పాజిటివ్‌ వచ్చిందని ఆగిన గుండె

ABN , First Publish Date - 2021-05-03T05:26:51+05:30 IST

: కొవిడ్‌ పరీక్ష కోసం వచ్చిన వ్యక్తి పాజిటివ్‌ అని తెలిసిన మరుక్షణమే గుండె ఆగింది. ఈ సంఘటన ఆదివారం ఖమ్మం జిల్లా మండల కేంద్రమైన తల్లాడలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.

పాజిటివ్‌ వచ్చిందని ఆగిన గుండె
మృతదేహాన్ని ఆటోలోకి తరలిస్తున్న వైద్య సిబ్బంది

తల్లాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ముందుకురాని బంధువులు

కరోనా పరీక్షలకు వచ్చి.. ప్రాణాలోదిలి

మహబూబాబాద్‌ వ్యక్తి ఖమ్మం పాతబస్టాండ్‌లో మృతి

 ఖమ్మం సంక్షేమ విభాగం/తల్లాడ, మే 2: కొవిడ్‌ పరీక్ష కోసం వచ్చిన వ్యక్తి పాజిటివ్‌ అని తెలిసిన మరుక్షణమే గుండె ఆగింది. ఈ సంఘటన ఆదివారం ఖమ్మం జిల్లా మండల కేంద్రమైన తల్లాడలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. తల్లాడ మండల పరిధిలోని బిల్లుపాడు గ్రామానికి చెందిన వ్యక్తి (55)ఐదు రోజులుగా కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నాడు. దాంతో  పరీక్షలకోసం భార్యతో కలిసి ఆయన తల్లాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. అయితే పరీక్షలు చేయించుకున్న అనంతరం పాజిటివ్‌  వచ్చిందని ఆరోగ్య సిబ్బంది చెప్పగానే అతడు కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి భార్యకు మాత్రం నెగెటివ్‌ వచ్చింది. అతడి మృతదేహాన్ని నాలుగు గంటల పాటు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉంచగా బంధువులు ఎవరూ తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆసుపత్రి స్టాఫ్‌నర్స్‌ కళావతి, ఏఎన్‌ఎం సునీత, కానిస్టేబుల్‌ నరసింహారావు పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని ఆటోలో బిల్లుపాడు తరలించి పంచాయతీ కార్యాలయానికి అప్పగించారు. పంచాయతీ ఆధ్వర్యంలో మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.

 కరోనా పరీక్షలకు వచ్చి.. ప్రాణాలోదిలి

 అనారోగ్యంతో ఉన్న ఆయన.. మెరుగైన వైద్యం కోసం పక్క జిల్లా నుంచి వచ్చాడు. కానీ వైద్య సేవలందించాలంటే తొలుత కరోనానిర్ధారణ చేయించుకోవాలని చెప్పడంతో పరీక్షల కోసం వెళ్లిన ఆయన నిర్ధారణ కేంద్రం వద్దే ప్రాణాలొదిలిన సంఘటన ఆదివారం ఖమ్మంలో జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన అనందాచారి(60) పలు దీర్ఘకాలిక వ్యాధులతో బాదపడుతూ మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో సదరు ప్రైవేట్‌ ఆసుపత్రికి బిల్లులు చెల్లించలేక, ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో అయితే మెరుగైన వైద్యం అందుతుందని భావించి కుటుంబసభ్యుల సహకారంతో ఆదివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఓపీ విభాగంలో పేరు నమోదు చేయించుకున్నాడు. ఆతర్వాత ఉదయం సమయంలో ఖమ్మం దవాఖానాలోని డయాలసిస్‌ విభాగం వద్దకు వెళ్లగా.. అక్కడ వైద్యసేవలు చేయాలంటే తొలుత కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సిబ్బంది సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్‌ ల్యాబ్‌కు తీసుకెళ్లగా.. అక్కడ పరీక్షలు చేయటం లేదని, జిల్లా ఆసుపత్రికి వచ్చిన రోగులు కూడా పాతబస్టాండ్‌కు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేయడంతో అనందాచారి నడవలేని స్థితిలో ఆయన ఖమ్మం పాత బస్టాండ్‌కు చేరుకున్నారు. కానీ అక్కడ ఉదయం9గంటలు దాటినా పరీక్షలలు ప్రారంభం కాలేదు. ఈ దశలో నిరీక్షిస్తూనే ఆనందాచారి కుప్పకూలి.. తుదిశ్వాస విడిచారు. దీంతో పక్కన ఉన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ అన్నం శ్రీనివాసరావు, ఆయన బృందం అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తరలించడంలో సాయం అందించారు. 

పూటకో ప్రాంతానికి ల్యాబ్‌ ఉద్యోగులు

జిల్లా హాస్పటల్‌ అధికారికంగా 500పడకలుగా ఉన్నా వెయ్యి పడకలకు మించిన స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నారు. 350పడకలతో కరోనా ఐసోలేషన్‌ వార్డు, 300 పడకలతో మాతా శిశు విభాగం మరో 350పడకలతో సాధారణ వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో గర్బిణులకు వైద్య పరీక్షలు, డెంగ్యూ మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులకు ఆసుపత్రిలోనే పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా జిల్లా ఆసుపత్రిలో ల్యాబ్‌ను మూసేసి ఆయా ఉద్యోగులను కరోనా పరీక్షల పేరుతో శారదా క్వారంటైన్‌ సెంటర్‌, మొబైల్‌ వాహనాలు, పాతబస్టాండ్‌ సెంటర్‌కు పరీక్షల కోసం పూటకో ప్రాంతానికి పంపుతున్నారు. కనీసం కాన్పు సమయంలో గర్బిణులకు పరీక్షలు చేసేందుకు కూడా ల్యాబ్‌ ఉద్యోగులు  అందుబాటులో లేరు. ఇలా విధులు కేటాయించటంపై వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిలో ల్యాబ్‌ ఉద్యోగులు అందుబాటులో లేకపోవటంతోనే అనందాచారి మృతి చెందాడని ఆసుపత్రిలోని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-03T05:26:51+05:30 IST