అదిగో పులి !

ABN , First Publish Date - 2021-11-22T05:12:55+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. శనివారం తెల్లవారుజామున టేకులపల్లి మండలం మొట్లగూడెం జంగాలపల్లి గేట్‌ వద్ద రోడ్డుదాటుతూ కనిపించిన పెద్దపులి ఆదివారం మధ్యాహ్నం టేకులపల్లి-బోడు ప్రధాన రహదారిపై అందుగులగూడెం

అదిగో పులి !
పులి పాదముద్రలు సేకరిస్తున్న ఫారెస్టు అధికారులు

అందుగులగూడెం సమీపంలో మళ్లీ కనిపించిన వ్యాఘ్రం 

రోళ్లపాడు అటవీప్రాంతంలో సంచారం

సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన వాహనదారులు

గిరిజనులను అప్రమత్తం చేసిన అటవీ అధికారులు

ఇల్లెందు/టేకులపల్లి, నవంబరు 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. శనివారం తెల్లవారుజామున టేకులపల్లి మండలం మొట్లగూడెం జంగాలపల్లి గేట్‌ వద్ద రోడ్డుదాటుతూ కనిపించిన పెద్దపులి ఆదివారం మధ్యాహ్నం టేకులపల్లి-బోడు ప్రధాన రహదారిపై అందుగులగూడెం గ్రామ సమీపంలో రోడ్డుదాటి వరిపొలాల నుంచి బద్దుండా, మద్దిరాలతండా, రోళ్లపాడు అటవీప్రాంతం వైపు వెళ్లింది. పులి రోడ్డుదాటుతున్న దృశ్యాలను వాహనదారులు సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. టేకులపల్లి ఫారెస్టు రేంజ్‌ అధికారి ముక్తార్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో ఫారెస్టు సిబ్బంది పులిపాద ముద్రలను సేకరించారు. పులి సంచరిస్తున్న పరిసరప్రాంత గ్రామాల్లో ఫారెస్టు అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా మొట్లగూడెం జంగాలపల్లి గేట్‌ వద్ద నుంచి 30కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న అందుగులగూడెం ప్రాంతానికి పులి నడుచుకుంటూ వచ్చినట్లు ఫారెస్టు అధికారులు నిర్ధారించారు. 

పులి సంచారంతో గిరిజన గ్రామాలు అప్రమత్తం

టేకులపల్లి మండలం అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలియడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కుంటళ్ల, బద్దుతండా, పెట్రాంచెల్క, ఎర్రాయిగూడెం, బోడు, రామచంద్రునిపేట, రోళ్లపాడు  పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆదివారం రోళ్లపాడు వద్ద సంచరిస్తున్న పెద్దపులిని పలువురు సెల్‌ఫోనలతో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. దండగుండాల, పూబల్లి, ధర్మాపురం ఏజెన్సీ గ్రామాల్లో అటవీశాఖ అధికారులు ఆదివారం సందర్శించి పెద్దపులి సంచారం గురించి వివరించి ఒంటరిగా సంచరించవద్దని హెచ్చరికలు చేశారు. వ్యవసాయపనులకు అటవీప్రాంతాల్లో సంచరించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు విజ్ఙప్తి చేశారు. 

Updated Date - 2021-11-22T05:12:55+05:30 IST