విద్యుదాఘాతంతో తల్లీకొడుకు దుర్మరణం
ABN , First Publish Date - 2021-10-30T04:09:59+05:30 IST
విద్యుదాఘాతంతో తల్లీకొడుకు దుర్మరణం
ఇంట్లో లేకపోవడంతో చిన్న కుమారుడికి తప్పిన ప్రమాదం
తల్లాడ మండలం బిల్లుపాడులో విషాదం
తల్లాడ, అక్టోబరు 29: వర్షం వస్తోందని ఆరుబయట ఆరవేసిన దుస్తు లను తీసి ఇంట్లోని జీవైర్‌పై ఆరేసేందుకు ప్రయత్నించిన క్రమంలో విద్యు త్‌షాక్‌కు గురై తల్లీకుమారుడు మృతిచెందిన సంఘటన ఖమ్మంజిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలోని డీబీ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన షేక్.నసీమోన్(40) అనే మహిళ తన ఇద్దరు కుమారులు షేక్.సైదా(22), మస్తాన్‌తో కలిసి జీవిస్తోంది. అయితే శుక్రవారం రాత్రి వర్షం పడగా.. ససీమోన్ ఇంటి ఆరు బయట ఆరవేసిన దుస్తులను తీసి ఇంట్లో ఉన్న జీవైర్‌పై ఆరవేయబోగా ఆ వైరుకు విద్యుత్ సరఫరా జరిగి కింద పడిపోగా.. అక్కడే ఉన్న పెద్ద కుమారుడు సైదా తల్లిని రక్షించుకునే క్రమంలో ఆమెను పట్టుకోగా అతడికి కూడా విద్యుత్ ప్రసారం జరిగింది. అయితే విద్యుత్‌షాక్ తీవ్రతకు వారు పక్కనే ఉన్న తాగునీటి కుండపై పడటంతో ఆ కుండ పగిలి గదినిండా నీరు చేరి.. తల్లీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అయితే నసీమోన్ చిన్నకుమారుడైన మస్తాన్ ప్రమాద సమయంలో స్నేహితులను కలిసేందుకు బజారుకు వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే విద్యుత్‌షాక్‌కు గురై తల్లీకొడుకులు ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసిన చుట్టుపక్కల వారు విద్యుత్ సరఫరాను నిలిపేసి.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలాన్ని తల్లాడ ఎస్‌ఐలు జి.నరేష్, సూరజ్ సందర్శించి.. కేసు నమోదు చేసుకున్నారు.