వార్త రాసుకుంటే రాసుకోని!

ABN , First Publish Date - 2021-12-26T06:09:43+05:30 IST

చర్ల మండలంలో బెల్ట్‌ షాపులు అధికంగా నడుస్తున్నాయి. మద్యం దుకాణాల నుంచి మందు తీసుకొచ్చి బడి, గుడి, బస్టాండ్‌ అనే తేడా లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారు.

వార్త రాసుకుంటే రాసుకోని!

మద్యం వ్యాపారులకు ఓ ఎక్సైజ్‌ అధికారి భరోసా

మై హునా అంటూ బెల్ట్‌ దుకాణాదారులకు హామీ

ఆంధ్రజ్యోతి కథనంపై అక్కసు

ఆందోళనకు దిగే యోచనలో మహిళలు

చర్ల, డిసెంబరు 25: చర్ల మండలంలో బెల్ట్‌ షాపులు అధికంగా నడుస్తున్నాయి. మద్యం దుకాణాల నుంచి మందు తీసుకొచ్చి బడి, గుడి, బస్టాండ్‌ అనే తేడా లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇలా చర్ల మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా సుమారు 100కి పైగా గొలుసుకట్టు దుకాణాలు కనిపిస్తున్నాయి. విద్యార్ధులు, భక్తులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఎక్షైజ్‌ అధికారులు ఏమ్రాతం పట్టించు కోవడం లేదు. పైగా మద్యం వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారని మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలపై శనివారం ఆంధ్రజ్యోతి బడి, గుడి తేడా లేదు అనే శీర్షికన కఽథనం ప్రచురించింది. ఈ వార్త మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా జిల్లా ఎక్షైజ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా ఎక్సైజ్‌ శాఖలో పని చేస్తున్న ఓ అధికారి మాత్రం మద్యం దుకాణదారులకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘వార్త రాసుకుంటే రాసుకోని, ఏం.. రాసుకుంటే ఏమైంది’ అంటూ వారికి అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌ అధికారి ‘మై హూనా’ అనడంతో బెల్ట్‌ దుకాణాదారులు కూడా ధైర్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మండల వ్యాప్తంగా యథేచ్ఛగా బెల్ట్‌ దుకాణాలు నడుస్తుంటే అధికారులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ స్థానికులు మండి పడుతున్నారు. బడులు, గుడులు, బస్టాండ్‌ ప్రాంతాల్లో మద్యం తాగి ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే జిల్లా ఎక్సైజ్‌ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే  బెల్ట్‌ దుకాణాల ఏర్పాటు పై మరి కొద్ది రోజుల్లో కొంత మంది మహిళలు నిరాహార దీక్షలకు దిగబోతున్నారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ నాయకులు కూడా త్వరలో బెల్ట్‌ దుకాణాల తొలగింపుపై కార్యాచరణ ప్రకటించనున్నారు. 

Updated Date - 2021-12-26T06:09:43+05:30 IST