ప్రైవేటు దందాపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా!

ABN , First Publish Date - 2021-05-30T05:32:50+05:30 IST

ప్రైవేటు దందాపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా!

ప్రైవేటు దందాపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా!
నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు

ఖమ్మంలోని రెండు ఆసుపత్రుల అనుమతులు రద్దు

వెల్లడించిన డీఎంహెచ్‌వో మాలతి 

ఖమ్మం కలెక్టరేట్‌, మే 29 : కరోనా విపత్కర వేళ ఖమ్మంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న వైద్య దందాపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్న ఆస్పత్రులపై చర్యలకు ఉపక్రమించారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’జిల్లా సంచికలో ‘ఆగని దందా.. అదే పంఽథా.. మంత్రి హెచ్చరిస్తున్నా మారని తీరు’ అంటూ ప్రచురితమైన కథనానికి జిల్లా హైపవర్‌ కమిటీ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్పందించారు. నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా.. వాటిలో ‘ఆంధ్రజ్యోతి’లో సూచించిన అన్ని ఆస్పత్రులు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నెస్పీ రోడ్‌లోని శ్రీ విజయలక్ష్మి ఆసుపత్రి, మార్వెల్‌ ఆస్పత్రిలో కొత్త రోగులను చేర్చుకోవద్దని అధికారులు ఆయా యాజమాన్యాలను హెచ్చరించారు. రెండు రోజుల వ్యవధిలో ప్రస్తుతం ఉన్న  రోగులను వేరే ఆస్పత్రికి తరలించనున్నట్లు, అతర్వాత ఆస్పత్రుల అనుమతులను రద్దుచేయనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి తెలిపారు. వీటితో పాటు శశి, శ్రీభవాని, ఆర్‌ఎల్‌, శ్రీ సూరయ, శ్రీ కృష్ణ, శ్రీలలిత, జేఆర్‌ ప్రసాద్‌ ఆస్పత్రి తదితర ప్రైవేటు ఆస్పత్రిల్లోనూ తనిఖీలు చేపట్టారు. అన్ని ఆస్పత్రుల్లోనూ ఫీజుల వివరాల పట్టికలు లేకపోవడంతో హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేయడం, రోగికి సరైన బిల్స్‌ ఇవ్వక పోవడం, చికిత్స సమయంలో కొవిడ్‌ ప్రొటోకాల్‌, నిబంధనలు పాటించక పోవడం, ఇష్టారీతిన ఆర్‌ఏటీ పరీక్షలను చేయడం, బయో మెడికల్‌ వ్యర్థాలను సరైన పద్ధతిలో తొలగించక పోవడం లాంటి లోపాలున్నాయంటూ డీఎంహెచ్‌వో మాలతి తెలిపారు. పలు మార్లు సమీక్షల్లో వివరించినా నిర్లక్ష్యానికి పాల్పడడంతో వీరికి నోటీసులను అందించనున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో అడిషనల్‌ సీపీ రామానుజం, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సుబ్బారావు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ అలివేలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-30T05:32:50+05:30 IST