లక్షలు పోసి లారీలు కొన్నాం.. బొగ్గు లోడింగ్‌లేక రోడ్డున పడ్డాం!
ABN , First Publish Date - 2021-11-29T04:56:21+05:30 IST
లక్షల పోసి లారీలు కొనుక్కున్నాం.. సింగరేణి బొగ్గులోడింగ్ సక్రమంగా లేక ఆర్థికంగా చితికి పోయామని, వెంటనే లారీలకు బొగ్గు లోడింగ్‌ను పెంచకపోతే చావే శరణ్యమంటూ మణుగూరు లారీ ఓనర్లు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రేగా ఎదుట వాపోయిన లారీ ఓనర్లు
లోడింగ్ పెంచకపోతే చావే శరణ్యమని ఆవేదన
సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రేగా హామీ
మణుగూరుటౌన్, నవంబరు28: లక్షల పోసి లారీలు కొనుక్కున్నాం.. సింగరేణి బొగ్గులోడింగ్ సక్రమంగా లేక ఆర్థికంగా చితికి పోయామని, వెంటనే లారీలకు బొగ్గు లోడింగ్‌ను పెంచకపోతే చావే శరణ్యమంటూ మణుగూరు లారీ ఓనర్లు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మణుగూరు లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉడతాని భాస్కర్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంతారావు కలిశారు. లోడింగ్ సక్రమంగా లేకపోవడంతో లారీఫైనాన్స్ చెల్లించలేక పోతున్నా మన్నారు. ఇప్పటికే కొంతమంది ఓనర్ల లారీలను ఫైనాన్స్ కంపెనీ వారు లాక్కుపోయారని వాపోయారు. గతంలో ఇదే పరిస్థితి నెలకొన్నప్పుడు లారీ ఓనర్లు ఆర్థిక బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయన్నారు. ప్రస్థుతం తమ పరిస్థితి ఆదేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఏరియా సింగరేణి యాజమాన్యానికి ఆవేదనను చెప్పుకున్నామని, దానికి యాజమాన్యం ఎప్పుడు అడిగిన మరో వారం రోజుల్లో లోడింగ్‌ను పెంచుతామంటూ మాట దాటవేస్తున్నారన్నారు.
సమస్యను పరిష్కరిస్తా : ప్రభుత్వ విప్ రేగా
మణుగూరు లారీ ఓనర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రేగా కాంతారావు అసోసియేషన్ సభ్యులకు హామీ నిచ్చారు. వెంటనే ఏరియా జీఎం జక్కం రమేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తప్పకుండా లోడింగ్‌ను తక్షణమే పెంచాలని సూచించారు. సోమవారం నుంచి ఏరియాలోని లారీలకు వెయి టన్నుల బొగ్గును కేటాయిస్తామని, కొద్ది రోజుల్లోనే రెండు వేల టన్నుల వరకు బొగ్గును కేటాయిస్తామని చెప్పారు. అనంతరం అసోసియేషన్‌లో లారీలు, టిప్పర్ల సంఖ్యను తెలుసుకున్నారు. ప్రస్థుతం పరిస్థితి మెరుగు పడాలంటే ఏ మేరకు బొగ్గు కేటాయించాల్సి వస్తుందనే విషయాన్ని తెలుసుకున్నారు. లారీ ఓనర్లు ఎదుర్కొంటున్న రోడ్ ట్యాక్స్ సమస్యలతోపాటు ఇతర సమస్యలను సిఎం దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసి సభ్యుడు పోశం నర్సింహరావు, వైస్ ఎంపిపి కెవి రావు, నాయకులు ముత్యం బాబు, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, లారీ అసోసియేషన్ సభ్యులు రాఘవరెడ్డి, దున్పపోతుల శ్రీనివాస్, కిరణ్‌కుమార్, సురేందర్‌రెడ్డి, గోవింద్, వెంకన్న, బాబు తదితరులు పాల్గొన్నారు.