వైరాలో పట్టణ ప్రగతి సొగసు చూడతరమా..

ABN , First Publish Date - 2021-07-13T04:54:23+05:30 IST

రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వైరా మునిసిపాలిటీలోని రోడ్లన్నీ చిత్తడిగా మారి జావగారిపోతున్నాయి.

వైరాలో పట్టణ ప్రగతి సొగసు చూడతరమా..
చిత్తడిగా రిజర్వాయర్‌కు వెళ్లే రోడ్డు

 ఎక్కడ చూసినా చిత్తడే

వైరా, జూలై 12: రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వైరా మునిసిపాలిటీలోని రోడ్లన్నీ చిత్తడిగా మారి జావగారిపోతున్నాయి. ఇప్పటివరకు రెండువిడతల పట్టణ ప్రగతి కార్యక్రమాల పేరిట కోట్లాదిరూపాయలు ఖర్చుచేశామని ప్రచార ఆర్భాటాలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రిజర్వాయర్‌కు వెళ్లే అత్యంత రోడ్డు చిత్తడిగా తయారైంది. అడుగుతీసి అడుగువేసే పరిస్థితి లేకుండా జావగారిపోతుంది. ఈ రోడ్డు వైరా రిజర్వాయర్‌, మిషన్‌ భగీరథ, పర్యాటక కేంద్రంకు వెళ్లేందుకు అత్యంత కీలకంగా ఉంది. పదిరోజులపాటు పట్టణ ప్రగతి పేరిట అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేసినప్పటికీ దాదాపు రెండుకిలోమీటర్లు జాతీయ ప్రధాన రహదారి పక్కనున్న గుంతలకు మరమ్మతులు విస్మరించారు. ఇండోర్‌ స్టేడియం సమీపంలోని ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్‌ వ్యక్తులు గేదెలను కట్టేసి పెంటకుప్పలు వేస్తున్నారు. ఆస్థలాలన్నీ బురద కూపంగా మారింది. దుర్వాసన వెదజల్లుతుంది. ఇకపోతే జనవాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. 20వార్డుల్లోని అనేక రోడ్లు చిత్తడిగా మారాయి. ఓవైపున కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు కూడా తలెత్తే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రచార ఆర్భాటాలను పక్కనపెట్టి పట్టణ ప్రగతిపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.


Updated Date - 2021-07-13T04:54:23+05:30 IST