భూమికి భూమి ఇవ్వాల్సిందే

ABN , First Publish Date - 2021-05-05T05:52:32+05:30 IST

సీతమ్మసాగర్‌ బ్యారేజి నిర్మాణంలో నిర్వాసితులమవుతున్న తమకు భూమి బదులుగా భూమి.. లేని పక్షంలో ఎకరాకు రూ.50 లక్షల పరిహారమివ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు.

భూమికి భూమి ఇవ్వాల్సిందే
గ్రామసభలో మాట్లాడుతున్న అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వరరావు

లేకుంటే రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి

పెసా గ్రామసభలో తేల్చి చెప్పిన సీతమ్మసాగర్‌ రైతులు

మణుగూరుటౌన్‌, ఏప్రిల్‌ 4 : సీతమ్మసాగర్‌ బ్యారేజి నిర్మాణంలో నిర్వాసితులమవుతున్న తమకు భూమి బదులుగా భూమి.. లేని పక్షంలో ఎకరాకు రూ.50 లక్షల పరిహారమివ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. మంగళవారం రామానుజవరం పంచాయతీ కార్యాలయంలో సీతమ్మసాగర్‌ బ్యారేజీ భూ సేకరణలో భాగంగాఏర్పాటు చేసిన పెసా గ్రామసభలో రైతులు అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు తేల్చి చెప్పారు. ఇప్పటికే రామానుజవరం పంచాయతీలో అధిక శాతం రైతులు బీటీపీఎస్‌, ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మాణంలో భూములు కోల్పోయామని, వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమకు సీతమ్మసాగర్‌ నిర్మాణంలో కూడా భూములు కోల్పోయి ఎలా బతకాలని రైతులు ప్రశ్నించారు. బీటీపీఎస్‌, ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంత వరకూ ఉద్యోగాలివ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా నిర్వాసితులకు వెంటనే ఉద్యోగాలివ్వాలని, సీతమ్మసాగర్‌ నిర్వాసితులకు ఉద్యోగాలిస్తే భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తామని తెలిపారు. బీటీపీఎస్‌ రైల్వే ట్రాక్‌ నిర్వాసితులకు పరిహారం విషయంలో ఎటువంటి స్పష్టతనివ్వలేదని ఆరోపించారు. తమ డిమాండ్లను, అవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లును కోరారు. ఈ మేరకు గ్రామసభలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, కార్యదర్శి సునీత, సర్పంచ్‌ బాడిస సతీష్‌, రైతులు ఎడారి రమేష్‌, బత్తిని చందర్‌రావు, పెంట్యాల కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-05T05:52:32+05:30 IST