‘వరి’వడి తగ్గింది!

ABN , First Publish Date - 2021-12-25T06:37:41+05:30 IST

‘వరి’వడి తగ్గింది!

‘వరి’వడి తగ్గింది!

ఆరుతడి పంటలవైపు రైతుల మొగ్గు

ఫలితాలనిస్తున్న ప్రభుత్వ ప్రచారం

పంట మార్పిడితో ప్రయోజనాలంటున్న అధికారులు

గతంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 4లక్షల ఎకరాల్లో వరి

ఖమ్మం వ్యవసాయం, డిసెంబరు 24: వరి సాగు చేయవద్దనే ప్రభుత్వ ప్రచారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలిస్తోంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రైతులను చైతన్యవంతం చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆరుతడి పంటల సాగు పెరిగింది. రైతులు ప్రతీ ఏడాదికి భిన్నంగా ఈ సారి కొత్త రకం పంటలు సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తిండి గింజల కోసం మాత్రమే వారి కుటుంబాలకు కావాల్సిన మొత్తంలో వరివేస్తూ మిగతా భూమిలో వరి ఏతర పంటలను సాగుచేయడంపై దృష్టిపెట్టారు. 

ఇతర పంటల సాగుపై అవగాహన..

వరిసాగుపై కేంద్రం తన వైఖరిని స్పష్టంగా తెలిపిన నేపథ్యంలో రైతులను వరిసాగు చేయవద్దని చెప్పిన సీఎం కేసీఆర్‌ మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులందరితో సమావేశం ఏర్పాటుచేసి గ్రామాల్లో వరిసాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్లు, ఇతర అధికారులతో పాటు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు ఆ బాధ్యతలను అప్పగించడంతో ఉమ్మడి ఖమ్మంలో యాసంగిలో వరిసాగుపై నేషధం అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే వానాకాలం సీజన్లో పండిన వరి ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా నడవని పరిస్థితితో రైతులు కళ్లల్లో, రోడ్లమీద, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులుగా పోసి నిరీక్షిస్తున్న పరిస్థితి తెలిసిందే. ఇలాంటి పరిస్థితి లేకుండా ముందునుంచే ప్రభుత్వం, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గతమెంతో ఘనం..

వివిధ నీటి వనరుల కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 10నుంచి 12 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండుతుండగా, వరి 4లక్షలకుపైగా ఎకరాల్లో సాగవుతోంది. జిల్లాల విభజన జరిగిన తర్వాత ఖమ్మం జిల్లాలో ప్రతీ ఏటా ఖరీఫ్‌లో మొత్తం 6లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు ఉండగా, వరిసాగు ఖరీఫ్‌లో 2.50లక్షలు, రబీలో 2.30లక్షల  ఎకరాల వరకు జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 5 లక్షల వరకు వివిధ రకాల పంటల సాగు జరుగుతుండగా, వరి సాగు ఒక్కటే వానాకాలంలో 2లక్షల ఎకరాలు, యాసంగిలో లక్ష ఎకరాల వరకు జరుగుతోంది. వరిసాగు ఇంకా పెరుగుతుండటం, పలు కారణాలతో వరికి ఇతర రాష్ర్టాల్లో డిమాండ్‌ తగ్గిపోయింది. ఈ ఏడాది రానున్న యాసంగి సీజన్‌ నుంచి ఎఫ్‌సీఐ ద్వారా ప్రభుత్వ పరంగా ధాన్యం కొనుగోళ్లు చేయలేమని, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని కేంద్రం పలు మార్లు రాష్ర్టాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో ఇరకాటంలో పడిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో వరి సాగు చేయవద్దని, సాగు చేసినా ధాన్యం కొనుగోలు చేయడం కుదరదని, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవాలని, ఇక నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని హెచ్చరికలు వచ్చాయి. యాసంగిలో కొనుగోళ్లు చేయలేమని కేంద్రం చేసిన స్పష్టమైన ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం వరిపై జారీచేసిన  విషయం తెలిసిందే. దీంతో రైతులు తప్పని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.

కల్లాల్లోనే వానాకాలం ధాన్యం..

ప్రస్తుతం వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో.. యాసంగిలో ఏ పంటలు పండించాలనే అంశంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులు, ఇతర పరిణామాలు, అంశాలను బేరీజు వేస్తూ అటు కేంద్రాన్ని, ఇటు రాష్ర్టాన్ని ఏమీ అనలేని పరిస్థితుల్లో రైతులు ఆవేదన చెందుతూ ప్రత్యామ్నాయం వైపు దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే  జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ముద్రించిన ప్రత్యామ్నాయ పంటల  పోస్టర్లు, కరపత్రాలతో రైతులకు క్లస్టర్లు, మండలాలు, డివిజన్ల వారీగా అవగాహన సదస్సులతో చైతన్యం కల్గించే  కార్యక్రమాలు చేపడుతున్నారు. వరిసాగు చేయవద్దనే రీతిలో చెబుతూనే ప్రత్యామ్నాయ పంటల ద్వారా కలిగే   ప్రయోజనాలను వివరిస్తున్నారు. 

పంట మార్పిడితో ప్రయోజనాలు

ఎం.విజయనిర్మల, జిల్లా వ్యవసాయాధికారి, ఖమ్మం

కేవలం వరిసాగుపైనే రైతులు దృష్టి పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇతర పంటల సాగుకు యత్నించాలి. దీంతో ప్రయోజనాలు అధికంగానే ఉంటాయి. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో ప్రత్యామ్నాయంగా అపరాలు, వాణిజ్య పంటలను వేయాలి. దీని ద్వారా అధిక దిగుబడులు వస్తాయి. ఈ యాసంగిలో వరి సాగు వద్దని రైతులు, రైతు సంఘ నాయకులకు అవగాహన కల్పిస్తున్నాం. 

Updated Date - 2021-12-25T06:37:41+05:30 IST