సింగరేణి కార్మికులకు ‘బోనస్‌ పండుగ’

ABN , First Publish Date - 2021-10-07T06:11:42+05:30 IST

సింగరేణి కార్మికులకు ‘బోనస్‌ పండుగ’

సింగరేణి కార్మికులకు ‘బోనస్‌ పండుగ’

రేపు దసరా అడ్వాన్స్‌.. 11న లాభాల బోనస్‌ 

వచ్చే నెల 1న దీపావళి బోనస్‌ చెల్లింపు

సగటున ఒక్కో కార్మికుడికి రూ.లక్షా 15వేల లబ్ధి

ప్రకటించిన సీఎండీ శ్రీధర్‌

కొత్తగూడెం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికు లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన 29శాతం లాభాల బోనస్‌ సొమ్మును 11న చెల్లిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి ఉద్యోగులు, కార్మికుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 29శాతం లాభాల బోనస్‌ కింద కంపెనీ రూ.79.07కోట్లను కార్మికులకు పంపిణీ చేస్తుందని తెలిపారు. అలాగే ఇటీవల ప్రకటించిన దీపావళి బోనస్‌ను నవంబర్‌ 1న కార్మికుల ఖాతాల్లో జమచేయనున్నట్టు తెలిపారు. ఈ బోనస్‌ చెల్లింపుల కోసం సంస్థ రూ.300కోట్లను వెచ్చిస్తోందన్నారు. బోనస్‌గా ప్రతీ కార్మికుడు సుమారు రూ.72,500 అందుకోను న్నారని తెలిపారు. ఈ రెండు చెల్లింపులకు సింగరేణి మొత్తం గా రూ.379.07కోట్లు వెచ్చిస్తోందన్నారు. కాగా దసరా అడ్వాన్స్‌ కింద సంస్థ ప్రతి కార్మికుడికి రూ.25వేలు ప్రకటిందని ఈ డబ్బును శుక్రవారం (ఈనెల8న) చెల్లించనుందని తెలిపారు. ఈ బోనస్‌లు, పండుగ అడ్వాన్స్‌ కలిపి కార్మికులు సగటున సుమారు రూ.ఒకలక్షా 15వేల వరకు రానున్న మూడువారాల్లో అందుకోనున్నారని తెలిపారు. ఈ నేపధ్యంలో కార్మికులు రానున్న రోజుల్లో మరింతగా ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాలు సాధించాలని, తద్వారా ఈ ఏడాది మెరుగైన బోనస్‌లు, సంక్షేమం అందుకోవచ్చని తెలిపారు.  ఈ సందర్భంగా కార్మికులు, వారి కుటుంబాలకు సీఎండీ శ్రీధర్‌ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-10-07T06:11:42+05:30 IST