నో.. వ్యాక్సిన్‌ !.. రెండో డోసుకు కూడా అవస్థలే

ABN , First Publish Date - 2021-05-08T06:00:44+05:30 IST

కనిపించని శత్రువు కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్‌ కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్‌ వేస్తామన్న ప్రభుత్వ యంత్రాంగం క్రమంగా చేతులెత్తేస్తోంది. వ్యాక్సిన్‌ కొరత ఉందంటూ రోజుకోరకంగా నిబంధనలు మారుస్తోంది.

నో.. వ్యాక్సిన్‌ !.. రెండో డోసుకు కూడా అవస్థలే

యాప్‌లలో దొరకని స్లాట్లు

15వరకు తొలిడోస్‌ తాత్కాలిక నిలిపివేత 

కేవలం రెండోడోస్‌కే అవకాశమంటూ ప్రకటన

తాజా నిర్ణయంతో ప్రజల్లో నిరాశ

సత్తుపల్లి/ఖమ్మం కార్పొరేషన్‌, మే 7: కనిపించని శత్రువు కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్‌ కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్‌ వేస్తామన్న ప్రభుత్వ యంత్రాంగం క్రమంగా చేతులెత్తేస్తోంది. వ్యాక్సిన్‌ కొరత ఉందంటూ రోజుకోరకంగా నిబంధనలు మారుస్తోంది. ఇదిలా ఉంటే కరోనా బారిన పడిన వారికి రాష్ట్రంలో బెడ్లు, ఆక్సిజన్‌ కొరత లేదని ప్రభుత్వ అధికారులు, పాలకులు ప్రకటిస్తున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కరోనా బాధిత కుటుంబ సభ్యులు తమ వారిని కాపాడుకునేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక పక్క రోజు రోజుకూ కరోనా మరింత వ్యాప్తి చెందుతుండటంతో భయాందోళనలో ఉన్న ప్రజలు.. ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఆస్పత్రుల ముందు బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్‌ విడుదల చేసిన కొత్తలో దీనిపై అవగాహన లేక పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. రాను రాను కరోనా వ్యాప్తి విపరీతంగా పెరగుతుండటం, పలువురు ప్రాణాలు కోల్పోతుండటంతో వ్యాక్సిన్‌ కోసం పరుగు తీస్తున్నారు. ఇదే క్రమంలో మొదట్లో వ్యాక్సిన్‌ కోసం వయసు నిబంధనల కారణంగా కొందరు వ్యాక్సిన్‌ వేయించుకోలేకపోయారు. ఆ తరువాత 45 ఏళ్లపైబడిన వారికి వ్యాక్సిన్‌ అనుమతించటంతో ఆదరణ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్ల వయస్సు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించటంతో ప్రతీ ఒక్కరు సిద్ధమైనా వ్యాక్సిన్‌ కొరత కారణంగా రాష్ట్రంలో 18నుంచి 45 మధ్య వయస్సు వారికి వ్యాక్సిన్‌ అందే పరిస్థితి లేదు. 

మారుతున్న నిబంధనలు..

45ఏళ్ల వయస్సు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ క్రమంలో ఆసుపత్రుల వద్ద వందల సంఖ్యలో ప్రజలు బారులు తీరి ఉంటుండగా.. కొద్దిరోజులుగా వ్యాక్సిన్‌ కొరత కారణంగా అందుబాటులో ఉన్నంతవరకు వేసి మిగిలిన వారిని తిరిగి పంపారు. ఆతర్వాత వ్యాక్సిన్‌ కొరత దృష్ట్యా ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న వారు వారు మాత్రమే వారికి కేటాయించిన తేదీల్లో రావాలంటూ ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ ప్రక్రియ గ్రామీణ ప్రాంతంలోని నిరక్షరాస్యులకు పెద్ద సమస్యగా మారింది. వ్యాక్సిన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు పలువురు మీ సేవా కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. దీనికి తోడు తాజాగా ఈ నెల 15 వరకూ మొదటి డోసు వ్యాక్సిన్‌ నిలిపివేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్‌ అందుబాటులో లేనందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. మరో వైపు రెండో డోసు కోసం యాప్‌లో రిజిస్ర్టేషన్‌ చేయించుకునే అవకాశం లేకుండా ఉంది. ఇప్పటికే రెండోడోసుకోసం రిజిస్ర్టేషన్‌ చేసి తేదీ కేటాయించిన కొందరికి షెడ్యూల్‌ రద్దు చేసినట్టు మెసేజ్‌ రావటం కొసమెరుపు. సత్తుపల్లి ప్రాంతంలో సెకండ్‌ డోసు కోసం శుక్రవారం రిజిస్ర్టేషన్‌ కోసం ప్రయత్నించగా కల్లూరు పీహెచ్‌సీ మాత్రమే అందుబాటులో చూపుతోంది. రెండో డోసు అవకాశం ఎప్పుడు దొరుకుతుందోనని పలువురు ఎదురు చూస్తున్నారు. రాష్ర్టానికి లక్షలాది డోసుల వ్యాక్సిన్‌ దిగుమతి అయిందని ప్రకటిస్తున్నా సక్రమంగా వ్యాక్సిన్‌ అందని పరిస్థితి నెలకొంది.  

నేటి నుంచి మొదటి డోసు నిలిపివేత

అసలే వ్యాక్సిన్‌ కోసం జనం పరుగులు పెడుతుంటే వైద్యశాఖ మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ వరకు మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ను నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే మొదటి డోస్‌ తీసుకున్నవారికి మాత్రమే రెండో డోస్‌ ఇవ్వాలని పేర్కొంది. రాష్ట్రంలో ఏర్పడిన వ్యాక్సిన్‌ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో మొదటి డోస్‌ తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నవారు మరింత నిరాశ చెందుతున్నారు. 

నేడు కరోనా వ్యాక్సినేషన్‌ రెండో డోసు మాత్రమే

  ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శనివారం కరోనా వ్యాక్సినేషన్‌ రెండో డోసు వ్యాక్సినేషన్‌ మాత్రమే ఇస్తారని, మొదటి డోసు కోసం కొత్తగా ఎవ్వరూ వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు రావొద్దని ఖమ్మం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాక్సినేషన్‌ కేంద్రాలతో పాటు భక్తరామదాసు కళాక్షేత్రంలో కొవిషీల్డ్‌ రెండో డోసు ఇస్తారని, ఖమ్మంలోని నాలుగు అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల్లో కొవ్యాగ్జిన్‌ రెండోడోసు పంపిణీ జరుగుతుందన్నారు. లబ్ధిదారులు సహకరించాలని డీఎంహెచ్‌వో కోరారు.


Updated Date - 2021-05-08T06:00:44+05:30 IST