ఉసురు తీసిన తెగుళ్లు

ABN , First Publish Date - 2021-11-27T05:11:07+05:30 IST

ఉసురు తీసిన తెగుళ్లు

ఉసురు తీసిన తెగుళ్లు

తల్లాడ, రఘునాథపాలెం మండలాల్లో ఇద్దరు మిర్చి రైతుల ఆత్మహత్య

తల్లాడ/రఘునాథపాలెం, నవంబరు 26 : ఎన్నో ఆశలతో సాగు చేసిన మిర్చికి తెగుళ్లు ఆశించడం, ఫలితంగా పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో తల్లడిల్లిన ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఖమ్మం జిల్లాలో శుక్రవారం జరిగాయి. తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన మేడి శ్రీనివాసరావు(51) ఎకరంన్నర పొలంలో మిర్చి వేయగా.. ఆ పంటకు తెగుళ్లు వ్యాపించాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టినా పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనివాసరావుకు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఈ ఘటనపై తల్లాడ ఎస్‌ఐ ఎం.సురేష్‌ కేసు నమోదు చేసుకున్నారు. అలాగే రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామానికి చెందిన నాగండ్ల నాగేశ్వరరావు (60) శుక్రవారం ఉదయం మిరపతోట మందు వేసేందుకు ఆటోలో మందుకట్టలు వేసుకొని వెళ్లాడు. వైరస్‌సోకిన మిర్చి తోటను చూసి మనోవేదన చెందాడు. ఈ ఏడాదికూడా పంట చేతికి రాదని, అప్పులు తీర్చే దారేదన్న బాధతో పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఉమ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Updated Date - 2021-11-27T05:11:07+05:30 IST