సింగరేణిలో తప్పని సమ్మె

ABN , First Publish Date - 2021-12-07T05:45:16+05:30 IST

సింగరేణిలో తప్పని సమ్మె

సింగరేణిలో తప్పని సమ్మె

ఆర్‌ఎల్‌సీతో జరిగిన చర్చలు విఫలం

ఆందోళనకు పిలుపునిచ్చిన కార్మికసంఘాలు

ఇల్లెందుటౌన్‌, డిసెంబరు 6: ఎలాంటి సమ్మెలు లేకుండా దశాబ్దాలుగా లాభాలబాటలో ప్రయాణిస్తున్న సింగరేణి కాలరీస్‌లో మూడు రోజల సమ్మె తప్పడం లేదు. జాతీయకార్మిక సంఘాలు, టీబీజీకేఎస్‌ తలపెట్టిన మూడు రోజుల నిరవదిక సమ్మెపై గతనెల 25న ఇచ్చిన సమ్మెనోటీసుపై చర్చించేందుకు సోమవారం హైదరాబాద్‌లో ఆర్‌ఎల్‌సీ(సెంట్రల్‌) వద్ద జరిగిన చర్చల్లో వివిధ కార్మిక సంఘాల డిమాండ్లు నేరవేరకపోవడంతో కార్మిక సంఘాలు ముందుగా ఇచ్చిన సమ్మెనోటీసు ప్రకారం మరోమారు సమ్మెకు పిలుపునివ్వడంతో సింగరేణిలో సమ్మె మేఘాలు కమ్ముకున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో  కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా తల పెట్టిన 88బొగ్గు గనుల ప్రవేటీకరణకు టెండర్లను ఆహ్వనించడం, అందులో  సింగరేణి కాలరీస్‌కు చెందిన నాలుగు బొగ్గుబ్లాకులు ఉండటం తో సింగరేణిలో కార్మికసంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.  సింగరేణి సొమ్ముతో  బొగ్గు  అన్వేషనణలు జరిపి దాదాపు రూ.80కోట్లు  వెచ్చించి రూపొందించిన కోల్‌బ్లాకులను ప్రవేట్‌పరం చేయడం కార్మికులకు, కార్మిక సంఘాలకు మింగుడుపడటంలేదు. సింగరేణిలో గల జాతీయకార్మిక సంఘాలు ఏఐటీయుసీ, ఐఎన్‌టీయుసీ, సీఐటీయు, బీఎంఎస్‌, హెచ్‌ఎం ఎస్‌ సంఘాలతోపాటు సింగరేణి గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకెఎస్‌ ఈనెల 9, 10, 11 తేదీల్లో బొగ్గు బ్లాకుల టెండర్లకు నిరసనగా సింగరేణి కాలరీస్‌లో మూడు రోజుల సమ్మెకు పూనుకోవాలని నిర్ణయించాయి. సమ్మె నోటీసుపై ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చల్లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతరామయ్య, ఐఎన్‌టీయూసీ నుంచి బి జనక్‌ప్రసాద్‌, టీబీజీకెఎస్‌ నుంచి బి.వెంకటరావు, మిర్యాలరాజిరెడ్డి, హెచ్‌ఎంఎస్‌ నుంచి రియాజ్‌అహ్మద్‌, సీఐటీయు నుంచి మంద నర్సింహరావు, బీఎంఎస్‌నుంచి పి మాధవనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి యజమాన్యం గతంలో చేసిన ఆగ్రిమెంట్‌కు భిన్నంగా సింగరేణిలోని కిష్టారం, సత్తుపల్లి, శ్రీరాంపూర్‌, కేటీకే ఓసీల్లో, భూపాలపల్లి, కొండాపూర్‌ అండర్‌గ్రౌండ్‌ మైన్‌లో, శాంతిగని మైన్‌ తదితర గనుల్లో కంటిన్యూస్‌మైనర్‌లను ప్రవేషపెట్టి ప్రవేట్‌ కాంట్రాక్టర్ల ద్వారా బొగ్గు ఉత్పత్తులు చేస్తుండటం పట్ల చర్చల్లో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశాయి. గతంలో సింగరేణిలో సమ్మెలు జరిగితే సమ్మెలో లేని సంఘాలతో సమ్మెను విఫలం చేసేందుకు యజమాన్యం తీవ్ర ప్రయాత్నాలు చేసేవి. అయితే ఈ సారి సమ్మెలో అన్ని జాతీయ కార్మికసంఘాలతో పాటు సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ సైతం ఉండటంతో సింగరేణి యజమాన్యానికి పాలుపోవడం లేదు. సింగరేణి సమ్మెకు విప్లవ కార్మికసంఘాలు సైతం సంపూర్ణమద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో నిరవధికంగా 72గంటల పాటు చేపట్టనున్న ఈ సమ్మెతో సింగరేణిలో సంపూర్ణంగా బొగ్గు ఉత్పత్తి స్తంభించనుందని కార్మికవర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2021-12-07T05:45:16+05:30 IST