బిల్లుల చెల్లింపునకు మోక్షం?
ABN , First Publish Date - 2021-11-27T04:27:34+05:30 IST
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై నెలకొన్న గందరగోళం తొలగనుంది.

నామినేషన్ పనుల బిల్లుల చెల్లింపులో తొలగిన అనిశ్చితి
మేయర్ చొరవతో సమస్య పరిష్కారం
ఖమ్మం కార్పొరేషన్, నవంబరు26: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై నెలకొన్న గందరగోళం తొలగనుంది. రోజుకు 5 ఫైళ్లు మాత్రమే పరిశీలిస్తుండటం, ఇతర సమస్యలపై ఆంధ్ర జ్యోతిలో ప్రచురించిన కఽథనానికి నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్‌సురభి స్పందించారు. శుక్రవారం కాంట్రాక్టర్లు కమిషనర్‌ను కలువగా సమస్యలు పరిష్కరి స్తామని హామీ ఇచ్చారు. అలాగే మెప్మా ఆధ్వర్యంలోని టౌన్‌లెవెల్ ఫెడరేషన్ చేసిన నామినేషన్ పనుల బిల్లుల చెల్లింపులో అనిశ్చితి తొలగింది. సదరు బిల్లులు చెల్లిం చేందుకు జీఎస్టీ నెంబర్ లేకపోవటంతో బిల్లులు ఆగిపో యాయి. ప్రస్తుతం ఆ సమస్య కూడా సమసి పోయింది.
ఫైళ్ల పరిష్కారానికి చర్యలు
నగరపాలక సంస్థ పరిధిలో వివిధ పనులు చేసిన కాంరట్రాక్టర్ల బిల్లులకు చెందిన ఫైళ్ల పరిష్కారానికి కమిషనర్ చర్యలు తీసుకుంటానని శుక్రవారం హామీ ఇచ్చారు. శనివారం నుంయి ఫైళ్ల పరిశీలన వేగవంతం కానుంది. నగరపాలక సంస్థలోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డీఈలు పరిధిలో చేసిన పనులను ఒక ఏఈ ద్వారా పంపించటంతో ఎవరి ఫైళ్లు వెళుతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. రోజుకు కేవలం 5 ఫైళ్లు పంపటంతో పెండింగ్‌లో ఉన్న 3వందల ఫైళ్లు ఎప్పుడు పరిష్కారం అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. అంతేకాక ఒక్క డీఈ మాత్రమే ఫైళ్లు పంపటంతో పని ఒత్తిడి పెరిగింది. తప్పులు దొర్లటంతో కమిషనర్ ఫైళ్లను తిరస్కరిస్తున్నారు. పనులకు సంబంధించిన ఫొటోలు, అలాగే క్వాలిటీ కంట్రోల్ ధృవపత్రం తదితరాలు ఫైళ్లలో ఉంటున్నాయి. అయితే పని ఒత్తిడిలో వాటిని ఆన్ లైన్‌లో పంపకపోయినా, ఫైళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఒక్క ఫైలు తిరస్కరణకు గురైనా, మిగిలిన 4 ఫైళ్లను తిప్పిపంపటం సమస్యగా మారింది. పంపిన పైళ్లే తిరిగి పంపడంతో పనులు ముందుకు సాగటం లేదు. ఇక ఈ సమస్యకు చెక్ పెట్టనున్నారు. ఇంజనీరింగ్ విభాగంలోని అందరు డీఈలు వారి పరిధిలోని ఏఈలతో ఫైళ్లు తయారు చేయించనున్నారు. ఒక్కో డీఈ ఒక్కోరోజు ఫైళ్లు పంపేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మేయర్ చొరవతో తొలగిన అనిశ్చితి
ఇక నామినేషన్ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో నెలకొన్న అనిశ్చితి మేయర్ పునుకొల్లు నీరజ చొరవతో తొలిగిపోయింది. మెప్మా ఆధ్వర్యంలో టౌన్‌లెవెల్ ఫెడరేషన్ చేసిన నామినేషన్ పనులకు చెల్లించవలసిన బిల్లులకు జీఎస్టీ నెంబర్ లేకపోవటం అడ్డంకిగా నిలిచింది. తొలుత నెంబరు ఉన్నా, తరువాత మెప్మా బాధ్యులకు తెలియకుండానే రద్దు చేయించారు. ఇలా మూడు సార్లు జరగటంతో జీఎస్టీకి సంబంశించిన నెంబర్ వస్తుందో రాదో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే మేయర్ చొరవ తీసుకొని, ఈ విషయంపై కాంట్రాక్టర్లు, అక్కౌంట్స్ విభాగం అధికారులతో రెండుసార్లు సమావేశం నిర్వహించారు. జీఎస్టీ అధికారులతో చర్చించి, జీఎస్టీ నెంబర్ వచ్చే విధంగా చూశారు. దీంతో నామినేషన్ పనులకు సంబంధించిన బిల్లుల సమస్య పరిష్కారం అయింది.