ఉమ్మడి జిల్లాలో 1,796 కేసులు
ABN , First Publish Date - 2021-05-06T04:54:12+05:30 IST
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం అత్య ధికంగా 1,796 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.

చికిత్స పొందుతూ తొమ్మిది మంది మృతి
ఆస్పత్రిలో చేరిన వనపర్తి జిల్లా కలెక్టర్ దంపతులు
మహబూబ్‌నగర్, మే 5 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం అత్య ధికంగా 1,796 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. చికిత్స పొందుతూ వివిధ జిల్లాల్లో తొమ్మిది మంది మృతి చెందగా, వనపర్తి జిల్లా కలెక్టర్ దంపతులు కరోనాతో ఆసుపత్రిలో చేరారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 276 కేసులు నమోదయ్యాయి. ధరూర్ మండలానికి చెందిన ఓ మహిళ కరోనాతో మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు. వనపర్తి జిల్లాలో 935 మందికి చేసిన పరీక్షల్లో 345 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. పాన్‌గల్ మండలం గోప్లాపూర్ గ్రామానికి చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, రేవల్లి మండలం కేశంపేట గ్రామానికి చెందిన మరో వ్యక్తి హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషకు కరోనా సోకింది. దీంతో ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న ఆమె భర్త కూడా వైరస్ బారినపడ్డారు. కలెక్టర్‌కు మంగళవారం జ్వరం వంటి అనారోగ్య లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు(ఆర్‌టీపీసీఆర్) జరపగా పాజిటివ్‌గా తేలింది. దంపతులిద్దరూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది. నాగర్‌కర్నూలు జిల్లాలో 1,452 మందికి పరీక్షలు చేయగా 651 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. లింగాల మండలం రాయవరానికి చెందిన 57 ఏళ్ల చెంచు మహిళ, పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని పెద్దకారుపాములలో 62 ఏళ్ల వృద్ధుడు, అమ్రాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ కరోనాతో మృతి చెందారు. వారితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2,130 మందికి పరీక్షలు నిర్వహించగా 412 మందికి నిర్ధారణ అయ్యింది. నారాయణపేట జిల్లాలో 675 మందికి పరీక్షలు నిర్వహించగా 112 మందికి నిర్ధారణ అయ్యింది.