మాన్యం.. దైన్యం!
ABN , First Publish Date - 2021-08-03T04:59:12+05:30 IST
మాన్యం.. దైన్యం!
అన్యాక్రాంతంలో దేవాదాయ భూములు
కోర్టులో నలుగుతున్న భూవివాదాలు
దశాబ్దాలుగా తేలని కేసులు
దర్జాగా అక్రమించి సొమ్ము చేసుకుంటున్న ఆక్రమణదారులు
స్వాధీనానికి వెనకాడుతున్న దేవాదాయశాఖ అధికారులు
ఇదీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
ఆలయ భూముల పరిస్థితి
కొత్తగూడెం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మూలవిరాట్టు పేరిట ఉండాల్సిన దేవాలయ భూములు అక్రమార్కుల కబంధ హస్తాల్లో నలుగుతున్నాయి. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన ఆ శాఖ అధికారులు మీనవేషాలు లెక్కిస్తుండటంతో కొందరు ఆక్రమణదారుల ఆగడాలకు దేవుడి మాన్యాలు దైన్యమైన స్థితికి వెళ్లాయి. ఓవైపు సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతుండగా.. పర్యవేక్షణ లోపంతో దేవుడి భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఈక్రమంలో కొందరు కిందిస్థా యి అధికారులు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు పంపుతూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాల్వంచ శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయ అభివృద్ధికి దాతలు, భక్తులు దానంగా ఇచ్చిన భూములను అక్రమించేందుకు భక్త సమాజమండలి వారు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తమకే చెందాలని దురుద్ధేశంతో కోర్టులో కేసు వేశారు. దేవాలయానికి వ్యతిరేఖంగా భక్తసమాజమండలి గౌరవాధ్యక్షుడు, సభ్యుల్లో కొందరు కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అటువంటి వ్యక్తులకే పాలకమండలిలో సభ్యులుగా పేర్లు సిఫారసు చేయడం గమనార్హం. పాల్వంచ పట్టణం గుడిపాడులోని శ్రీ మోక్ష వెంకటేశ్వరస్వామి దేవాలయ భూముల్లో చర్చ్‌లు నిర్మించారని సమాచారం.
ప్రశ్నార్థకంగా ఆలయాల మనుగడ
దేవాలయ భూములు ఆన్యాక్రాంతంతో ఆలయాల మనుగడ ప్రశ్నార్థంగా మారుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 2వేల ఎకరాలకు పైగా ఆలయాల భూములు అక్రమణకు గురైనట్లు గతంలో రెవెన్యూశాఖ నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళనలో దేవాదాయ శాఖ అఽధికారులే గుర్తించారు. కొన్ని కోర్టు తీర్పుల్లో సైతం ఆలయాల భూముల ఆక్రమణలు నిజమని తేలింది. దేవాదాయశాఖ పరిధిలో ఖమ్మం జిల్లాలో చిన్న, పెద్దవి కలిపి 190, భద్రాద్రి జిల్లాలో 32దేవాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాతలిచ్చిన భూములు, మాన్యాలు, మఠాల భూములన్నీ కలిపి 14,391.32 ఎకరాలున్నాయి. ఇందులో ఆలయాలకు చెందిన మాన్యం 1,984.07 ఎకరాలు అన్యాక్రాంతమైందని అధికారులు గుర్తించారు. కబ్జాకు గురైన భూములన్నింటిని తక్షణమే స్వాధీనం చేసుకుని దేవాలయాల మూలవిరాట్టు పేరిట పట్టాదారు పాసుపుస్తకాల్లో నమోదు చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ అధికారులు మాత్రం ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసేందుకు మీనమేషాలు లెక్కపెడుతుండటం విమర్శలకు దారితీస్తోంది. ఖమ్మం జిల్లాలో 4,755.3ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 9,636.02 ఎకరాలతో కలిపి మొత్తం 14,391.32 ఎకరాలు భూములున్నాయి. వీటిలో అర్చకుల ఆధ్వర్యంలో ఖమ్మంలో 1,360.19ఎకరాలు, భద్రాద్రిలో 234.31 ఎకరాలు కలిపి మొత్తం 1,595.1ఎకరాలున్నాయి. లీజ్‌కు ఇచ్చిన భూములు ఖమ్మంలో 2,269.03 ఎకరాలు, భద్రాద్రిలో 7,406.03ఎకరాలు కలిపి 9,675.06 ఎకరాలున్నాయి. అయితే ఖమ్మంలో 833.02ఎకరాలు భద్రాద్రిలో 1,151.05 ఎకరాలు కలిపి 1,984.07 ఎకరాల భూములకు దేవాలయ మూలవిరాట్టుకు ఆక్రమణదారుల మధ్య వివాదాలతో కోర్టు కేసులున్నాయి. ఖమ్మంలో 293.06ఎకరాలు భద్రాద్రిలో 844.03 ఎకరాలు కలిపి 1,137.09 ఎకరాలు ఖాళీ స్థలాలు, కొండలు, గుట్టలున్నాయి. ధరణిలో ఖమ్మంలో 192 దేవాలయాలకు 4,755.3 