పండువారిగూడెంలో పోడు వివాదం

ABN , First Publish Date - 2021-03-03T05:24:42+05:30 IST

మండలంలో పోడు వివాదం రోజురోజుకు ముదురుతుంది. గిరిజనులు, అటవీ అధికారుల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది.

పండువారిగూడెంలో పోడు వివాదం
అఽధికారులు, గిరిజనులకు మధ్య తోపులాట

 గిరిజనులు, అటవీ అధికారుల మధ్య తోపులాట

అశ్వారావుపేట రూరల్‌, మార్చి 2: మండలంలో పోడు వివాదం రోజురోజుకు ముదురుతుంది. గిరిజనులు, అటవీ అధికారుల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది. మండలంలోని మల్లాయిగూడెం పంచాయతీలోని పండువారిగూడెంలో మంగళవారం పోడు వివాదం చెలరేగింది. గిరిజనులు సాగు చేస్తున్న పోడుభూముల్లో అటవీ అధికారులు ట్రెంచ్‌ పనులు చేయటానికి రాగా గిరిజనులు అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. పాలవాగు వద్ద గిరిజనులు దాదాపు మూడు వందల ఎకరాల భూమిని పోడు చేసుకుని సాగు చేసుకుంటున్నారు. ఇదే తరుణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మంగళవారం అధికారులు ట్రెంచ్‌ తీసేందుకు జేసీబీని తీసుకెళ్లి పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గిరిజనులు పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. అనేక సంవత్సరాలుగా ఇదే భూమిని నమ్ముకుని జీవిస్తున్నామని తెలిపారు. తమకు పట్టాలు ఇవ్వకపోగా భూములు లాక్కోవాలని చూడటం దారుణమన్నారు. ఒకానోక దశలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివాదాన్ని సర్దుమణిగించారు. సర్పంచ్‌ నారం రాజశేఖర్‌ సంఘటన స్థలానికి వచ్చి గిరిజనులకు మద్దతుగా నిలిచారు. అనేక సంవత్సరాలుగా పేద గిరిజనులు పోడు చేసుకుని జీవిస్తున్నారని అన్నారు. అటవీ అధికారులు తమ చర్యలను మానుకోవాలని కోరారు. 


Updated Date - 2021-03-03T05:24:42+05:30 IST