ఉపాధి ఏపీవో సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-12-10T05:03:44+05:30 IST
విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అశ్వారావుపేట జాతీయ ఉపాధిహామీ పథకం ఏపీవో శ్రీనివాస్‌ను జిల్లా గ్రామీణాభివృద్ధి అదనపు అధికారి సస్పెండ్ చేశారు.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణం
కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్‌లకు జరిమానా
ఉత్తర్వులు జారీ చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు అధికారి
అశ్వారావుపేట, డిసెంబరు 9: విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అశ్వారావుపేట జాతీయ ఉపాధిహామీ పథకం ఏపీవో శ్రీనివాస్‌ను జిల్లా గ్రామీణాభివృద్ధి అదనపు అధికారి సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు రామన్నగూడెం పంచాయతీ కార్యదర్శి రోహిత్, టెక్నికల్ అసిస్టెంట్ బాలకృష్ణకు ఒక్కొక్కరికి రూ. ఐదువేల చొప్పున జరిమానాను విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు గురువారం ఎంపీడీవో విద్యాధరరావు సంబంధిత ఉత్తర్వులను రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూపకు అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2020 అక్టోబరులో రామన్నగూడెం పంచాయతీ పరిధిలోని ఎనిమిది మంది గిరిజన రైతులకు ఈజీఎస్ పథకంలో 25 ఎకరాల్లో పామాయిల్, ఒక ఎకరం కొబ్బరి తోటను వేసుకునేందుకు అనుమతులు వచ్చాయి. ఈక్రమంలో ఈజీఎస్‌లో మంజూరైన తోటలకు గోతులు తీసే ఖర్చుతో పాటు ప్రతీ నెల ఒక్కో మొక్కకు రూ.15ల చొప్పున నిర్వహణ ఖర్చుల కింద చెల్లిస్తారు. అయితే రామన్నగూడెం పంచాయతీలో పైన తెలిపిన ఎనిమిది రైతులకు పామాయిల్, కొబ్బరి తోటలు మంజూరయ్యాయి. ప్లాంటేషన్ కూడా పూర్తి చేశారు. అందులో ఇద్దరు రైతులకు గోతులు తీసిన సొమ్ము ఇంత వరకు చెల్లించలేదు. అలానే ప్రతి నెలా మొక్కల నిర్వహణకు గానూ ఎకరానికి రూ.900 చొప్పున చెల్లించాల్సిన సొమ్మును చెల్లించడం లేదు. లబ్ధిదారులు అనేక మార్లు ఈజీఎస్, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగివేసారారు. దీంతో లబ్ధిదారుల తరుపున రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప జిల్లా కలెక్టర్‌కు పై సంఘటనపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణలో సంబంధిత లబ్ధిదారులకు ప్లాంటేషన్ వేసేందుకు ఈజీఎస్ నుంచి అనుమతులు లభించినట్టట తెలుస్తోంది. అయితే ప్లాంటేషన్ వేసినట్టు ఇంత వరకు సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదవ్వలేదని అధికారులు గుర్తించారు. విధుల్లో సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే లబ్ధిదారులకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అదనపు అధికారి ఈజీఎస్ ఏపీవో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ, క్షేత్రస్థాయి అధికారులైన పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్‌లకు రూ. ఐదువేల చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.