వంద పడకల ఆస్పత్రిపై అఖిలపక్షం ఆందోళన

ABN , First Publish Date - 2021-06-22T04:53:13+05:30 IST

అలంపూర్‌ అభివృద్ధికివంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తాననే హామీ మేరకు సీఎం కేసీఆర్‌ జీవో 98ను జారీ చేసిన నేపథ్యంలో ఇటీవల అడిషనల్‌ కలెక్టర్‌ అలంపూర్‌ చౌరస్తాలో స్థల పరిశీలనకు వచ్చారు.

వంద పడకల ఆస్పత్రిపై అఖిలపక్షం ఆందోళన

-  అలంపూర్‌ నుంచి పాదయాత్ర చేపట్టిన అఖిల పక్షం 

- స్పష్టత ఇవ్వని ఎమ్మెల్యే అబ్రహాం

- రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు 

తలొగ్గారంటూ విమర్శ


అలంపూర్‌, జూన్‌ 21 : అలంపూర్‌ అభివృద్ధికివంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తాననే హామీ మేరకు సీఎం కేసీఆర్‌ జీవో 98ను జారీ చేసిన నేపథ్యంలో ఇటీవల అడిషనల్‌ కలెక్టర్‌ అలంపూర్‌ చౌరస్తాలో స్థల పరిశీలనకు వచ్చారు. ఈ క్రమం లో వివాదం రాజుకోగా, వంద పడకల ఆసుపత్రిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అలంపూర్‌ వాసుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సోమవారం అలంపూర్‌ నుంచి అలంపూర్‌ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు దాదాపు వంద మంది అఖిల పక్షం నాయకులు  పాదయాత్ర చేపట్టా రు. క్యాంపు కార్యాలయం వద్ద నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొంత ఉద్రిక్తత నెలకొంది. వంద పడకల ఆసుపత్రిపై అఖిల పక్షం నినదించటంతో ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అఖిల పక్షం నాయకులు అందించిన వినతి పత్రం స్వీకరించారు. వంద పడకల ఆసుపత్రిపై ఎమ్మెల్యే ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భైఠాయించగా ఇన్‌చార్జి అలంపూర్‌ సీఐ వెంకటేశ్‌ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను కలిసేందుకు ఐదుగురికి అనుమతించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నా చేతుల్లో ఏమీ లేదని, సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దీంతో సంతృప్తి చెందిన అఖిల పక్షం నాయకులు ఎమ్మెల్యే అలంపూర్‌ మండల పర్యటనలను ఘెరావ్‌ చేయాలని నిశ్చయించారు. నేడు జరుగనున్న మునిసిపాలిటీ సర్వసభ్య సమావేశంలో మునిసిపల్‌ కౌన్సిలర్లు అలంపూర్‌ అభివృద్ధి కోసం రాజీనామాలకు సిద్ధమయ్యారు. రాజీనామా చేసిన కౌన్సిలర్లను ఏకగ్రీవంగా మరోసారి పదవి కట్టబెట్టేందుకు వార్డు ప్రజలను సన్నద్ధం చేస్తున్నారు. పాదయాత్రలో అఖిల పక్షం నాయకులు, రైతు సంఘం నాయకులు విజయ్‌ రాజన్న, మాల మహానాడు నాయకులు తుమ్మల రవికుమార్‌, సీపీఐ నాయకులు పెద్దబాబు,  మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ మనోరమ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచు పిండి జయ రాముడు, యూటీఎఫ్‌ నాయకులు రమేశ్‌, వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గంగిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:53:13+05:30 IST