ఖజానా ఖాళీ.. కొవిడ్ విపత్కర పరిస్థితులతో స్తంభించిన లావాదేవీలు
ABN , First Publish Date - 2021-05-20T06:22:14+05:30 IST
ఖజానా ఖాళీ.. కొవిడ్ విపత్కర పరిస్థితులతో స్తంభించిన లావాదేవీలు

ఖమ్మం జిల్లాలో రూ.150కోట్లకు పైగా బకాయిలు
నిలిచిన అభివృద్ధి పనులు 8 ఉద్యోగులకు అందని పెంచిన వేతనాలు
ఖమ్మం కలెక్టరేట్, మే 19: విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌తో సర్కారు ఖజానా నిండుకుంది. ఆంక్షలతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో ప్రధాన శాఖలకు చెందిన బకాయిలు రూ.150 కోట్లకు పైగానే ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే స్టాంపులు రిజిస్ర్టేషన్లు, భూలావాదేవీలు, ఆర్టీఏ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆబ్కారీ ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉండడం తో వాటి ప్రభావం ఖజానాపై పడుతోంది. ఖజానాలో చిల్లిగవ్వకూడా లేక పోవడంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది.
బిల్లులను వెనక్కు పంపుతున్న ఆర్థిక శాఖ
నెల రోజులుగా ఖజానాశాఖ, పేఅండ్‌అకౌంట్ కార్యాలయంలో బిల్లులురాక కాంట్రాక్టర్లు, అధికారులు నానా అవస్థలు పడుతున్నారు.సాధారణ భవిష్యనిధి కావాలంటూ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు ప్రభుత్వ కరుణ కోసం నాలుగునెలలుగా నిరీక్షిస్తున్నారు.ఇవి కూడా చెల్లించే పరిస్థితుల్లో ఆర్థికశాఖ లేదు. జిల్లాలో 13,077 మంది ఉద్యోగులు, 12,716 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరి కోసం ప్రతి నెలా ప్రభుత్వం రూ.125 కోట్ల 5లక్షల 16వేల117 వేతనాలు, పెన్షనర్లకు రూ.34కోట్ల17లక్షల,48వేల853లను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఉద్యోగుల వేత నాలు తప్ప ఇతర చెల్లింపులు ఏవీ చెల్లించవద్దని, ఆ బిల్లులను కూడా ఆర్థికశాఖ వెనుకకు తిప్పి పంపినట్లు సమాచారం. జిల్లాలో దాదాపు రూ.150కోట్లవిలువైన7వేలబిల్లులను ఆర్థికశాఖ తిరస్కరించినట్లు సమాచారం.
పెంచిన వేతనాలేవీ?
రెండు నెలల క్రితం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించింది. వేతనాలు పెరుగుతాయని ఏప్రిల్ నెలలోనే సవరించిన వేతనాలు వస్తాయని ఉద్యోగులు ఆశించారు. కానీ ఏప్రిల్, మే నెలలో కూడా పెంచిన వేతనాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. కరోనాతో ప్రాణా లు కోల్పోతున్న ఉద్యోగుల కుటుంబాలు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
పేరుకుపోతున్న బకాయిలు
ఖమ్మం జిల్లాలో రూ.100కోట్ల 95లక్షల73వేల874 బకాయిల పేరుకు పోయినట్లు సమా చారం. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, హరితహారం, సెగ్రిగేషన్ షెడ్లు, రైతు వేదికల బిల్లులు దాదాపు ఐదుకోట్ల మేరబకాయిలు ఉన్నట్లు సమాచారం. ఆర్ అండ్‌బీ ఆధ్వర్యంలో నిర్వహించిన 83పనులకుగాను రూ. 63కోట్ల 76లక్షల 38 వేల 845లు బకాయిలు ఉన్నాయి. జిల్లాలో సీతారామ, ఎస్సారెస్పీ కింద నీటిపారుదల శాఖకు చెల్లించాల్సిన మొత్తం 716పనులకు గాను రూ.10కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పంచా యతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్‌భగీరథ పనుల కింద జిల్లాలో రూ.3కోట్ల 72లక్షల24వేల 330 బకాయిలు చెల్లించాల్సి ఉంది.