ఓబ్లాయిపల్లి
తడిచి మొలకెత్తాయి
ఐదెకరాల్లో వరి వేశాం. పంట బాగానే పండింది. కాకపోతే ధాన్యం పచ్చిగా ఉందని కొనలేదు. ఎండబెట్టడం కోసం ఇక్కడ ఆరబోశాం. వానతో మొత్తం తడిచింది. కొంతవరకు మొలకలు కూడా వచ్చాయి. ఎండిన వడ్లే కొంటామంటున్నరు. మాకు బాగానే నష్టం వచ్చింది. ప్రభుత్వం మా వడ్లు వెంటనే కొనాలి.
- వెంకటేశ్వరమ్మ, ఓబ్లాయిపల్లి