అమ్మో జ్వరం..

ABN , First Publish Date - 2021-08-22T05:02:24+05:30 IST

వర్షాకాలంలో సీజనల్‌ జ్వరా ల ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది.

అమ్మో జ్వరం..
ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతున్న బాలుడు

 వణుకుతున్న జనం 

 మండలంలో పెరుగుతున్న ఫీవర్‌ బాధితులు

 పారిశుఽధ్య చర్యలు పాటించని  ప్రజలు

సత్తుపల్లిరూరల్‌, ఆగస్టు 21: వర్షాకాలంలో సీజనల్‌ జ్వరా ల ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. సాధారణ జ్వరాలతో పాటు వైరల్‌ ఫీవర్స్‌ ప్రభలుతున్నాయి. అధికారుల లెక్కలకు అందని జ్వరాల కేసులు క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. దగ్గు, తలనొప్పి వస్తేనే కొవిడ్‌ భయం వెంటాడుతుండగా రెండేళ్ల క్రితం వలే విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అనధికారికంగా లెక్కకు రాని జ్వరాలు ప్రయివేటు ఆసుపత్రుల్లో కొన్ని కేసులు వచ్చిపోతునట్లు సమాచారం. అధికారికంగా 4 డెంగీ కేసులు నమోదవ్వగా ఒకటి ఖమ్మంలో ట్రీట్‌మెంట్‌ తీసుకుని ప్రస్తుతం తగ్గిపోయినట్లు గంగారం పీహెచ్‌సీ వైద్యాధికారి చింతా కిరణ్‌కుమార్‌ తెలిపారు. అయితే ఇప్పటివరకు డెంగీతో ఎవరూ మృతిచెందలేదని చెప్పారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ముగిసి కుదురుకునే లోపే వైరల్‌ ఫీవర్స్‌ వచ్చి మీద పడటంతో సామాన్యుడు అల్లాడి పోతున్నాడు.


మునిసిపల్‌, వైద్యారోగ్య శాఖ అప్రమత్తం


పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి వీధిలో బ్లీచింగ్‌, ఫాగింగ్‌ చల్లిస్తూ ప్రజలకు ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఫీవర్‌ సర్వేతో ముందుగానే అరికట్టేందుకు కృషి చేస్తుండగా మునిసిపల్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో నిత్యం పారిశుధ్యంపై పర్యవేక్షిస్తున్నారు. ఫీవర్‌ సర్వేతో పాటు వైరల్‌జ్వరాలపై అవగాహన కల్పించడంలో వైద్యారోగ్య శాఖ తీవ్రంగా శ్రమిస్తుంది. అడపాదడపా క్యాంపులు నిర్వహించే సింగరేణి సంస్థ ఇప్పుడైనా కనికరించి విషజ్వరాల వ్యాప్తిని నివారించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.


దోమల వృద్ధితోనే..


పట్టణం, మండలంలో చాలా ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా ఉంది. దీంతో నీరు ముందుకు కదలకపోవడంతో అక్కడ దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఎక్కువ రోజులు నీటిని తోట్టులు, డ్రమ్ములు, టైర్లలో నిల్వ ఉండటం మూలంగానే పుట్టుకొచ్చే తోక పురుగులే రేపు మనల్ని కుట్టే దోమలుగా వృద్ధి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. పట్టణ ప్రజలు నిర్లక్ష్యంగా ఎక్కడబడితే అక్కడ చెత్త, వ్యర్థాలు వేయడంతో దోమలు, ఈగలు వ్యాప్తిచెంది జబ్బులతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, ఇందుకు నిర్లక్ష్యంగా ఉండటమే కారణమని చెప్పకనే చెబుతుంది.


రక్తం పిండేస్తున్నారు..


ఇదిఇలా ఉండగా డెంగీ ఫీవర్‌ కారణంగా ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయి, రక్తం తక్కువగా ఉందనే కారణంగా పలు ఆసుపత్రులు రక్తం అవసరమని సూచిస్తున్నాయి. దీంతో రోగుల బంధువులు రక్తదాతల కోసం పరుగులు తీస్తుండగా కొన్ని ల్యాబ్‌ల్లో ఎక్కువ ధరకు రక్తం అమ్ముతుండగా అనుమతులు లేకుండా ల్యాబ్‌లు నడుస్తున్నట్లు సమాచారం.


జాగ్రత్త తప్పదు : డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, గంగారం పీహెచ్‌సీ


చల్లగా లేనివి, ఫ్రూట్స్‌, బలవర్దకమైన ఆహారం తీసుకోవాలి. డ్రైడే-ఫ్రైడేతో పాటు ఫాగింగ్‌, పారిశుధ్య నివారణ చర్యలు, నీరు నిల్వ లేకుండా చూడటం, అపరిశుభ్రత లేకుండా చూస్తే జ్వరాలు రాకుండా చూడవచ్చు. 100-500మీటర్ల దూరం పగలు మాత్రమే ప్రయాణించే ఈ దోమ కారణంగా ఎన్నో కేసులు పెరవచ్చు. ముఖ్యంగా నీటి నిల్వ లేకుండా, మురుగు చేరకుండా చూస్తే వైరల్‌ ఫీవర్స్‌ను తగ్గించవచ్చు. నిల్వ ఉన్న నీటిలో దోమ లార్వాలను నివారించాలంటే ఆయిల్‌ బాల్స్‌ వేయాలి. పాత కూలర్స్‌, టైర్లు, డబ్బాలు, పాత తొట్లను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి.


Updated Date - 2021-08-22T05:02:24+05:30 IST