ఆస్తి రాయలేదని తల్లిదండ్రులను ఇంట్లోనుంచి గెంటేసిన కుమారుడు

ABN , First Publish Date - 2021-07-25T05:06:23+05:30 IST

తల్లిదండ్రుల పేర ఉన్న కొద్దిపాటి పొలాన్ని తమ పేర రాయడంలేదనే కోపంతో ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను ఇంట్లోనుంచి బయటకు గెంటివేసి ఇంటికి తాళం వేసిన ఘటన శనివారం నేలకొండపల్లి మండలం అజయ్‌తండాలో జరిగింది.

ఆస్తి రాయలేదని తల్లిదండ్రులను ఇంట్లోనుంచి గెంటేసిన కుమారుడు
ఇంటికి తాళం వేయటంతో చలిలో ఇంటి ఎదుట కూర్చున్న బాణోత్‌ కోటా, రాజీ దంపతులు

 చలిలో ఇంటి ముందే నిద్రాహారాలు మాని కూర్చున్న దంపతులు 

 పోలీసులకు ఫిర్యాదు

 నేలకొండపల్లి మండలం అజయ్‌తండాలో సంఘటన

నేలకొండపల్లి, జూలై24: తల్లిదండ్రుల పేర ఉన్న కొద్దిపాటి పొలాన్ని తమ పేర రాయడంలేదనే  కోపంతో ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను ఇంట్లోనుంచి బయటకు గెంటివేసి ఇంటికి తాళం వేసిన ఘటన శనివారం నేలకొండపల్లి మండలం అజయ్‌తండాలో జరిగింది. అజమ్‌తండాకు చెందిన బాణోతు కోటా, రాజీ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కోటా పేరు మీద దాదాపు 0.15కుంటల భూమి ఉంది. ముగ్గురు కుమారులకు ఒక్కొక్కరికి 0.03కుంటల చొప్పున ఇచ్చాడు. అయితే తనకున్న 15 కుంటల భూమిలో 7కుంటల భూమికి మాత్రమే పట్టాపాస్‌ బుక్కు ఉండగా మిగిలిన ఎనిమిది కుంటల భూమి పాస్‌ పుస్తకంలో ఎక్కలేదు. దాంతో చిన్నకుమారుడు రామారావుకి ఇచ్చిన 3కుంటల భూమి అతడి పేరుపై మారలేదు. దాంతో తనకిచ్చిన భూమిని తనపేరుపై చేయాలని, తాను ఆ భూమిని అమ్ముకుంటానని చిన్న కుమారుడు రామారావు తల్లిదండ్రులతో గత కొన్ని రోజులుగా గొడవ పడుతున్నాడు. ఈ నేపఽథ్యంలో గ్రామంలోని కొంత మంది సహాయంతో రెండు రోజుల క్రితం తల్లిదండ్రులుంటున్న ఇంటికి తాళం వేసి, వారిని బయటకు వెళ్లగొట్టాడు. దాంతో నాలుగు రోజులుగా వారు వానలో తడుస్తూ బయటే ఉంటున్నారు. ఈ వ్యవహారంపై కోటా రాజీ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, ఈదురు గాలులకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామన్నారు. తమను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్న కుమారుడు రామారావు, కోడలు లక్ష్మి బారి నుంచి తమను కాపాడాలని ఫిర్యాదులో కోటా రాజీ కోరారు. 


Updated Date - 2021-07-25T05:06:23+05:30 IST