నాణ్యత నాసి.. నిధులు మేసి

ABN , First Publish Date - 2021-03-25T05:16:57+05:30 IST

మండల పరిధి రామారావుపేటలో నిర్మిస్తున్న బీటీ రహదారి పనుల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

నాణ్యత నాసి.. నిధులు మేసి
రామారావుపేట రహదారి పనులు

  రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకం

 ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆదివాసీలు

దుమ్ముగూడెం, మార్చి 24: మండల పరిధి రామారావుపేటలో నిర్మిస్తున్న బీటీ రహదారి పనుల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భద్రాచలం ప్రధాన రహదారి నుంచి రామారావుపేట వంతెన వరకు 3.5 కిలోమీటర్ల పొడవునా రూ.77లక్షల డీఎంఎఫ్‌ నిధులతో  రెండు రోజులుగా బీటీ రహదారిని నిర్మిస్తున్నారు. నిబంధనల ప్రకారం 30ఎంఎం మందం బీటీతో రహదారి నిర్మాణం జరగాల్సి ఉండగా, చాలా చోట్ల 15 ఎంఎం కూడా వేయడం లేదు. ఊరే దాటే వరకూ నాణ్యతగా, ఊరు దాటిన తర్వాత నాసిరకంగా బీటీ వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బీటీ నిర్మాణానికి ముందు చేయాల్సిన ప్యాచ్‌ వర్క్‌ సైతం మొక్కుబడిగా నాలుగు రాళ్లు పోసి పైన బీటీ వేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే రహదారికి ఇరువైపులా కొన్ని ప్రాంతాల్లో షోల్డరు భాగం కోతకు గురవగా, దాన్ని సరిచేయకుండా ఏదో మొక్కుబడిగా పనులు నిర్వహిస్తున్నారని స్థానిక ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. పనులను నాణ్యవంతంగా చేయాలని స్థానిక ఆదివాసీలు కోరుతున్నారు.

పనులు నాసిరకంగా ఉన్నాయి

రహదారి నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానిక ఆదివాసీలు కారం సత్యం, వర్సా కృష్ణ, సోడి రాంబాబు, పూనెం రవి ఆరోపించారు. బీటీ మందం కొన్ని చోట్ల బాగా తక్కువగా వేస్తున్నారని తెలిపారు. వడ్డిగుంపు దగ్గర నుంచి సీతారాంపురం వైపుకు పనుల నాణ్యత అసలు బాగాలేదని ఆరోపించారు. ఏడేళ్ల తర్వాత జరుగుతున్న పనులపై ఎంతో ఆశపెట్టుకున్నామని, నాణ్యత బాగా లేకపోవడంతో పనులు ఎంతకాలం నిలుస్తాయో తెలియడం లేదని అన్నారు. 

డీఈ ఏమంటున్నారంటే..

ఈ విషయమై డీఈను వివరణ కోరగా, బీటీ మందం తక్కువగా ఉన్న చోటును గుర్తించి సరిచేస్తామని తెలిపారు. షోల్డరు భాగాలను మట్టితో నింపుతామన్నారు. పనులు నాణ్యవంతంగానే జరుగుతున్నాయని వివరించారు. 

Updated Date - 2021-03-25T05:16:57+05:30 IST