ఎమ్మెల్సీ ఎన్నికలో మలుపు

ABN , First Publish Date - 2021-11-24T04:04:55+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర ఘట్టానికి తెరలేచింది. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి అధికార టీఆర్‌ఎస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది మంది బరిలో నిలిచారు.

ఎమ్మెల్సీ ఎన్నికలో మలుపు
కూచకుళ్ల, కసిరెడ్డి నామినేషన్ల అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌; చిత్రంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఉన్నారు

పోటీకి దూరంగా కాంగ్రెస్‌, బీజేపీ 8 ఆత్మగౌరవ నినాదంతో నామినేషన్‌ వేసిన జూపల్లి వర్గీయులిద్దరు

నిధులు, విధులు, హక్కుల లక్ష్యంగా ఆరుగురు ఎంపీటీసీలు పోటీ

అధికార పార్టీ అభ్యర్థులు మినహా ఒక్కరు బరిలో ఉన్నా పోలింగ్‌ అనివార్యం


మహబూబ్‌నగర్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర ఘట్టానికి తెరలేచింది. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి అధికార టీఆర్‌ఎస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది మంది బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డిలకే అధిష్ఠానం మరోసారి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆ ఇద్దరు నాయకులు మంగళవారం భారీ ర్యాలీతో వచ్చి మహబూబ్‌నగర్‌లో నామినేషన్లు దాఖలు చేశారు. ఇండిపెండెంట్లుగా నామినేషన్‌ వేసిన వారిలో ఏడుగురు ఎంపీటీసీ సభ్యులైతే, ఒకరు మునిసిపల్‌ కౌన్సిలర్‌ ఉన్నారు. ఎంపీటీసీలంతా నిధులు, విధుల డిమాండ్‌తో బరిలోకి వచ్చారు. కాంగ్రెస్‌ నేరుగా అభ్యర్థిని నిలబెట్టకపోయినా పోటీలో ఉన్న మిడ్జిల్‌ ఎంపీటీసీ మహ్మద్‌గౌస్‌కు మద్దతుగా ఆ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ నాయకులు నామినేషన్‌ కార్యక్రమానికి వచ్చారు. దాంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. వీరితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గానికి చెందిన కోడేరు ఎంపీపీ భర్త సుధాకర్‌రెడ్డి, కొల్లాపూర్‌ మునిసిపల్‌ కౌన్సిలర్‌ షేక్‌ రహీంపాషా కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్న ఇద్దరితో పాటు స్వతంత్రుల్లో ఒక్కరు బరిలో నిలిచినా పోలింగ్‌ అనివార్యమవుతుంది. దీంతో స్వత్రంత్రులు బరిలో ఉంటారా? లేక టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రభావంతో ఉపసంహరించు కుంటారా? అనే అంశం గురువారం తేలనుంది. 


పోటీకి దూరంగా ప్రతిపక్షాలు

శాసనమండలి మహబూబ్‌నగర్‌ ద్విసభ్య నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కే సింహభాగం ఓటర్లు ఉన్నారు. దాంతో కాంగ్రెస్‌, బీజేపీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించాయి. నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు అభ్యర్థిని పెట్టాలా? వద్దా? అనే అంశంపై కసరత్తు నిర్వహించిన కాంగ్రెస్‌ మెదక్‌, ఖమ్మం, నిజామాబాద్‌, నల్లగొండల్లో పార్టీ అధికారికంగా అభ్యర్థుల్ని నిలబెట్టింది. మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి ఇతర జిల్లాల్లో డీసీసీల అభిప్రాయానికి నిర్ణయం వదిలేసింది. ఈ నియోజకవర్గంలో తమకు బలం తక్కువగా ఉండడంతో పోటీకి నేరుగా బరిలో నిలవడం కంటే, బరిలోకి వచ్చే స్వతంత్రుల్లో సమర్థులకు మద్దతివ్వాలని అంతర్గతంగా నిర్ణయించారు. బరిలో ఉన్న స్వతంత్రుల్లో ఒకరికి కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వనుంది. మరో ప్రతిపక్షం బీజేపీ నుంచి కూడా ఎవరూ పోటీ చేయలేదు. ఎవరికి మద్దతు ఇచ్చే విషయంలోనూ ఆ పార్టీ అధికారికంగా నిర్ణయం ప్రకటించ లేదు.


