పక్కాగా సాగు లెక్క

ABN , First Publish Date - 2021-12-31T04:35:16+05:30 IST

జిల్లాలో ప్రస్తుత యాసంగిలో సాగవుతున్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు.

పక్కాగా సాగు లెక్క
జిల్లాలో సాగు చేసిన వేరుశనగ పంట (ఫైల్‌)

- ఆన్‌లైన్‌లో పంటల వివరాలు నమోదు 

-  సేకరణలో వ్యవసాయ శాఖ అధికారులు 

-  పది రోజుల నుంచి జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ 

- వచ్చే ఏడాది వానాకాలం సీజన్‌లో కూడా.. 


వనపర్తి అర్బన్‌, డిసెంబరు 30 : జిల్లాలో ప్రస్తుత యాసంగిలో సాగవుతున్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. దీనికోసం గత పదిరోజుల నుంచి ఏఈవోలు గ్రామాల్లోకి వెళ్లి సర్వే నెంబర్లు, సాగు చేస్తున్న పంటల వారీగా వివరాలను సేకరిస్తున్నారు. రైతుల పొలాల వద్దకు వెళ్లి ఏఈవోలు ట్యాబ్‌లలో వివరాలు, ఫొటోలు తీసుకుంటున్నారు. యాసంగి పంటల వివరాల సేకరణ పకడ్బందీగా జరిగితే వచ్చే ఏడాది వానాకాలంలో సాగు చేసే పంటల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు వ్యవసాయ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంటల సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుపై టెక్నికల్‌ ఏవోలకు హైదరాబాద్‌లో రెండురోజుల శిక్షణ కూడా ఇచ్చారు. 


 ఆన్‌లైన్‌లో నమోదు ఇలా..

యాసంగిలో పంటలు సాగు చేస్తున్న ప్రతీ గ్రామాన్ని క్షేత్రస్థాయిలో ఏఈవోలు సందర్శించాలి. గ్రామం పేరు, సర్వే నంబర్‌, రైతు పేరు, సాగవుతున్న పంట విస్తీర్ణం, పంటకు వచ్చే దిగుబడి(అంచనా), పంట విత్తుకున్న తేది, వారం వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలి. ఫొటోలు తీసి వాటిని కూడా ట్యాబ్‌లో నమోదు చేయాలి. ఏఈవోలు సేకరించిన వివరాలను గ్రామాల వారీగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. పదిరోజుల క్రితమే ఈ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. 


 ఈ యాసంగి సాగులో.. 

జిల్లాలో వ్యవసాయానికి అనుకూలమైన భూమి 4లక్షల 77వేల ఎకరాలు ఉంది. దానిలో వానాకాలం 2లక్షల 50వేల ఎకరాలు సాగవుతుంది. గత సంవత్సరం యాసంగిలో 2లక్షల ఎకరాలు సాగు చేశారు. వానాకాలంలో జిల్లాలో వరి, కంది, పత్తి, మిరప, పెసర, శనగ పంటలు సాగు చేశారు. కాగా, యాసంగిలో వరి, వేరుశనగ, మినుములు, పెసర, ఉలవలు, పెబ్బర్లు సాగు చేయనున్నారు. ఇవే కాకుండా కూరగాయల పంటలు పండించనున్నారు. ఈ ఏడాది ఇప్పటికే యాసంగిలో 57వేల ఎకరాలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబు తున్నారు. గురువారం నాటికి 20,621వేల ఎకరాలు సర్వే పూర్తి చేసి ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేశారు. వీటిలో వేరుశనగ 32,798 ఎకరాలు, మినుములు 24,692, పెసర్లు 170 ఎకరాల్లో సాగు చేసినట్లు వారు చెప్పారు. 


 ఆన్‌లైన్‌ నమోదుతో కలిగే ప్రయోజనాలు


- ఏయే పంటలు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నాయనే వివరాలు పక్కాగా ఆన్‌లైన్‌లో నమోదై ఉంటాయి. 

- మండల, డివిజన్‌, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా పంటలతో పాటు, రైతుల వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

- ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయి, పంటల దిగుబడి ఎంతవరకు వస్తుంది అనే విషయాలను రాష్ట్ర స్థాయి వరకు సులభంగా అంచనా వేయవచ్చు. 

- పంటల దిగుబడులకు అనుగుణంగా అవ సరమైన సంచుల సరఫరా, రైతులకు చెల్లించాల్సిన మద్దతు ధర, వాటికి నిధుల కేటాయింపుపై ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంటుంది. 

- రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను నిల్వ చేసుకునేందుకు అవసరమైన గోదాముల ను అందుబాటులో ఉంచేందుకు  అవకాశం ఏర్పడుతుంది. 

గత పదిరోజుల నుంచి ప్రక్రియ కొనసాగుతోంది..


గత పది రోజుల నుంచి యాసంగి సాగుకు సంబంధించి పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఏఈవోలు పర్యటించి పంటల వివరాలను సేకరంచి ట్యాబ్‌ల ద్వారా నమోదు చేస్తున్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా మొదలైంది. ఇప్పటి వరకు 20,621 ఎకరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం.   

- శివనాగిరెడ్డి, 

జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ శాఖ అధికారి Updated Date - 2021-12-31T04:35:16+05:30 IST