నీలినీడ!

ABN , First Publish Date - 2021-08-11T05:04:11+05:30 IST

అసలే కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థ కుదేలవడంతో.. విద్యార్థుల భవిష్యతను దృష్టిలో ఉంచుకుని వారికి విద్యను చేరువ చేసే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఆనలైన క్లాసులకు శ్రీకారం చుట్టాయి

నీలినీడ!

అశ్లీలతవైపు యుక్తవయసు విద్యార్థుల అడుగులు

ఆనలైన క్లాసుల నేపథ్యంలో మరింత చేరువ

బయటకు చెప్పుకోలేక సతమతమవుతోన్న తల్లిదండ్రులు

పర్యవేక్షణ అవసరమంటున్న వైద్య నిపుణులు

ఖమ్మానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ క్లాసులు కావడంతో ఫోన్‌కు బానిసయ్యాడు. చేతిలో నుంచి కిందపెట్టనంత స్థాయికి చేరింది. దీంతో అనుమానం వచ్చిన తండ్రి ఆ విద్యార్థి చూసే ఫోన్‌ను పరిశీలించి ఖిన్నుడయ్యాడు. తన కుమారుడు అశ్లీల చిత్రాలను చూస్తున్నట్టు గుర్తించాడు. ఓవైపు తన కుమారుడిని మందలించలేక.. మరో వైపు ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక మదనలపడిపోయాడు. చివరకు డాక్టర్‌ను ఆశ్రయించాడు. మరో కుటుంబంలోనూ ఇంటర్‌ చదివే విద్యార్థి విషయంలో తల్లిదండ్రులకు ఇలాంటి సంఘటనే ఎదురైంది. అయితే ఇది చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యగా.. ఎంతోమందిని ఆవేదనకు గురిచేస్తున్న సమస్యగా తెలుస్తోంది. ఇన్ని రోజులు ‘మా అబ్బాయి నిత్యం ఫోన్లోనే ఉంటాడండీ.. ఆ ఫోన ఉంటే చాలు చుట్టుపక్కల ఏమి జరిగినా పట్టించుకోడు’ అని చెప్పిన తల్లిదండ్రులందరికీ.. ఇప్పుడు అసలు తమ పిల్లలు వాడే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ తదితర గ్యాడ్జెట్స్‌లో ఏమి చేస్తున్నారో పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతోంది. పెరుగుతున్న సాంకేతికత పలు అనర్థాలకు కారణమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఖమ్మం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): అసలే కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థ కుదేలవడంతో.. విద్యార్థుల భవిష్యతను దృష్టిలో ఉంచుకుని వారికి విద్యను చేరువ చేసే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఆనలైన క్లాసులకు శ్రీకారం చుట్టాయి. దీంతో అప్పటి వరకు విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్లు అందిస్తే చెడిపోతారు అన్న భావనలో ఉన్న తల్లిదండ్రులు కూడా అనివార్యంగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను చేతికివ్వాల్సి రావడం, ఎలాంటి అవాంతరాలు లేకుండా క్లాసులు వినేందుకుగాను మెరగైన ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ తమ పిల్లలపై ఉన్న ప్రేమ, నమ్మకంతో ఆనలైన క్లాసులు విన్న తర్వాత అసలు ఫోన్లు, ఇతర గాడ్జెట్స్‌లలో ఎలాంటి పనులు చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు పరిశీలించడం లేదు. ఈ క్రమంలోనే యుక్తవయసులో ఉన్న కొందరు విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారు. కానీ ఇటీవల కాలంలో క్లాసులు పూర్తయిన తర్వాత అశ్లీల చిత్రాల వెబ్‌సైట్లను ఒపెన చేస్తున్నారని కొందరు తల్లిదండ్రులు డాక్టర్లు, మిత్రులు, శ్రేయోభిలాషుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలున్నాయి. ఫలితంగా పిల్లలు అప్రయత్నంగా బూతుసైట్లకు బానిసలుగా మారిపోతున్నారు. 