ఎకరాలకుగాను 723.30 ఎకరాల భూమి మాత్రమే ధరణి సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఇంకా 4,034ఎకరాల భూమి ధరణిలో నమోదు కాలేదు. భద్రాద్రి జిల్లాలో 32దేవాలయాలకు 9,636.02 ఎకరాలకుగాను 2,550.22 ఎకరాల భూమి మాత్రమే ధరణి సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఇంకా 7,086.20ఎకరాల భూమి ధరణిలో నమోదు కాలేదు. ఖమ్మంలో రెవెన్యూసర్వేలో మొదటి దశలో 27.05 ఎకరాలు గుర్తించగా 20.20 ఎకరాలకు లీజ్ పూర్తయ్యింది. రెండో దశలో 7.02 ఎకరాలు గుర్తించగా 4.20ఎకరాలు లీజ్ పూర్తయ్యింది. మూడో దశలో 363.09 ఎకరాలు గుర్తించారు. అయుతే దేవాలయ భూముల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఅర్ ఆదేశాలతో జీవో ఏంఎస్ 107ను జారీ చేసిన విషయం విధితమే. ఈ జీవో ప్రకారం దేవాలయ భూముల్లో గతంలో పంచాయతీ, మునిసిపల్ శాఖలు ఇచ్చిన నిర్మాణాలకు అనుమతులు చెల్లవు. దేవాదాయ శాఖ అనుమతి ఉన్న భూములు రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో రెవెన్యూ సెక్షన్ 22 ఏ1 కింద పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. ధరణిలో ప్రోహిబిటెడ్ లిష్టులో దేవాలయ భూముల వివరాలు కనపడటం లేదు. దీంతో ఆయా భూములు అన్యాక్రాంతమవుతన్నాయి.
దేవాలయ భూములు ఆక్రమిస్తే చర్యలు
కె.మహేంద్రకుమార్, దేవాదాయశాఖ సహాయ కమిషనర్
ఈ వ్యవహారంపై దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కే. మహేంద్రకుమార్‌ను వివరణ కోరగా దేవాలయ భూమలను ధరణిలో నమోదు కాలేదని గుర్తించామని, ఈ విషయమై దేవాదాయ ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించామన్నారు. దేవాలయ భూములు ఆక్రమిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేవాలయ భూముల పరిరక్షణే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
కబ్జాకు గురైన భూములివే..
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 1,126.28 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఇందులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురుషోత్తపట్నంలో 900ఎకరాలుండగా కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు యూస్ అండ్ చార్జీలు చెల్లిస్తున్నారు.
శ్రీపమిటిగంట వెంకటరమణ (అంబసత్రం) భద్రాచలం 4,900 ఎకరాలుండగా టేకులపల్లిలోని కారుకొండలో ఉన్న 13.27కుంటలు ఆక్రమణకు గురైంది. కోర్టు తీర్పు దేవాదాయశాఖకు అనుకూలంగా వచ్చింది. శాఖల మధ్య సమన్వయ లోపంతో స్వాధీనం కాలేదు.
కుసుమాన్నబాబా టెంపుల్ (భద్రాచలం) రాజీవ్‌నగర్‌కాలనీలో 3.57 కుంటలు ఆక్రమణకు గురైంది. ఆదేశాలు వచ్చినా లా అండ్ అర్డర్ సమస్యతో స్వాధీనం కాలేదు.
బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయం (అన్నపురెడ్డిపల్లి) 1.17 కుంటలు ఆదేశాలు వచ్చినా లా అండ్ అర్డర్ సమస్యతో స్వాధీనం కాలేదు.
అంకమ్మ టెంపుల్ (మాధాపురం) 7.57ఎకరాలు కోర్టు తీర్పు వచ్చనా హైకోర్టును ఆశ్రయించడంతో పెండింగ్‌లో ఉంది.
శ్రీ వెంకటేశ్వరస్వామి టెంపుల్ (జమలాపురం) పక్కన్న 1.06 ఎకరాలు గుడిసెలు వేసుకున్నారు. కానీ వాటిని తొలగటించలేదు.
శ్రీచంద్రశేఖర స్వామి టెంపుల్ (నారపనేని పల్లి, వైరా) 4.18 ఎకరాలు టైటిల్‌డీడ్ ప్రాబ్లంతో సాధీనం కాలేదు.
శ్రీసీతారామ టెంపుల్ (కాసిరాజుగూడెం) 129.06 ఎకరాలు మాస్ అక్రమణ కింద కోర్టు కేసు వేశారు. సుమారు 15ఏళ్లకు పైగా ఆక్రమణలో ఉంది.
శ్రీ శంభులింగస్వామి ఆలయం (ముష్టికుంట్ల) 138.19ఎకరాలు టైటిల్ వివాదంతో కోర్టు కేసు వేశారు. కాస్రా పహాణిలో ఆలయం పేరుతో ఉండి.. కాలక్రమేనా ఆన్యాక్రాంతమయ్యాయి.
శ్రీయోగనంద లక్ష్మినర్సింహ టెంపుల్ (పాతర్లపాడు) 512.13ఎకరాల భూమి ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని గాలివారిగూడెంలో ఉంది. హైకోర్టులో కేసు గెలిచి కలెక్టర్‌కు అర్డర్ కాపీలు సమర్పించారు. రెవెన్యూ సహకారం లేకపోవడంతో స్వాధీనం కాలేదు.
