19న వనపర్తి జిల్లాకు సీఎం కేసీఆర్‌ రాక

ABN , First Publish Date - 2021-12-16T04:59:51+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 19న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఖిల్లాఘణపురం మండలంలో రూ.76 కోట్లతో నిర్మించనున్న కర్నె తండా లిప్టునకు శంకుస్థాపన చేయనున్నారు.

19న వనపర్తి జిల్లాకు సీఎం కేసీఆర్‌ రాక
సీఎం కేసీఆర్‌

మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు, కర్నె తండా లిప్టునకు శంకుస్థాపన

వ్యవసాయ మార్కెట్‌ యార్డు, కలెక్టరేట్‌, టీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభం


వనపర్తి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 19న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఖిల్లాఘణపురం మండలంలో రూ.76 కోట్లతో నిర్మించనున్న కర్నె తండా లిప్టునకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ నుంచి పెద్దమందడి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద నిర్మించనున్న వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత వనపర్తి మండలం చిట్యాల సమీపంలో నిర్మించిన వనపర్తి వ్యవసాయ మార్కెట్‌ యార్డును ప్రారంభిస్తారు. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించి, సహపంక్తి భోజనం చేస్తారు. అక్కడి నుంచి వనపర్తికి వచ్చి, నూతన కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. గొర్రెలు, మేకల పునరుత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. కలెక్టరేట్‌ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత, ఇటీవల మంజూరు అయిన మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత హైదరాబాద్‌ వెళ్తారు.


కర్నెతండా ఎత్తిపోతల చరిత్రలో నిలిచిపోతుంది: మంత్రి

వనపర్తి అర్బన్‌: కర్నెతండా ఎత్తిపోతల పథకం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈనెల 19న జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన సందర్భంగా బుధవారం పట్టణంలోని తన నివాసంలో పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల ఆవాసాలు ఎక్కడైనా ఎత్తయిన ప్రాంతంలో ఉంటాయని, అలాంటి తండాలకు కూడా రూ.76.19 కోట్లతో సాగు నీరు అందించబోతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా దానికి శంకుస్థాపన జరుగనుందన్నారు. జూరాల ప్రాజెక్టుతో సమానమైన ఏడు టీఎంసీల సామార్థ్యం గల ఏదుల రిజర్వాయర్‌ను కేవలం 22 నెలల్లో నిర్మించామన్నారు. పార్టీలకు అతీతంగా ఏదుల నిర్మాణానికి అనేక మంది నాయకులు సహకరించారని చెప్పారు. భూ సేకరణకు సహకరించిన రైతులకు ఎన్నిసార్లు దండం పెట్టినా తప్పులేదన్నారు. ఇంకో వెయ్యేళ్లయినా దానిని నిర్మించిన వారిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు, మీ ప్రతినిధిగా ఇక్కడ నా పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. కర్నె తండా ఎత్తిపోతలతో పాటు వైద్య కళాశాల, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్‌ రిజిస్ర్టార్‌, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తారని, కలెక్టరేట్‌, డబల్‌ బెడ్‌రూం ఇళ్లు, చిట్యాలలో నూతన మార్కెట్‌ యార్డును సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం పర్యటన విజయవంతానికి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌ భాష, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, అదనపు కలెక్టర్లు ఆశిష్‌ సంగ్వాన్‌, వేణుగోపాల్‌ ప్రారంభించనున్న బిల్డింగ్‌లను పరిశీలించారు.  

పెద్దమందడి: పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామ శివారులో వేరుశనగ పరిశోధన కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పనులను పర్యవేక్షించారు. మంత్రి వెంట కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, ఎస్పీ అపూర్వారావు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజాప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T04:59:51+05:30 IST