రాయితీ ట్రాక్టర్లు.. నాలుగేళ్లుగా నిల్‌..

ABN , First Publish Date - 2021-09-04T05:25:06+05:30 IST

రాయితీ ట్రాక్టర్లు.. నాలుగేళ్లుగా నిల్‌..

రాయితీ ట్రాక్టర్లు.. నాలుగేళ్లుగా నిల్‌..

వ్యవసాయ యాంత్రీకణ పథకానికి బ్రేక్‌

చివరిసారిగా 2018మార్చిలో పంపిణీ

2014 నుంచి 2017 వరకు 

ఖమ్మం జిల్లాలో 746 యూనిట్ల అందజేత

ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబరు 3: సాగుకు సాంకేతిక పరిజ్ఞానం జోడించి రైతుకు లాభాల పంట పండించడా నికి ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ యాంత్రీకరణ  పథకానికి బ్రేక్‌ పడింది. నాలుగేళ్లుగా సబ్సిడీ ట్రాక్టర్లకు సర్కారు మంగళం పాడింది. ఖమ్మం జిల్లాలో చివరి చివరి సారిగా 2018 మార్చిలో లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేసిన వ్యవసాయశాఖ.. ఆ తర్వాత కార్యాచరణకు పుల్‌స్టాప్‌ పెట్టింది. 

 తుమ్మల చొరవతో అదనంగా కేటాయింపు..

2018 మార్చిలో ఖమ్మం జిల్లాలో రైతులకు ట్రాక్టర్లను కేటాయించే క్రమంలో  2017వ సంవత్స రానికి 381 ట్రాక్టర్లనే కేటాయించారు. అయితే రైతుల సంఖ్య అధికంగా ఉండటంతో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతీసుకుని మరో 300ట్రాక్టర్లను మంజూరు చేయించారు. ఈ క్రమంలో 2017కు సంబంధిం చి 681 ట్రాక్టర్లను రాయితీపై రైతులకు అందజేశారు. 2017వ సంవత్సరం వరకు 1400దరఖాస్తులు స్వీకరిం చిన ప్రభుత్వం వాటిలో సుమారు సగం మందికి మాత్రమే యూనిట్లు మంజూరు చేసింది. ఆ తర్వాత అసలు దరఖాస్తులను తీసుకోవడం మానేసింది.  

చివరి సారిగా 2018లో పంపిణీ..

 ఖమ్మం జిల్లాలో వరితో పాటు మిర్చి, పత్తి, ఉద్యాన పంటలను సాగుచేస్తుంటారు. అయితే ఆయా పంటల సాగులో ట్రాక్టర్ల వినియోగం ఉంటే సాగు సులభతరం అవుతుంది. ఈ నేపథ్యంలో 2014వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభిం చింది. అదే ఏడాది 2014లో పది యూనిట్లను ఖమ్మం జిల్లాలో పంపిణీచేశారు. ఆ తర్వాత సంవత్సరం 55 ట్రాక్టర్లను రైతులకు అందజేశారు. అనంతరం 2106, 2017 సంవత్సరాలకు సంబంధించి మొత్తం 681 ట్రాక్టర్లను 2018 మార్చిలో అందజేశారు. ఒక్కో ట్రాక్టర్‌కు గాను 50శాతం రాయితీ లేదా మూడున్నర లక్షలలోల ఏది తక్కువైతే అంత మొత్తాన్ని వర్తింపచేశారు. ఈక్రమంలో పథకం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం రూ. 21కోట్ల 50లక్షల రాయితీ ఇచ్చారు. 

ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు

విజయనిర్మల, ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి

ప్రస్తుతం రాయితీపై ట్రాక్టర్ల అందజేత గురించి ఎలాంటి  ఆదేశాలు లేవు. గతంలో నిధులు కేటాయించి, విధి విధానాలు నిర్ధేశించగా లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లు అందజేశాం. ప్రభుత్వం ఎప్పుడు అర్హుల వివరాలు అడిగినా చెప్పడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటించి, నిధులు మంజూరు చేస్తే ట్రాక్టర్లను పంపిణీచేస్తాం.

Updated Date - 2021-09-04T05:25:06+05:30 IST