ప్లాస్టిక్ పై చర్యలు నిల్

ABN , First Publish Date - 2021-11-29T04:33:52+05:30 IST

ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం పాలమూరు పట్టణంలో ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది.

ప్లాస్టిక్ పై చర్యలు నిల్
మహబూబ్‌నగర్‌ మునిసిపాలిటీలో సీజ్‌ చేసిన ప్లాస్టిక్‌ కవర్లు

ప్లాస్టిక్‌ కవర్ల నిషేధంపై ఫలించని ప్రయత్నం

దుకాణదారులపై చర్యలు నిల్‌

జ్యూట్‌, పేపర్‌ పరిశ్రమలను ప్రోత్సహించని వైనం

ప్రజల్లో కలగని చైతన్యం

డిసెంబరు 1 నుంచి పారిశుధ్య వారోత్సవాలు


మహబూబ్‌నగర్‌, నవంబరు 27: ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం పాలమూరు పట్టణంలో ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. పర్యా వరణ పరిరక్షణ కోసం దశాబ్ద కాలంగా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలించడం లేదు. ముందుగా 25 మైక్రాన్‌ల కన్నా తక్కువ పరిమాణం కలిగిన ప్లాస్టిక్‌ కవర్లను నిషేధించారు. ఆ తరువాత 50 మైక్రాన్‌లకు, ప్రస్తుతం 75 మైక్రాన్‌ లకన్నా తక్కువ పరిమాణం ఉన్నవాటిని నిషేధించారు. వచ్చే డిసెంబరు నెలలో లక్షా 120 మైక్రా న్‌లకు పెంచి, పూర్తిగా నిషేధిం చాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అయితే ప్లాస్టిక్‌కు ప్రత్నామ్నా యంగా జూట్‌, పేపర్‌ బ్యాగ్‌ల పరిశ్రమలు నెలకొల్పకుండా, జనాలను ఆ దిశగా ప్రోత్సహిం చేలా అవగాహన కల్పించకుండా ప్లాస్టిక్‌ నిషేధంపై చర్యలు తీసుకోవడం ఏ మాత్రం ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మహబూబ్‌నగర్‌, జడ్చర్ల పురపాలికల్లో దశాబ్ద కాలంగా ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు.


ప్రత్యామ్నాయ పరిశ్రమలను ప్రోత్సహించాలి

ప్లాస్టిక్‌ నిషేధం అమలు కావాలంటే ప్రత్యామ్నాయంగా జూట్‌, పేపర్‌ బ్యాగ్‌ తయారీ పరిశ్రమలను నెలకొల్పాలి. 10 రోజుల్లో 2 కోట్ల సీడ్‌బాల్స్‌ తయారు చేసిన పాలమూరు మహిళలకు ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. మెప్మా ద్వారా శిక్షణ ఇవ్వాలి. చిన్న చిన్న యూనిట్‌లను నెలకొల్పేలా రుణాలిచ్చి, పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తే ఉనాధి కల్పనతోపాటు లక్ష్యం నెరవేరుతుంది. ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల చిరు, మధ్య తరగతి వ్యాపారులంతా ప్లాస్టిక్‌ కవర్లనే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం బేకరీలు, స్వీట్‌షాప్స్‌, వస్త్ర వ్యాపారులు హైదరాబాద్‌ నుంచి పేపర్‌ బ్యాగ్‌లను తెచ్చి ఇస్తున్నారు. చిరు వ్యాపారులు అంత ఖర్చు చేసి అక్కడి నుంచి తీసుకురాలేరు. పండ్లు, పూలు, మాంసం, కూరగాయలు, మిర్చీ బండ్ల వ్యాపారులు తక్కువ మందం కలిగిన కవర్లనే వినియోగిస్తున్నారు. చిన్న వ్యాపారం కావడంతో కవర్ల కోసం ఎక్కువగా ఖర్చు చేయలేని పరిస్థితి వారిది. పట్టణాలు, గ్రామాల్లో ఇప్పటికీ ఆ కవర్లనే వినియోగిస్తున్నారు. మునిసిపల్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి, ప్లాస్టిక్‌ను సీజ్‌ చేసి జరిమనాలు విధిస్తున్నా  వినియోగం మాత్రం ఆగడం లేదు. ఏటా కొద్ది రోజులు అధికారులు హడావిడి చేయడం, ఆ తరువాత వాటి జోలికి వెళ్లకపోవడం కారణంగా ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం నిత్యకృత్యంగా మారింది. కవర్లను ఉపయోగించకూడదని ప్రజల్లో కూడా స్వచ్ఛందంగా చైతన్యం రావాల్సి ఉంది. ఇంటి దగ్గరి నుంచే ఓ బ్యాగ్‌ తీసుకెళ్లడం అలవాటు చేసుకుంటే కవర్లను చాలా వరకు నిర్మూలించవచ్చు. పాలమూరు పురపాలికలో వారం రోజులుగా తనిఖీలు చేసి, 450 కిలోల ప్లాస్టిక్‌ కవర్లను సీజ్‌ చేశారు. రూ.లక్ష వరకు జరిమానాలు విధించారు. అయినా కవర్ల వినియోగం మాత్రం యథేచ్ఛగా కొనసాగుతోంది.


వచ్చే నెల ఒకటి నుంచి పారిశుధ్య వారోత్సవాలు

సీజనల్‌ వ్యాధులను అరికట్టడమే లక్ష్యంగా డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, గ్రామాల్లో పారిశుధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఈ విషయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఏ రోజు ఏమేం కార్యక్రమాలు చేపట్టాలో షెడ్యూల్‌ విడుదల చేశారు. షెడ్యూల్‌ ప్రకారం పట్ణణాలు, గ్రామాల్లో అధికారులు కార్యక్రమాలు నిర్వహించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఈ ప్రత్యేక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. 


ఇవీ కార్యక్రమాలు

వారోత్సవాల్లో భాగంగా పట్టణాలు, గ్రామాల్లోని అన్ని మురుగు కాలువల్లో పూడిక తీయాలి. 

వీధులు, రోడ్లు, పబ్లిక్‌ స్థలాలను శుభ్రం చేయాలి. 

ఇళ్ల నుంచి మురుగునీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు దోమలు ప్రబలకుండా రోడ్ల పక్కన పిచ్చిమొక్కలను తొలగించాలి.

డ్రైనేజీలు, నీటి నిలువ ప్రాంతాల్లో లార్విసైడ్‌ కెమినల్‌ను స్ర్పే చేయాలి. 

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌, పాలిథిన్‌ కవర్లను వినియోగించడంపై కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి, వాటిని వినియోగించకుండా చర్యలు తీసుకోవాలి. 

ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలి.

Updated Date - 2021-11-29T04:33:52+05:30 IST