ఊపిరి పోసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2021-08-11T05:18:06+05:30 IST

జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ వందలాదిమంది కరోనా బాధితులకు ప్రాణం పోసింది. రికార్డుస్థాయిలో ఆక్సిజన్‌ను వినియోగించారు. కొవిడ్‌కు ముందు కనీసం ప్లాంట్‌ కూడా లేని పరిస్థితి ఉండేది.

ఊపిరి పోసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌

 జిల్లాఆస్పత్రిలో రోజుకు 2.5 టన్నుల ప్రాణవాయువు ఉత్పత్తి

8వేల మందికి పైగా ఆక్సిజన్‌ వినియోగం

 రికార్డు స్థాయిలో వినియోగం

ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు10:  జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ వందలాదిమంది కరోనా బాధితులకు ప్రాణం పోసింది. రికార్డుస్థాయిలో ఆక్సిజన్‌ను వినియోగించారు. కొవిడ్‌కు ముందు కనీసం ప్లాంట్‌ కూడా లేని పరిస్థితి ఉండేది. కానీ రెండో దశలో ప్రాణ వాయువు కు ఏర్పడిన డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యం లో జిల్లా ఆస్పత్రిలో ప్రాణవాయువు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. గత ఏప్రిల్‌ 14న ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను నెలకొల్పారు. 13వేల లీటర్ల సామర్థ్యం కలిగిన (ఎల్‌వోటీ) లిక్విడ్‌ ఆక్సిజన్‌ టవర్‌ను ఏర్పాటు చేశారు. యుద ్దప్రాతిపదికన ఏర్పాటు చేసి ఈ ప్లాంటు ద్వారా నిత్యం 2,800నుంచి 3వేల లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 

 గాలి ద్వారా

ఏర్పాటు చేసిన కేంద్రంలో యంత్రం గాలిని తీసుకుని వడపోసి నైట్రోజన్‌ విషయవాయులను బయటకు పంపించి అవసరమైన ఆక్సిజన్‌ను విడదీస్తుంది. దీనిని ప్రత్యేకంగా వడపోసి ట్యాంకులోకి నింపి చల్లబరుస్తుంది. ట్యాంకర్‌ ద్వారా ఆస్పత్రి వార్డుల్లోకి అనుసంధానించిన పైప్‌లైన్ల ద్వారా రోగులకు ఆక్సిజన్‌ను అందిస్తారు. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే ప్రాణవాయువును కనీసం 350 మందికి నిరంతరాయంగా అందించే ఆస్కారం ఉంటుంది. 

8వేల మందికి పైగా 

 జిల్లా ప్రధాన ఆస్పత్రికి కరోనా రెండో వేవ్‌లో కనీసం 8వేలకు పైగా ఆక్సిజన్‌, 850 మంది వెంటిలేషన్‌తో చికిత్స పొందారు. మార్చి నుంచి ప్రారంభమైన రెండో వేవ్‌లో ప్లాంట్‌ ఏర్పాటుకు ముందు ఆక్సిజన్‌ కోసం నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఆక్సిజన్‌ బెడ్‌ కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అంతేకాదు ప్రైవేటు ఆస్పత్రిల్లోనూ ఆక్సిజన్‌ బెడ్‌ దొరక్క ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అధికంగా ఉన్నాయి. ఈ తరుణంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు బీజం పడింది.  రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటును యుద్దప్రాతిపదికన నిర్మించింది. పక్షం రోజుల్లో ప్రారంభిం చారు. ఫలితంగా ప్రాణవాయువు కోసం పరుగులెత్తే పరిస్థితికి చెక్‌ పడినట్లైంది.

 నాలుగు నెలల్లో 320 టన్నుల వినియోగం

జిల్లా ఆస్పత్రిలో ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై , ఆగస్టు ఇప్పటి వరకు సగటున 320టన్నుల ఆక్సిజన్‌ వినియో గమయినట్లు తెలుస్తోంది. మే నుంచి ఆస్పత్రికి కొవిడ్‌ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే, జూన్‌, జూలై చివరి వరకు ఆస్పత్రిలో కనీసం పడక దొరకడమే కష్టయ్యింది. జిల్లాలో320 పడకలతో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. అన్ని పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కల్పించారు. వీటీలో 30పడకలు ఐసీయూ వెంటిలేషన్‌ పడ కలను ఏర్పాటు చేశారు. ఒక్క రోజులో కనీసం 2.5 టన్నుల ఆక్సిజన్‌ను వినియోగించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కేంద్రంలో రోజుకు 3వేల లీటర్ల చొప్పున నెలకు 90 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి అవుతోంది. నాలుగు నెలల్లో 360 టన్నుల ఉత్పత్తి కాగా, ఇప్పటి వరకు 320 టన్నుల ఆక్సిజన్‌ను వినియోగించనుట్లు తెలుస్తోంది. వీటితో పాటు 50నుంచి 60 సిలిండర్లను సిద్ధం చేస్తున్నారు. 

 కొరత రానివ్వలేదు , 

వెంకటేశ్వర్లు, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు

జిల్లా ఆస్పత్రిలో ఈ నాలుగు నెలలుగా ఆక్సిజన్‌ కొరత రానివ్వకుండా చేశాం. కోవిడ్‌కు చేసిన సేవలతో పాటు అత్యవసరానికి వచ్చే రోగులకు కూడా ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జిల్లా ఆస్పత్రికి 13 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన లిక్విడ్‌ ట్యాంకర్‌ను ఏర్పాటు చేయించారు. అప్పుడప్పుడు సాంకేతిక లోపాలు తలెత్తినప్పటికీ ఎప్పటికప్పుడు నిపుణుల ఆధ్వర్యంలో ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాం. దీని ద్వారా బాధితులకు ఆక్సిజన్‌ కొరత లేకుండా ప్రాణవాయువును అందించగలుగుతున్నాం. 

Updated Date - 2021-08-11T05:18:06+05:30 IST