ఇసుక.. దొడ్డిదారిన చకచకా

ABN , First Publish Date - 2021-05-18T05:37:42+05:30 IST

అభయారణ్యంలోని కిన్నెరసాని నది నుంచి ఇసుక తోలకాలు జోరుగా సాగుతున్నాయి. అభయా రణ్యం నుంచి ఇసుకను తరలించేందుకు అనుమతులు లేకున్నా, సంబంధిత అధికారులు కాసులకు కక్కుర్తిపడి పట్టించుకోవడం లేదు.

ఇసుక.. దొడ్డిదారిన చకచకా
లింగగూడెం-రోళ్లగడ్డ మధ్య మల్లన్నవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద కిన్నెరసాని ఇసుక

కిన్నెరసాని అభయారణ్యంలో కాంట్రాక్టర్ల దూకుడు

పనుల పేరుతో పట్టణాలకు ఇసుక రవాణా

అడ్డగోలుగా అనుమతులిస్తున్న అధికారులు

గుండాల, మే 17: అభయారణ్యంలోని కిన్నెరసాని నది నుంచి ఇసుక తోలకాలు జోరుగా సాగుతున్నాయి. అభయా రణ్యం నుంచి ఇసుకను తరలించేందుకు అనుమతులు లేకున్నా, సంబంధిత అధికారులు కాసులకు కక్కుర్తిపడి పట్టించుకోవడం లేదు. మండలంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యలో ఇసుక అవసరం ఏర్పడింది. ఈనేపథ్యంలో కాంట్రాక్టర్లు కిన్నెరసానిలో ఇసుకతవ్వకాలు ప్రారంభించారు. వాస్తవానికి అభయారణ్యంలో ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదు. కానీ కాసులకు కక్కుర్తిపడుతున్న అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. గుండాల మండలంలో కిన్నెరసాని నుంచి ఆరు నెలల కిందట ఓ గుత్తేదారు టిప్పర్ల ద్వారా భారీగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. గుండాల పోలీసులు మూడు టిప్పర్లను పట్టుకుని, అందులో ఉన్న ఇసుకను సీజ్‌ చేసి, ఇల్లెందుకు కోర్టుకు రిమాండ్‌ చేశారు. ఇసుకపై కన్నేసిన గుత్తేదారులు గుండాల మండలంలోని పనులను టెండర్ల ద్వారా దక్కించుకుని, ఖమ్మం నుంచి కంకర దిగుమతి చేసి, తిరుగు ప్రయాణంలో ఇసుకను ఖమ్మం తరలించి అమ్ముకుంటున్నారు. గుండాల, ఆళ్లపల్లిలో వంతెనలు, రహదారులు నిర్మించేందుకు ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రాంతాలకు చెందిన గుత్తేదారులు టెండర్ల ద్వారా పనులు దక్కించుకున్నారు. అందులో భాగంగా కంకర దిగుమతి చేసి, తిరుగు ప్రయాణంలో ఇసుకను ఎక్స్‌కవేటర్‌తో లోడ్‌ చేసుకుని తీసుకుకెళ్తున్నారు. ఇటీవల గుండాల మండ లంలోని కిన్నెరసాని నుంచి అక్రమంగా ఇసుకను టిప్పర్ల ద్వారా ఖమ్మం తరలిస్తుండగా, కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సీజ్‌ చేశారు. ప్రస్తుతం లింగగూడెం-రోళ్లగడ్డ మధ్య నిర్మిస్తున్న వంతెనకు వందల ట్రాక్టర్ల ఇసుకను తోలేందుకు అటవీశాఖాధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. ఈ విషయమై గుండాల రేంజర్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Updated Date - 2021-05-18T05:37:42+05:30 IST