‘సాయుధ’ స్ఫూర్తితో భూ పోరాటాలు

ABN , First Publish Date - 2021-09-18T06:07:00+05:30 IST

‘సాయుధ’ స్ఫూర్తితో భూ పోరాటాలు

‘సాయుధ’ స్ఫూర్తితో భూ పోరాటాలు
ఖమ్మంలో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం శ్రేణులు

విలీనం జరిగినా భూ సమస్యలకు దొరకని పరిష్కారం 

దళితబంధు అందరికీ వచ్చేలా కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తాం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

ఖమ్మంలో సాయుధ పోరాట వార్షికోత్సవ సభ

ఖమ్మంటౌన్‌, సెప్టెంబరు 17: తెలంగాణ సాయుధ పోరాటమిచ్చిన స్ఫూర్తితో భూ సమస్యలపై పోరాటం చేస్తామని, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందినా ఇంతవరకు భూ సమస్యలకు పరిష్కారం కాలేదని, పేదలకు భూమిదక్కలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఖమ్మంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో తమ్మినేని మాట్లాడారు. తెలంగాణ విమోచన దినమని, అలాగే విలీనమని ఎన్నిపేర్లు పెట్టినా, చరిత్రాత్మక సంఘటనను బీజేపీ వక్రీకరిస్తూ.. హిందువులపై ముస్లింల దాడిగా ప్రచారం చేస్తోందని, సాయుధ పోరాటంలో ముక్దుమ్‌మోహిద్దీన్‌, షోయబుల్లాఖాన్‌, తొలిసారి పోరాటం చేసిన బందగి పాల్గొన్నారన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు, భూస్వాములు అందరూ హిందువులేనని, నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో హిందూ, ముస్లింలు కలిసి పాల్గొన్నారన్నారు. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాతే నిజాం నిరంకుశపాలనపై పోరాటాలు చేయగలిగారన్నారు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, తొలి పోరాట మహిళ చాకలి ఐలమ్మ ఇచ్చిన స్ఫూర్తితోటే ఆంద్రమహాసభ ఎంతో ఉత్తేజం పొందిందన్నారు. వీరతెలంగాణ పోరాటంలో బీజేపీ తొలిరూపమైన జనసంఘ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ భూస్వామలకే మద్దతు ఇచ్చాయని, బండి సంజయ్‌ చరిత్రను చదువుకోవాని హితవుపలికారు. నిజాం లొంగిపోయాక ఆయనకు రాజ్‌ప్రముఖ్‌ బిరుదును ఇచ్చి అప్పట్లోనే భరణంగా రూ.570కోట్లు ఇచ్చిన హీన సంస్కృతి కాంగ్రెస్‌దేనన్నారు. ఎన్నో అరాచకాలు చేసిన రజాకార్లను శిక్షించకుండా వదిలారని, భూ సంస్కరణల చట్టం తెచ్చినా అది అమలుకాకుండా ఎన్నో లొసుగులు ఏర్పరిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం నిజాం నుండి కాంగ్రెస్‌కు అధికార మార్పిడి జరిగింది కానీ, తెలంగాణ ప్రజల భూసమస్యలు తీరలేదని,అన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ కొందరు ఓట్లు పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ దళితులకు మూడె ఎకరాలు ఇస్తామని మభ్యపెట్టి ఏడేళ్లు కాలం గడిపారన్నారు. మాటమార్చి దళితబంధుపథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించి కేవలం రాష్ట్రంలో నాలుగు మండలాలను ఎంపిక చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అందుకే రాష్ట్రంలోని 730 మండలాల్లో దళితులకు రూ.10లక్షలు ఇచ్చేలా పోరాటాలు నిర్వహిస్తామ న్నారు. అటవీహక్కుల చట్టాన్ని కాల రాసి, పోడు భూములను ఆక్రమిం చారని, చిన్నపిల్లల తల్లులపై కేసులు పెట్టించి, అప్పటి నిజాం ప్రభుత్వాన్ని తలపిస్తున్నారని తమ్మినేని దుయ్య బట్టారు. కేంద్రం ప్రజల ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చే నెల 22న హైదరాబాదులో అన్ని పార్టీలతో కలిసి మహాధర్నా నిర్వహిస్తా మన్నారు. అలాగే 27వతేదీన రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తామని, పోడుభూముల పేరుతో అక్రమ కేసులు బనాయిం చడాన్ని వ్యతిరేకిస్తూ, భూసమస్యలపై అధ్యయనం చేసి అక్టోబరు 5న రహదారులను దిగ్బంధిస్తామన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యా యన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.వెంకట్‌, సోమయ్య, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, బత్తుల హైమావతి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు నగరంలో సీపీఎం శ్రేణులు కదంతొక్కాయు. ఇల్లెందు క్రాస్‌రోడ్డు నుంచి పెవిలియన్‌ గ్రౌండ్‌ వరకు భారీ మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. 



Updated Date - 2021-09-18T06:07:00+05:30 IST