పల్లెకల్లోలం

ABN , First Publish Date - 2021-05-10T04:50:54+05:30 IST

పల్లెలపై కరోనా పంజా విసురుతోంది. నాగరిక సమాజానికి దూరంగా ఉంటే అటవీ గ్రామాలూ ఇందుకు మినహాయింపు కాదు. చర్ల మండలంలో గడిచిన పది రోజుల వ్యవధిలో గ్రామాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. ప్రతీ వీధిలో ఒకటి నుంచి రెండు కేసులు కనిపిస్తున్నాయి.

పల్లెకల్లోలం
కేసులు అధికంగా ఉన్న పూసుగుప్ప గ్రామం

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌లు

మారుమూల అటవీ గ్రామాల్లోనూ అదే పరిస్థితి

శుభకార్యాలే కారణం.. ప్రజల్లోనూ నిర్లక్ష్య ధోరణి

అశ్వారావుపేటలో పరీక్షలను తగ్గించిన సిబ్బంది

కేసులను కుదించి చూపేందుకేనన్న ఆరోపణలు

చర్ల, మే 9: పల్లెలపై కరోనా పంజా విసురుతోంది. నాగరిక సమాజానికి దూరంగా ఉంటే అటవీ గ్రామాలూ ఇందుకు మినహాయింపు కాదు. చర్ల మండలంలో గడిచిన పది రోజుల వ్యవధిలో గ్రామాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. ప్రతీ వీధిలో ఒకటి నుంచి రెండు కేసులు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా కేసులు పెరగటానికి శుభకార్యాలే కారణమని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వివిధ గ్రామాల్లో అనేక శుభకార్యాలు, పెళ్లిళ్లు జరగ్గా అక్కడికి వెళ్లినా వారికి వైరస్‌ అంటుకున్నట్లు తెలుస్తోంది. మండల అధికారులు శుభకార్యాలు, పెళ్లిళ్లకు ఎలాంటి నిబంధనలు ఇవ్వకపోవడంతో ప్రతీ కుటుంబం సుమారు 500 నుంచి రెండు వేల మందిని పిలిచి శుభకార్యకక్రమాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా కార్యక్రమాలకు వెళ్లిన వారికి వైరస్‌ అంటుకున్నట్లు తెలుస్తోంది.

భారీగా కేసులు నమోదు

చర్ల మడంలంలోని రెండు వైద్యశాలల పరిధిలో 73 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 30 అటవీ గ్రామాలు ఉన్నాయి. కాగా ఈ గ్రామాల్లో కోరానా కేసులు అధికంగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది, ముఖ్యంగా పూసుగుప్ప, వద్దిపేట, లెలిన్‌ కాలనీ, కందిపాడు, బోదనెల్లితో పాటు మరి కొన్ని గ్రామాల్లో కరోనా విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్‌ బారిన పడ్డవారు కొంత మంది వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకుంటుండగా, మరి కొంత మంది మాకేమీ కాలేదంటూ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో మండలంలో అనేక శుభకార్యాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు కరోనా వచ్చిన వారు, కరోనా లక్షణాలు ఉన్నావారు హాజరవ్వడంతో కరోనా కేసుల సంఖ్య పెగినట్లు తెలుస్తోంది. మండల అధికారులు కనీస సూచనలు ఇవ్వకపోవడంతోనే జోరుగా శుభకార్యాలు జరిగినట్లు స్థానికుల ఆరోపిస్తున్నారు. 

నాలుగైదు రోజులుగా అశ్వారావుపేట పట్టణం పరిసరాలతో పాటు పల్లెల్లోనూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో అశ్వారావుపేట మండలంలో ప్రతి రోజు 30 నుంచి 53 వరకు పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. వీటికి తోడు నాలుగురోజులుగా కరోనాతో బాధపడుతూ మృతి చెందిన సంఘటనలు అత్యధికంగానే జరిగాయి. మూడు రోజులుగా వరుసగా 15 మంది వరకు కరోనాతో మృతి చెందారు. ఆదివారం కూడా కొవిడ్‌ సెంటర్‌లో దమ్మపేట మండలం, తాటిసుబ్బన్నగూడేనికి చెందిన మహిళ మృతి చెందారు. వారం రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆసుపాక, వినాయకపురం, ఉశిర్లగూడెంలో విపరీతంగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వినాయకపురం, ఉశిర్లగూడెంలో కరోనా మృతులు నమోదయ్యాయి. ఆదివారం కూడా ఊట్లపల్లి, ఆసుపాకలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

పరీక్షలు తగ్గించారు

అశ్వారావుపేట మండలంలో అశ్వారావుపేట, వినాయకపురం, గుమ్మడపల్లి ఆరోగ్య కేంద్రాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహస్తున్నారు. రెండు నెలలుగా మూడు ఆసుపత్రులలో భారీగానే పరీక్షలు జరిగాయి. నెల రోజులుగా పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య పెరగటంతో పాజిటివ్‌లు పెనిగాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో పాజిటివ్‌లు, మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో పరోక్షంగా పరీక్షలు తగ్గించేస్తున్నారు. పలు రకాల సాంకేతిక కారణాలో, పేర్లు నమోదు చేయించుకోలేదనో ఏదో కారణంతో రోజువారి పరీక్షలు తగ్గించివేస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా పరిశీలిస్తే అశ్వారావుపేట మండలంలోని మూడు కేంద్రాల్లో కూడా 100 నుంచి 120లోపే పరీక్షలు జరిగాయి. ఆదివారం కేవలం 76 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి నిర్ణీత సమయం పెట్టి పరీక్షలకు వచ్చిన వారిని వెనకకు పంపడం పట్ల ఆక్షేపణ లు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కేసులు తగ్గించి చూపించేందుకు పరీక్షలు కుదిస్తోందని సమా చారం.

Updated Date - 2021-05-10T04:50:54+05:30 IST