అగ్రతాంబూలం

ABN , First Publish Date - 2021-12-31T05:22:30+05:30 IST

ఈ ఏడాది పాలమూరుకు చెందిన ప్రతిపక్ష నేతలు తమతమ పార్టీల్లో నెంబర్‌వన్‌ స్థానాలు దక్కించుకొని రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకమయ్యారు.

అగ్రతాంబూలం
అమిస్తాపూర్‌లో నిర్వహించిన ‘నిరుద్యోగ జంగ్‌సైరన్‌’ సభలో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

 - 2021లో పాలమూరు నేతలకు కీలక పదవులు

 - క్షేత్రస్థాయిలో మూడు పార్టీల హోరాహోరీ

 - రైతుచట్టాలపై కొనసాగిన ఆందోళనలు

 - ప్రతి పక్షాలను ఢీకొట్టే బాధ్యతల్లో జిల్లా మంత్రులు

 - రేవంత్‌ సారథ్యంలో కాంగ్రెస్‌ దూకుడు

-  క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ని ఢీకొడుతోన్న బీజేపీ

-  మూడు పర్యాయాలు జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌


రాజకీయంగా పాలమూరుకు ప్రాధాన్యం  పెరిగింది. ప్రతిపక్షాల్లో నెంబర్‌వన్‌ స్థానాలను పాలమూరు నేతలు దక్కించుకోగా, అధికార పక్షంలోనూ నెంబర్‌ టు పాత్ర పాలమూరు నేతలే పోషిస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతోన్న సందర్భంలో పాలమూరులోనూ అదేస్థాయిలో రాజకీయ కార్యాచరణ కొనసాగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నది. పాలమూరుపై ఫోకస్‌ చేసిన ప్రతిపక్షాలు జనంలో బలం పెంచుకునేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాయి.  2021 సంవత్సరం పాలమూరులో రాజకీయం రసవత్తరంగా, రాష్ట్రస్థాయి కేంద్రంగానే సాగింది. 

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి 

 రాష్ట్ర రాజకీయాల్లో పాలమూరు నేతలదే సందడి 

ఈ ఏడాది పాలమూరుకు చెందిన ప్రతిపక్ష నేతలు తమతమ పార్టీల్లో నెంబర్‌వన్‌ స్థానాలు దక్కించుకొని రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకమయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన అనుముల రేవంత్‌రెడ్డి ఎంపికయ్యారు. ఐపీఎస్‌కు రాజీనామా చేసిన ఆర్‌.ఎస్‌ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరి ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ పదవీ దక్కించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు బీజేపీలో జాతీయస్థాయి ఉపాధ్యక్షురాలి పదవిని డీకే అరుణ దక్కించుకోగా, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులవడమే కాకుండా, ఆ పార్టీకి రాష్ట్రస్థాయిలో ఎన్నికల మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేతలంతా ప్రతి పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తూ అధికార పార్టీని రాష్ట్రస్థాయిలో ఢీకొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, అధికార టీఆర్‌ఎస్‌ సైతం పాలమూరు నేతలకు ఆ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి కీలక బాధ్యతలే అప్పగించింది. ప్రతిపక్షాలను కౌంటర్‌ చేసే సమయంలో, ఉద్యోగులు, అధికారులను సమన్వయం చేసే సందర్భాల్లో ఆ బాధ్యతల్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కి టీఆర్‌ఎస్‌ అధిష్టానం అప్పగించింది. ఇటీవల యాసంగి సాగు, ధాన్యం అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న సందర్భంలో ఈ అంశంపై మొత్తానికి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి నిరంజన్‌రెడ్డి వకాల్తా తీసుకొని ప్రతిపక్షాలను, కేంద్రాన్ని కౌంటర్‌ చేస్తూ వచ్చారు. 

  కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపిన రేవంత్‌ పాదయాత్ర:

 ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ క్రియాశీల కార్యక్రమాలు నిర్వహించింది. పార్టీ శ్రేణులు స్తబ్దుగా ఉన్న సందర్భంలో కేంద్రం అమల్లోకి తెచ్చిన నూతన సాగు చట్టాలను ఉపసంహరించాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి ఏడున అప్పటి పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రాజీవ్‌ రైతుభరోసా దీక్ష చేపట్టారు. అదేరోజు అనూహ్యంగా అక్కడి నుంచి హైద్రాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను ఫిబ్రవరి 16 వరకు కొనసాగించి, రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద బహిరరంగ సభతో ముగించారు. 

