25నుంచి ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-21T05:00:18+05:30 IST

25నుంచి ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌

25నుంచి ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌

305ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 6500మంది వివరాలు నమోదు

22తో ప్రభుత్వ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా ముగింపు

ఖమ్మంసంక్షేమవిభాగం, జనవరి 20: ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించిన సర్కారు వైద్యసిబ్బందికి  కరోనా వ్యాక్సిన్‌ ఇస్తుండగా.. ఈనెల 25వ తేదీ నుంచి ప్రైవేట్‌ వైద్యశాలల్లో పనిచేసే సిబ్బందికి టీకా వేయనున్నారు. ఇప్పటికే దశలవారీగా మూడు రోజుల పాటు జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, ఆశ కార్యకర్తలు అంగన్వాడీ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఈ క్రమంలో టీకా తీసుకోకుండా ఉన్నవారి కోసం 22వరకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 2498మంది ప్రభుత్వ ప్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేయగా.. తొలిరోజైన ఈనెల 16న 180మందికిగాను 170మందికి, మరుసటి రోజు 712 మందికి 599 మందికి, మంగళవారం మూడో రోజు 2,530మందికి గాను 1,729మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. మొత్తంగా మూడురోజుల్లో 3422 మంది లక్ష్యంగా పెట్టుకోగా 2,498మందికి టీకాలు వేశారు. మిగిలిన వారికి గురు, శుక్రవారాల్లో టీకాలు అందించి ప్రభుత్వ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకాలను పూర్తి చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ప్రైవేట్‌ ఆసుపత్రుల సిబ్బందికి కూడా టీకాలను ఇవ్వాలని, అది కూడా ప్రభుత్వ వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులతోనే వేయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 560 ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉండగా.. వాటిలో 305 ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, సిబ్బందిలో సుమారు 6,500మంది కొవిన్‌యాప్‌లో వివరాలు నమోదు చేయించుకున్నారు.  

25నుంచి ప్రైవేట్‌కు కార్యచరణ..

డాక్టర్‌ మాలతి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి, ఖమ్మం

ఈనెల 22వరకు ప్రభుత్వ వైద్యసిబ్బంది, అంగన్వాడీ ఉద్యోగులకు నూరుశాతం వ్యాక్సిన్‌ పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకోని వారు 22లోగా తీసుకోవాలి. ఆ తర్వాత 25వ తేదీ నుంచి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాం. ఇక కేంద్రాల పెంపు వివరాలు రావాల్సి ఉంది.


Updated Date - 2021-01-21T05:00:18+05:30 IST