ఆత్మగౌరవ నినాదంతో జూపల్లి వర్గీయుల నామినేషన్‌

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గానికి చెందిన కోడేరు ఎంపీపీ కొండ రాధ భర్త సుధాకర్‌ రెడ్డి, కొల్లాపూర్‌ మునిసిపాలిటీ కౌన్సిలర్‌ షేక్‌ రహీంపాషా నామినేషన్లు వేయడంతో ఎమ్మెల్సీ ఎన్నిక మలుపు తిరిగింది. ఆత్మగౌరవ నినాదంతో బరిలో నిలిచామని పేర్కొంటున్న ఈ నాయకులు చివరి వరకు బరిలో ఉంటారా? లేక? అందరి దృష్టిని ఆకర్షించిన తర్వాత టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం బుజ్జగింపులతో ఉపసంహరించుకుంటారా? అనే అంశం తేలాల్సి ఉంది. 


హక్కుల సాధనే లక్ష్యమంటోన్న ఎంపీటీసీ సభ్యులు

ఆత్మగౌరవ నినాదంతో జూపల్లి కృష్ణారావు వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయగా, మరోవైపు నిధులు, హక్కుల కోసమంటూ ఎంపీటీసీలు మరో ఆరుగురు నామినేషన్లు వేశారు. వీరిలో ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్టెకు చెందిన శ్రీశైలం(కాంగ్రెస్‌ ఎంపీటీసీ), సారబ్బాయి కృష్ణ (కాంగ్రెస్‌ ఎంపీటీసీ), సంద రేణుక (స్వతంత్ర ఎంపీటీసీ), బెజ్జం మల్లికార్జున్‌(కాంగ్రెస్‌ ఎంపీటీసీ), మహ్మద్‌గౌస్‌(కాంగ్రెస్‌ ఎంపీటీసీ), రామాంజ నేయులు (ఎంపీటీసీ) ఉన్నారు. వీరిలో ఒక్కరు పోటీలో ఉన్నా పోలింగ్‌ తప్పనిసరి కావడంతో ఎన్నిక ఏమలుపు తిరగనుందో వేచి చూడాలి.


ఎమ్మెల్సీ బరిలో పది మంది

మహబూబ్‌నగర్‌,(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శాసన మండలి స్థానిక సంస్థల కోటా మహబూబ్‌నగర్‌ ద్విసభ్య నియోజకవర్గానికి మంగళవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు టీఆర్‌ఎస్‌ నుంచి అధికారిక అభ్యర్థులు, సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మహబూబ్‌ నగర్‌లో రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.వెంకట్రావుకు నామినేషన్లు దాఖలు చేశారు. కసిరెడ్డి మూడు సెట్లు, కూచకుళ్ల రెండు సెట్ల నామినేషన్లను సమర్పించారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా కావలి శ్రీశైలం (రెండు సెట్లు), సారబాయి కృష్ణ (రెండు సెట్లు), షేక్‌ రహీం పాషా(ఒక సెట్‌), మహ్మద్‌గౌస్‌ (ఒక సెట్‌), సంద రేణుక(ఒకసెట్‌), బెజ్జం మల్లికార్జున రావు(ఒక సెట్‌), రామాంజనేయులు(ఒక సెట్‌), సుధాకర్‌రెడ్డి(ఒక సెట్‌) నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీ నుంచి అధికా రికంగా ఎవరూ నామినేషన్‌ వేయలేదు. అయితే మిడ్జిల్‌కు చెందిన మహ్మద్‌ గౌస్‌ నామినేషన్‌ కార్యక్రమానికి జడ్చర్ల నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు దుశ్యంత్‌రెడ్డి, రబ్బానీ రావడంతో ఆయనకు కాంగ్రెస్‌ మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది.


పాలమూరు అభ్యున్నతికి కృషి చేస్తాం: మంత్రి

సమష్టిగా ఉండి, పాలమూరు అభ్యున్నతికి తామంతా కృషి చేస్తామని, రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ కార్యాలయం నుంచి న్యూటౌన్‌ వరకు అభ్యర్ధులతో పాటు ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి,  ఎమ్మెల్యేలు డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డి,  డాక్టర్‌ అబ్రహాం, మర్రి జనార్దన్‌రెడ్డిలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాల యంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సంద ర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలమూరు అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తు న్నారని అన్నారు. ఏడేళ్లలో  70 ఏళ్లలో లేనంత అభివృద్ధికి అవకాశం కల్పించారని వివరించారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన  పాలమూ రును అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 95 శాతం కౌన్సిలర్లు, 85 శాతం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తమ పార్టీవారే ఉన్నారని, తమ అభ్యర్థుల గెలుపు ఎప్పుడో ఖాయమైందని శ్రీనివాస్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. జడ్పీ చైర్‌పర్సన్లు స్వర్ణాసుధాకర్‌రెడ్డి, సరితా తిరుప తయ్య, పద్మావతీ బంగారయ్య, వనజా గౌడ్‌, లోక్‌నాథ్‌రెడ్డి, సంగీత, నాటక అకాడమీ ఛైర్మన్‌ బాద్మి శివకుమార్‌తో పాటు పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T04:04:55+05:30 IST