నిరుపయోగంగా 108 వాహనం

ABN , First Publish Date - 2021-08-10T05:30:00+05:30 IST

వైరా మండలానికి ఎంపీ నామా నాగేశ్వరరావు వితరణగా ఇచ్చిన 108వాహనం నిరుపయోగంగా ఉంది.

నిరుపయోగంగా 108 వాహనం
నిరుపయోగంగా ఉన్న ఎంపీ నామా ఇచ్చిన 108వాహనం

 మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గతేడాది ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కింద వితరణగా ఇచ్చిన ఎంపీ నామా

డ్రైవర్‌ను, నిధులను కేటాయించని వైద్యశాఖ

వైరా, ఆగస్టు 10: వైరా మండలానికి ఎంపీ నామా నాగేశ్వరరావు వితరణగా ఇచ్చిన 108వాహనం నిరుపయోగంగా ఉంది. గత ఏడాది కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎంపీ నామా పలు మండలాలకు 108వాహనాలను వితరణగా ప్రకటించారు. దానిలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వైరా మండలానికి వితరణగా ఇచ్చిన 108వాహనాన్ని ఎమ్మెల్యే రాములునాయక్‌తో కలిసి ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించారు. అయితే అంతకు కొన్నినెలల ముందే మండలంలోని కొండకొడిమ గ్రామానికి చెందిన ఎన్నారై వైరా మండలానికి ఒక 108వాహనాన్ని వితరణగా ఇచ్చారు. ఆ వాహనాన్ని 108సిబ్బంది వినియోగిస్తున్నారు. దాంతో నామా వైరా మండలానికి ఇచ్చిన 108వాహనం ప్రారంభించినప్పటికీ ఆతర్వాత నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓ చెట్టు కింద నిరుపయోగంగా పడి ఉంది. ఈ వాహనం నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదు. సిబ్బందిని కేటాయించలేదు.

ఖాళీగా డ్రైవర్‌..!

వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాహనం లేకుండానే ఒక డ్రైవర్‌ అనేకసంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటూ ప్రతినెలా వేతనాలు తీసుకుంటున్నాడు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఈ వాహన నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయించి ఖాళీగా ఉన్న డ్రైవర్‌, కొంతమంది సిబ్బందిని నియమించి ప్రస్తుత కరోనా సమయంలో ఈ వాహనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ వాహనాన్ని వినియోగంలోకి తెచ్చుకొనే విషయమై దృష్టిసారించాలని పలువురు సూచిస్తున్నారు.


Updated Date - 2021-08-10T05:30:00+05:30 IST