సీజ్‌ చేసినా.. బయటకు దర్జాగా తరలిపోతున్న ఇసుక

ABN , First Publish Date - 2021-02-06T04:13:17+05:30 IST

మణుగూరు మండలంలోని రామానుజవరం పంచాయతీ అక్రమ దందాకు అడ్డాగా మారింది. చెంతనే ఉన్న గోదావరి నది తీరం నుంచి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా మూడు పూలు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.

సీజ్‌ చేసినా.. బయటకు దర్జాగా తరలిపోతున్న ఇసుక
సీజ్‌ చేసిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్న దృశ్యం

చక్రం తిప్పుతున్న స్థానిక ప్రజాప్రతినిధి

ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నాం: డిప్యూటీ తహసీల్దార్‌ 


మణుగూరుటౌన్‌, ఫిబ్రవరి 5 : మణుగూరు మండలంలోని రామానుజవరం పంచాయతీ అక్రమ దందాకు అడ్డాగా మారింది. చెంతనే ఉన్న గోదావరి నది తీరం నుంచి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా మూడు పూలు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇందుకు నిదర్శనంగా గతంలో వందల సంఖ్యల లారీల ఇసుకను అక్రమంగా నిలువ చేయగా.. మైనింగ్‌, రెవెన్యూ అధికారులు సీజ్‌ చేసిన సంఘటనలు అనేకమున్నాయి.


మూడు, నాలుగు నెలల క్రితం సుమారు వెయ్యి లరీలకు పైగా గోదావరి నది ఒడ్డున గతంలో అనుమతినిచ్చిన ప్రదేశంలో అక్రమంగా నిల్వవ చేసిన ఇసుకను రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన ఇసుక నుంచి గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో కొందరు వ్యక్తులు తమకు అనుమతులున్నాయిని చెబు తూ.. వందల సంఖ్యల లారీల్లో అర్థరాత్రుల్లో ఇసుకను తరలించుకుపోయారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహరంలో రెవెన్యూ సిబ్బంది, స్థానిక నేతల హస్తం కూడా ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.


తాజాగా ఇంకా ఇప్పటికీ అక్కడ ఉన్న సీజ్‌ చేసిన ఇసుకను శుక్రవారం కొందరు అక్రమంగా ట్రాక్టర్‌లలో తరలించుకుపోతున్నారు. ఈ వ్యవహారాన్ని కొందరు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీని వెనుక ఓ స్థానిక ప్రజా ప్రతినిధి పాత్ర కీలకంగా ఉందని పేర్కొన్నారు. రామానుజవరం గ్రామ శివారున ప్రధాన రహదారికి పక్కనున్న గుట్టనుంచి, అటవీ భూమినుంచి లక్షల క్యూబిక్‌ మీటర్ల మొరాన్ని అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి రూ.లక్షల్లో గండి కొడుతున్నారు. ఇటీవల అక్రమంగా మొరాన్ని తరలిస్తున్న ట్రాక్టర్‌లను, తవ్వకాలు చేస్తున్న ఎక్స్‌కవేటర్‌ను పట్టుకున్న తహసీల్దార్‌ లూథర్‌ విల్సన్‌ రూ.వేలల్లో జరిమానా విధించిన విషయం తెలిసిందే. 


ఇసుక ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నాం

డిప్యూటీ తహసీల్దార్‌ కృష్ణ

రామానజవరం పంచాయతీలో సీజ్‌ చేసిన ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నాం. ప్రభుత్వ పనులకే తీసుకపోతున్నామని ట్రాక్టర్‌ డ్రైవర్‌ చెబుతున్నారు ఉన్నాతాధికారుల ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటాం. మొరం తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-02-06T04:13:17+05:30 IST