యుక్త వయసు పిల్లలే అధికం: 

యుక్తవయసు పిల్లల్లో జరిగే శారీరక, మానసిక మార్పులు, హార్మోన్మ ప్రభావంతో.. వారు స్వతంత్రంగా ఉండేందుకు, స్నేహితులకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తుండటం, ప్రత్యేక గుర్తింపు కోసం తపిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయంలో వారికి సెల్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌ అందుబాటులో ఉండటంతో అశ్లీల సైట్లు, సినిమాల వైపు వారి దృష్టి మళ్లుతుందని, ప్రస్తుతం సాంకేతిక కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇలా చెడుమార్గం పడుతున్నారని చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లడం, పల్లె ప్రాంతాల్లోని చాలామంది తల్లిదండ్రులకు స్మార్ట్‌ ఫోన పై అవగాహన లేకపోవడం, ఇంట్లో పెద్దవాళ్లు వ్యవసాయ, కూలీ పనులకు వెళ్లడం లాంటి వాటిని యుక్తవయసు విద్యార్థులు అవకాశంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. తమకున్న సౌకర్యాలను అవకాశంగా తీసుకుని పోర్న్‌ సైట్లకు బానిసలవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే పిల్లల్లో వచ్చే మార్పులు, వ్యవహరిస్తున్న తీరును తల్లిదండ్రులు పసిగట్టగలిగితే కౌన్సెలింగ్‌ ఇచ్చి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని, తొలినాళ్లలోనే వారిని ఈ జాఢ్యం నుంచి బయటపడేయొచ్చని మానసిక వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దుష్పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

తల్లిదండ్రులు, పెద్దల పర్యవేక్షణ అవసరం..

పిల్లలు ఇలాంటి వాటికి బానిసలు కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, కుటుంబంలోని ఇతర పెద్దల పర్యవేక్షణ చాలా అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. భవిష్యత గురించి ఆందోళన చెందకుండా.. శారీరకంగా, మానసికంగా వారిలో వస్తున్న మార్పులను గుర్తించాల్సి ఉంటుందంటున్నారు. వారిని ఒంటరిగా వదిలేస్తే తీవ్రమైన అలజడికి లోనై.. మానసికంగా కుంగిపోవడమే కాకుండా భావోద్వేగాలను ఓర్చుకోలేని వారుగా తయరవుతారు. ప్రత్యుత్పత్తి అవయవాలలో గుణాత్మకమైన మార్పుల కారణంగా సెక్స్‌ సమస్యలకు గురవతారు. ఈ దశలోనే పోర్స్‌ సైట్లకు బానిసలుగా మారుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి విషయాలను పిల్లలలో ఎలా మాట్లాడాలన్న సందేహం ప్రస్తుతం ప్రతీ తల్లిదండ్రులను తొలుస్తోంది. పిల్లలతో ఓపికగా మాట్లాడి.. వారి పరిస్థితిని అర్థం చేసుకుని పరిష్కారాన్ని చూపాలి. మాట వినడంలేదని కఠినంగా వ్యవహరించకుండా, వారి తప్పులను గుర్తించి సున్నితంగా హెచ్చరించడం ద్వారా మెరుగైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. 

అవగాహన లేకే అలాంటి చర్యలు..

డాక్టర్‌ కంభంపాటి నారాయణరావు, మానసిక వైద్యనిపుణుడు, ఖమ్మం

వయసులో ఉన్నప్పుడు అప్పుడప్పుడే కోరికలు ప్రారంభమవుతుంటాయి. వారికి ఆ సమయంలో సమాజంలోని పరిస్థితులపై అవగాహ న ఉండదు. వయసు పెరుగుతున్నా కొద్ది అయా కోరికలు మారతాయి. ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండటంతో పాటు స్వేచ్ఛ కూడా దొరుకుతోంది. ఈ క్రమంలోనే చాలామంది యుక్తవయసు విద్యార్థులు అశ్లీలత పట్ల ఆకర్షితులవుతున్నారు. మొదట్లో వారికి కొద్దిస్థాయిలో అనిపించినా రానురాను ఒక వ్యసనంగా మారుతోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. పిల్లల్లో మార్పులు గమనిస్తే స్నేహభావంతో సమస్యను పరిష్కరించుకోవాలి. పిల్లలతో చెప్పుకోలేక మదనపడుతున్న తల్లిదండ్రులు మానసిక వైద్యుల దగ్గరకు తీసుకువెళ్తే మంచిది. 


Updated Date - 2021-08-11T05:04:11+05:30 IST