కేటీపీఎస్‌ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి

ABN , First Publish Date - 2021-10-29T06:39:08+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)పాతప్లాంటులో బుధవారం జరిగిన ప్రమాదంలో గాయపడిన ఇద్దరు కార్మికులు గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)పాతప్లాంటులో బుధవారం ప్రమాదం జరిగింది.

కేటీపీఎస్‌ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి
ఘటనా స్థలంలో తీవ్ర గాయాలతో బాధితులు(ఫైల్‌)

 బాధిత కుటుంబాల ఆందోళన

 అండగా నిలిచిన అఖిలపక్షాల నేతలు

 బాధిత కుటుంబాలకు రూ.10లక్షల పరిహారానికి అంగీకారం

పాల్వంచ, అక్టోబరు 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)పాతప్లాంటులో బుధవారం జరిగిన ప్రమాదంలో గాయపడిన ఇద్దరు కార్మికులు గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)పాతప్లాంటులో బుధవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భట్టు మంగీలాల్‌(42), భట్టు సంతోష్‌(22) ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పాల్వంచ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భట్టు మంగీలాల్‌ మృతి చెందగా భట్టు సంతోష్‌ను మెరుగైన వైద్యంకోసం గురువారం తెల్లవారు జామున హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో రెండు కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఇద్దరు కార్మికులు మృతిచెందిన విషయం తెలుసుకున్న కేటీపీఎస్‌ కార్మికులు, అఖిలపక్షాల నేతలు గురువారం ఉదయం కేటీపీఎస్‌కు చేరుకున్నారు. టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ బాధిత కుటుంబాలతో కలిసి కేటీపీఎస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్‌ఐ ప్రవీణ్‌తో వాగ్వాదం జరిగింది. కొత్తగూడెం తాజా, మాజీ ఎమ్మెల్యేలు వనమావెంకటేశ్వరావు, కూనంనేని సాంబ శివరావు, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కాపా కృష్ణమోహన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, సీపీఎం పట్టణ కార్యదర్శి దొడ్డా రవికుమార్‌, ఎడవల్లి కృష్ణ తదితరులు కేటీపీఎస్‌ ఏడోదశ చీఫ్‌ ఇంజనీర్‌ చాంబర్‌లో చీఫ్‌ ఇంజనీర్‌ పలుకుర్తి వెంకటేశ్వరరావుతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు జెన్‌కో హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం కాంట్రాక్టర్‌ చందర్‌తో ఒక్కో బాఽధిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇన్సూరెన్స్‌ డబ్బులు ఇప్పించేందుకు ఒప్పందం కుదిర్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించే విషయంలో జెన్‌కో బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.75వేలను అందజేశారు. ఏడు నెలల తరువాత మిగతా డబ్బులు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఈ చర్చల్లో ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, డీసీఎంఎస్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌లు కొత్వాల శ్రీనివాసరావు, కంచర్ల చంద్రశేఖర్‌, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-29T06:39:08+05:30 IST