దూకుడు పెంచిన కాంగ్రెస్‌

రేవంత్‌రెడ్డి పీసీసీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ శ్రేణుల్లో దూకుడు పెరిగింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలపైన పలు ఆందోళనలు నిర్వహించారు. ఫిబ్రవరి 16న సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క జిల్లాలోని గంగాపురం(జడ్చర్ల), తాండ్ర (కల్వకుర్తి) గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి సాధకబాధకాలు తెలుసుకున్నారు. సెప్టెంబరు 16న రేవంత్‌రెడ్డి సారథ్యంలో అమిస్తాపూర్‌ వద్ద ‘నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ సభ నిర్వహించారు. ఈ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. జిల్లాలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచేందుకు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ మాణిక్కం ఠాగూర్‌ నాగర్‌కర్నూల్‌లో పార్లమెంటరీ సమీక్ష నిర్వహించగా, మరో కార్యదర్శి బోస్‌రాజు నారాయణపేట, మహబూబ్‌నగర్‌లలో కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆర్డీఎస్‌ నుంచి గద్వాలకు రావాల్సిన తుంగభద్ర జలాల్లో అన్యాయాన్ని అడ్డుకుంటామంటూ ఆర్డీఎస్‌వద్ద ఆందోళన చేసేందుకు వెళ్లిన ఏఐసీసీకార్యదర్శి సంపత్‌కుమార్‌ సహా కాంగ్రెస్‌ శ్రేణులను కర్ణాటక పోలీసులు మార్గమధ్యలో అడ్డుకొన్నారు.  

  రైతుచట్టాల రద్దుకు ఉద్యమించిన అన్ని పక్షాలు

కేంద్రం చేపట్టినరైతు వ్యతిరేక చట్టాలు రద్దుచేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి, పాలమూరు అధ్యయన వేదిక వంటి ప్రజాసంఘాలు ఉద్యమించాయి. అధికార టీఆర్‌ఎస్‌ సైతం ఇటీవలే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు, ధర్నాలు నిర్వహించగా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీపీఐ జాతీయనేత  నారాయణ, టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితర నేతలంతా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఎట్టకేలకు కేంద్రం ఈ చట్టాలను ఉపసంహరించడం ఈ పక్షాలన్నింటి ఉద్యమానికి ఫలితం దక్కింది.

 ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాకతో క్షేత్రస్థాయిపై దృష్టిసారించిన బీఎస్పీ :

ఐపీఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆగస్టులో బీఎస్పీలో చేరారు.  ఆయన బీఎస్పీలో చేరడానికి ముందు జడ్చర్లలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం బీఎస్పీలో చేరి రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమితులయ్యాక దాదాపు ప్రతివారం ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కార్యాచరణ అమలు చేస్తున్నారు. అదే విధంగా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ప్రజల  బాధలను పరిశీలించడం భవిష్యత్‌లో ఆయన వేయబోయే అడుగులని తెలియజేస్తోంది.

- దూకుడు పెంచిన బీజేపీ 

పాలమూరు రాజకీయ సమరంలో ఈ ఏడాది టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేట్లుగా బీజేపీ దూకుడు పెంచింది. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి ప్రతీవారం జిల్లాలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నది.   పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యేలు రఘునందన్‌, రాజాసింగ్‌ పలు సందర్భాల్లో పర్యటనలు చేసి కార్యకర్తల్లో జోష్‌ నింపారు. ప్రధానంగా గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై బండి సంజయ్‌  చేసిన వ్యాఖ్యలు, తిరిగి దానికి శ్రీనివాస్‌ గౌడ్‌ కౌంటర్‌ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ నిత్యం ఎదో ఒక కార్యాచరణ ఉండేలా చూస్తూవస్తున్నారు.  ఇటీవల నిరుద్యోగ సమస్యలపై యువ, విద్యార్థి సంఘాలు ఆందోళనలు ఉధృతంగా నిర్వహించాయి. గద్వాల నియోజకవర్గంలో అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనే విదంగా ఉద్యమం సాగించారు. నర్సింగ్‌ కళాశాల అంశంపై ఉద్యమాన్ని బీజేపీ బలంగా చేపట్టగా, మహబూబ్‌నగర్‌లోనూ పలు అంశాలపై ఆపార్టీ క్రియాశీలకంగా ఆందోళనలు నిర్వహించింది. నారాయణపేట జిల్లాలోనూ సాగునీటి పథకాలు, ప్రజాసమస్యలపై క్రియాశీలకంగా నాయకులు ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో నేరుగా ఆరోపణలు ప్రత్యారోపణల వరకు ఈ జిల్లాలో పరిస్థితి వచ్చింది.

 అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం 

ఈ ఏడాది జరిగిన రెండు శాసన మండలి ఎన్నికలు, మినీ మునిసిపల్‌ పోరులో మరోసారి టీఆర్‌ఎస్‌ తనహవా కొనసాగించింది. ఫిబ్రవరిలో జరిగిన శాసనమండలి గ్రాడ్యుయేట్స్‌ స్థానం ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభివాణీదేవి, సమీప ప్రత్యర్థి బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎన్‌.రాంచందర్‌రావుపై విజయం సాధించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె అయిన వాణీదేవి భర్త స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా రఘుపతిపేట కావడంతో ఈ ఎమ్మెల్సీ స్థానం పాలమూరుకు దక్కినట్లయింది. ఈ ఎన్నికల్లో పాలమూరు జిల్లా నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి డాక్టర్‌ చిన్నారెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్ధతుతో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి పోటీచేసినా ఫలితం దక్కలేదు. ఏప్రిల్‌లో జరిగిన మినీ మునిసిపల్‌ పోరులో జడ్చర్ల, అచ్చంపేట మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో రెండు మునిసిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. జడ్చర్లలో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌గా దోరేపల్లి లక్ష్మీ, అచ్చంపేటలో చైర్మన్‌గా నరసింహగౌడ్‌ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా నవంబరులో ముగిసిన శాసన మండలి స్థానిక సంస్థల కోటా ద్విసభ్య నియోజకవర్గం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఈ ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో  తమ హక్కుల సాధనకు బరిలో ఉంటామని ప్రకటించిన ఎంపీటీసీ సంఘాల నేతలు నామినేషన్లు వేసినా తర్వాత మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నెరపిన మంత్రాంగంలో తమ సమస్యలు పరిష్కరించేందకు హామీ దక్కిందని పేర్కొంటూ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 

 విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపైన వైఎస్‌ షర్మిల దీక్ష

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సెప్టెంబరులో మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్శిటీ వద్ద విద్యార్థి, నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఒక రోజంతా ఆమె ఈ దీక్షలో కూర్చున్నారు. అదేవిధంగా నవంబరులో ఆమె కోస్గిలో బీసీ గర్జన సభ నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతలు ఉమ్మడి జిల్లాలో కార్యక్రమాల్లో వేగం పెంచారు. 

 జిల్లా నేతలను వరించిన పదవులు 

ప్రముఖ గాయకుడు వనపర్తి జిల్లాకు చెందిన  సాయిచంద్‌కు ఇటీవలే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైౖర్మన్‌ పదవి దక్కింది. సాయిచంద్‌కు తొలుత ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వాలనుకున్నా కొన్ని కారణాల వలన టికెట్‌ ఇవ్వలేదు. జిల్లాలోని బాలానాగర్‌ మండలం పెద్దాయిపల్లికి చెందిన ఐఏఎస్‌ అధికారి బి. జనార్దన్‌రెడ్డి ఈ ఏడాదిలోనే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైౖర్మన్‌గా నియమితులయ్యారు. ఈయనతో పాటు సభ్యురాలిగా కొల్లాపూర్‌కు చెందిన కోట్ల అరుణకుమారి నియమితులయ్యారు. పాలమూరు యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌గా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌రాథోడ్‌ నియమితులయ్యారు. సొంత జిల్లాలోని యూనివర్శిటీకి ఆయన వీసీగా నియమితులవడం పట్ల స్థానకంగా హర్షం వ్యక్తమయింది.

  ఉమ్మడి జిల్లాకు మూడుసార్లు  వచ్చిన సీఎం కేసీఆర్‌:

సీఎం కేసీఆర్‌ ఈ ఏడాదిలో మూడుసార్లు ఉమ్మడి జిల్లాకు వచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణగౌడ్‌ మరణించడంతో ఆయన దశదినకర్మకు ఫిబ్రవరి 24న హాజరయ్యారు.  నవంబరు 7న శ్రీనివాస్‌గౌడ్‌ మాతృమూర్తి శాంతమ్మ దశదిన కర్మకు సీఎం కేసీఆర్‌ వచ్చారు. అనంతరం తిరిగి  డిసెంబరు 2న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి సంతాప సభకు వచ్చారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కృష్ణమోహన్‌రెడ్డిని ఓదార్చారు. అనంతరం తిరుగు ప్రయాణంలో పెబ్బేరు మండలం రంగాపూర్‌ వద్ద మినుము, వేరుశనగ పంటలు పరిశీలించి రైతు మహేశ్వర్‌రెడ్డితో చర్చించారు. రైతులంతా ప్రత్యామ్నాయ సాగుకురావాలని సూచించారు. అదే మార్గంలో కొత్తకోట మండలం విలియంకొండవద్ద వేరుశనగ పైరుని పరిశీలించారు. ఇక్కడ కూడా  సాగు పరిస్థితులపై రైతులతో చర్చ జరిపారు.

 










Updated Date - 2021-12-31T05:22:30+05:30 IST